![Sensex and Nifty down 12 percent from highs but sectoral indices fall more than 20 percent to enter bear market territory](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/STOCK-MARKET-DOWN.jpg.webp?itok=g9WKWqi4)
జనవరిలో పలు ఖాతాలు క్లోజ్
మార్కెట్ల పతన ప్రభావం
సెన్సెక్స్, నిఫ్టీ 12 శాతం డౌన్
మిడ్, స్మాల్ క్యాప్స్ 17 % క్షీణత
నాలుగేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్ల(Stock markets)లో బుల్ ట్రెండ్ కొనసాగడంతో ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను చేరాయి. అయితే ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టడం, రాజకీయ భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బకొట్టాయి. దీంతో గతేడాది అక్టోబర్ మొదలు స్టాక్ మార్కెట్లు(Stock markets) తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టాల నుంచి 17 శాతానికిపైగా పతనమయ్యాయి. వెరసి గత ఆరు నెలల్లో పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడులకు నష్టాలు వాటిల్లుతున్నాయి. మరోపక్క మార్కెట్ ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సైతం 12 శాతం క్షీణించాయి.
సిప్ బేజారు...
నిజానికి గత కేలండర్ ఏడాది(2024)లో క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్) భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 2.89 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు గతేడాది రూ. 35,000 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇదే కాలంలో లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపు..! అయితే గత 6 నెలలుగా పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు చెందిన సిప్ పథకాలపై రిటర్నులు ప్రతికూలంగా నమోదవుతున్నా యి. 2024 డిసెంబర్‌లో ఇన్వెస్టర్లు 4.5 మిలియన్ సిప్ ఖాతాలను మూసివేశారు. ఇంతక్రితం 2024 మే నెలలో మాత్రమే 4.4 మిలియన్ సిప్ ఖాతాలు నిలిచిపోయాయి.
నేలచూపులో
వివిధ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడుల తీరును గమనిస్తే.. మూడేళ్ల కాలంలో మంచి పనితీరునే చూపినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే ప్రతికూల ప్రతిఫలాలు నమోదవుతున్నాయి. వివిధ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాలో క్వాంట్‌ను తీసుకుంటే గత మూడేళ్లలో 19 శాతం రిటర్నులు అందించగా.. గత 12 నెలల్లో 15.6 శాతం క్షీణతను చవిచూసింది. ఈబాటలో టారస్ మూడేళ్లలో 15 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 12 శాతంపైగా నీరసించింది. మిరే అసెట్ మూడేళ్లలో 18 శాతం పుంజుకోగా.. ఏడాదిలో 6 శాతంపైగా నష్టపోయింది. ఇదేవిధంగా టాటా గ్రోత్, యూటీఐ, ఏబీఎస్‌ఎల్, మహీంద్రా మాన్యులైఫ్ మూడేళ్లలో 20–24 శాతం రిటర్నులు అందించినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే 5–4 శాతం మధ్య తగ్గాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
2024 అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అక్టోబర్ మొదలు ఇప్పటి(ఫిబ్రవరి7)వరకూ ఎఫ్‌పీఐలు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కొత్త ఏడాది(2025) జనవరి నుంచి చూస్తే రూ. లక్ష కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఏడాది కనిష్టాలకు..
బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 131 షేర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ఈ జాబితాలో డెల్టా కార్ప్ హోనసా కన్జూమర్, జేకే టైర్, మిశ్రధాతు నిగమ్, టాటా కెమికల్స్, ఎన్‌సీసీ, రైట్స్, మదర్‌సన్ సుమీ, ఎస్‌కేఎఫ్ ఇండియా చేరాయి. గత రెండు నెలల్లో 433 చిన్న షేర్ల మార్కెట్ విలువలో 20%ఆవిరైంది. వీటిలో 100 షేర్ల విలువ 30–40% మధ్య పతనమైంది. గత నెల రోజుల్లో రెండేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న పలు కౌంటర్లు 40–30 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో న్యూజెన్ సాఫ్ట్‌వేర్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, నెట్‌వెబ్ టెక్నాలజీస్, జూపిటర్ వేగన్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అనంత్‌రాజ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment