న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెలువరించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 4% క్షీణించి రూ. 7,621 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం తగ్గడం, కుటుంబ పెన్షన్‌లో రూ. 464 కోట్ల పెరుగుదల ప్రభావం చూపాయి.
గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 7,925 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు ఎగసింది. అయితే ఇతర ఆదాయం రూ. 248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ. 145 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,94,335 కోట్ల నుంచి రూ. 2,22,366 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.43 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి.
హెల్త్ ఇన్సూరెన్స్‌పై కన్ను
ఈ ఆర్థిక సంవత్సరంలోగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా.. సరైన సంస్థ కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. మార్చిలోగా వాటా కొనుగోలుకు తుది రూపునివ్వనున్నట్లు వెల్లడించారు. టార్గెట్ సంస్థ విలువనుబట్టి ఎంత వాటా కొనుగోలు చేసేదీ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 1.6% నష్టంతో రూ. 915 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment