బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(Q3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం ఎగసి రూ. 11,056 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 9,444 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1,17,017 కోట్ల నుంచి రూ. 1,06,891 కోట్లకు క్షీణించింది.
ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం రూ. 2,12,447 కోట్ల నుంచి రూ. 2,01,994 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణా వ్యయాలు రూ. 18,194 కోట్ల నుంచి రూ. 14,416 కోట్లకు తగ్గాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 డిసెంబర్‌కల్లా 10 శాతం బలపడి రూ. 54,77,651 కోట్లను తాకాయి. బీమా సఖి యోజన పథకంలో భాగంగా ఇప్పటివరకూ 1.25 లక్షల మంది మహిళలు రిజిస్టరైనట్లు ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. బీమా సఖిగా 70,000 మంది ఎంపికైనట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 811 వద్ద ముగిసింది.
ఫోర్టిస్ హెల్త్‌కేర్ లాభం జూమ్
దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఫోర్టిస్ హెల్త్‌కేర్ (Fortis Healthcare) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 89 శాతం పెరిగి రూ.254 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.134 కోట్లుగా ఉండడం గమనార్హం. బెంగళూరులోని రిచ్‌మండ్ రోడ్ హాస్పిటల్‌ను విక్రయించడం రూపంలో వచ్చిన రూ.23.5 కోట్లు కూడా లాభాల్లో కలసి ఉన్నట్టు సంస్థ తెలిపింది.
ఆదాయం ఇదే కాలంలో రూ.1,680 కోట్ల నుంచి రూ.1,928 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,515 కోట్ల నుంచి రూ.1,696 కోట్లకు పెరిగిపోయాయి. ‘‘క్యూ3లోనూ సానుకూల పనితీరును కొనసాగించాం. మా కన్సాలిడేటెడ్ ఆదాయంలో ఆస్పత్రుల వ్యాపారం 84 శాతం సమకూర్చింది’’అని ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈవో అశుతోష్ రఘువంశీ తెలిపారు. ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, కార్డియాక్ సైన్సెస్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, రీనల్‌సైన్సెస్‌తో కూడిన స్పెషాలిటీ విభాగం నుంచే 62 శాతం ఆదాయం వచ్చినట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్సీలో ఈ షేరు 0.8% నష్టపోయి రూ.646 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment