సాక్షి,ముంబై : ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనా వేసినదానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నికర లాభాల్లో ఏకంగా 131 శాతం పుంజుకుంది.
గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన క్యూ3లో రూ.1681 కోట్ల నికరలాభాలను ఆర్జించింది. ఇది రూ.1197కోట్లుగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నిరర్థక ఆస్తుల్లో స్వల్పంగా క్షీణత నమోదైంది. బ్యాంకు మాజీ సీఈవో శిఖా శర్మ ఆధ్వర్యంలో నికర లాభం, వడ్డీ లాభం సహా అన్ని విధాలుగా మెరుగైన ప్రదర్శనతో బ్యాంకు ఆకట్టుకుంది.
నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 2.54 నుంచి 2.36 (రూ.12233.3 కోట్లు) శాతానికి తగ్గగా, గ్రాస్ ఎన్‌పీఏ 5.9 నుంచి 5.7 (రూ.30854.70 కోట్లు)శాతానికి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.5603.60 కోట్లు గా నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.47 శాతం, ప్రొవిజన్స్ రూ.3054 కోట్లు, రిటైల్ లోన్ బుక్ వృద్ధి 20 శాతంగా ఉన్నాయి. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రేపటి ట్రేడింగ్లో యాక్సిస్ బ్యాంకు కౌటర్లో లాభాలను అంచనావేస్తున్నారు ఎనలిస్టులు.
Comments
Please login to add a commentAdd a comment