ఆంధ్రాబ్యాంక్ ఫలితాలు ఆకర్షణీయం
⇒ క్యూ3లో నికరలాభం 339 శాతం వృద్ధి
⇒ వచ్చే ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి లక్ష్యం
⇒ తొమ్మిది నెలల్లో రూ. 2,000 కోట్ల నిధుల సమీకరణ
⇒ మార్చిలోగా వడ్డీరేట్లు మరో పావు శాతం తగ్గే అవకాశం
⇒ ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్. రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదిలించుకొని, ఇదే సమయంలో అధిక వడ్డీ ఉన్న రుణాలపై దృష్టిసారించడం ద్వారా ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(క్యూ3) నికరలాభంలో 339 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 46 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 202 కోట్లకు చేరింది. సమీక్షకాలంలో డిపాజిట్ల సేకరణ వ్యయం 17 బేసిస్ పాయింట్లు తగ్గితే, రుణాలపై ఈల్డ్స్ 51 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ తెలిపారు.
ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీరేట్లు ఉన్న బల్క్ డిపాజిట్లను వదిలించుకొని, చౌకగా విదేశీ నిధులను సేకరించడం ద్వారా డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకున్నట్లు తెలిపారు. సమీక్షా కాలంలో డిపాజిట్ల సేకరణ వ్యయం 7.84 శాతం నుంచి 7.66 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో రుణాలపై రాబడి 11.15 శాతం నుంచి 11.66 శాతానికి పెరిగింది.
మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 3,901 కోట్ల నుంచి రూ.4,540 కోట్లకు చేరింది. బ్యాంకు వ్యాపార పరిమాణం 11 శాతం వృద్ధితో రూ. 2.34 లక్షల కోట్ల నుంచి రూ. 2.60 లక్షల కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలంలో వ్యాపారంలో 14 శాతం వృద్ధి నమోదయ్యిందని, వచ్చే ఏడాది 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు రాజేంద్రన్ తెలిపారు.
తగ్గని నిరర్థక ఆస్తులు
ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు స్థిరంగా ఉంటే, నికర నిరర్థక ఆస్తులు స్వల్పంగా తగ్గాయి. స్థూల నిరర్థక ఆస్తులు రూ. 7,118 కోట్లు(5.99%), నికర నిరర్థక ఆస్తులు రూ.4,264 కోట్లు (3.70%)గా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో కొత్తగా రూ. 430 కోట్ల ఎన్‌పీఏలు జతైనట్లు రాజేంద్రన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ మాఫీ నిధులను ఆలస్యంగా విడుదల చేయడం వల్ల ఈ త్రైమాసికంలో ఎన్‌పీఏలు తగ్గలేదని, దీని ప్రభావం ప్రస్తుత త్రైమాసికంలో కనిపిస్తుందన్నారు.
దీంతో మార్చి నాటికి స్థూల ఎన్‌పీఏ 5%కి పరిమితమవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇక వడ్డీరేట్ల విషయానికి వస్తే ఆర్‌బీఐ మార్చిలోగా మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రుణాలను తక్కువ రేటుకే అందిస్తుండటంతో బేస్ రేటును తగ్గించలేదని, మార్చిలోగా బేస్‌రేటు తగ్గిస్తామన్నారు.
నిధుల సేకరణ
వ్యాపార విస్తరణకు కావల్సిన మూలధనం కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో బాండ్ల రూపంలో నిధులను సేకరించే యోచనలో ఉన్నట్లు రాజేంద్రన్ తెలిపారు. వడ్డీరేట్లు తగ్గితే వచ్చే తొమ్మిది నెలల్లోగా రూ. 2,000 కోట్ల వరకు సమకూర్చుకోనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మార్చిలోగా రూ. 500 కోట్లు టైర్-2 బాండ్లను జారీ చేయడంతో పాటు, వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో మరో రూ. 1,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. మార్చిలోగా కొత్తగా 200 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్యను 2,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఫలితాల నేపథ్యంలో ఆంధ్రా బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 1.1% లాభపడి రూ. 91 వద్ద ముగిసింది.