
ముంబై: ఆభరణాల విక్రేత కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 16 శాతంపైగా బలపడి దాదాపు రూ. 135 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 3,435 కోట్లను అధిగమించింది.
షోరూముల రీలొకేషన్, సిబ్బందికి బోనస్ నేపథ్యంలో రూ. 8 కోట్లమేర ఒకేసారి వ్యయాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మధ్యప్రాచ్యం నుంచి ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 515 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. కోవిడ్–19 తదుపరి అత్యధిక శాతం షోరూముల్లో అమ్మకాలు కరోనా మహమ్మారి ముందుస్థాయికి మించి నమోదైనట్లు వెల్లడించింది. ఈకామర్స్ విభాగం క్యాండీర్ విక్రయాలు 40 శాతం ఎగసి రూ. 47 కోట్లను తాకాయి. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా 21 రాష్ట్రాలు, మధ్యప్రాచ్యంలోని నాలుగు దేశాలతో కలిపి మొత్తం 151 స్టోర్లు నిర్వహిస్తోంది.
ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ. 68 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment