
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి భారీ మొత్తంలో జీఎస్టీ (GST) చెల్లించాలని నోటీసు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుంచి జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ అందుకున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీతో కలిపి మొత్తం రూ.479.88 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో ఉంది.
ఈ రూ.479.88 కోట్ల మొత్తంలో జీఎస్టీ రూపంలో రూ.242.23 కోట్లు, వడ్డీ కింద రూ.213.43 కోట్లు, పెనాల్టీ రూపంలో రూ.24.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తప్పుగా పొందడం, షార్ట్ రివర్స్ చేయడం, ఆలస్య చెల్లింపులపై వడ్డీ, తక్కువ పన్ను చెల్లించడం వంటి కారణాలతో ఈ నోటీసు జారీ చేసినట్లుగా ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ ఆర్డర్‌ను ముంబైలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (అప్పీల్స్) ముందు అప్పీల్ చేసే అవకాశం ఉందని ఎల్ఐసి పేర్కొంది. కాగా ఈ డిమాండ్ నోటీసు తమ ఆర్థికాంశాలు లేదా కార్యకలాపాలపై నేరుగా ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. ‘ఈ డిమాండ్ ఆర్థిక ప్రభావం జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీల వరకే ఉంటుంది. కార్పొరేషన్ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావం ఉండదు" అని ఎల్ఐసీ తెలిపింది.
మెరుగైన లాభాలు
ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో ఎల్ఐసీ బలమైన పనితీరును ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మెరుగైన పెట్టుబడి ఆదాయం, అధిక ప్రీమియం వసూళ్లతో లాభంలో 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కార్యకలాపాల నుండి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. లాభాల వృద్ధితో పాటు ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment