గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.75 లక్షలు పైబడిన గృహ రుణాలపై వడ్డీరేటును 0.15% మేర తగ్గించింది.ఇదే సమయంలో రుణాలకు సంబంధించి శ్లాబ్‌లను ఎత్తివేసింది. దీని ప్రకారం గృహ రుణం ఇకపై ఎంత మొత్తం అయినా 10.15% వడ్డీ అమలవుతుంది. అయితే మహిళలకు సంబంధించి 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05%(100 బేసిస్ పాయింట్లు 1%) రాయితీ ఉంటుంది. ఈ వడ్డీరేటు 10.10%గా అమలవుతుంది. బ్యాంక్ బేస్ రేటు (ఇంతకన్నా తగ్గించి రుణ రేటు ఉండడానికి వీలు లేదు) ప్రస్తుతం 10%. అంటే గృహ రుణం ఇకపై మహిళలకు బేస్ రేటుపై 10% అధికంగా, ఇతరుల విషయంలో 15% అధికంగా ఉంటుందన్నమాట.
ఇప్పటి వరకూ ఇలా...
ఇప్పటి వరకూ అంటే 2013 డిసెంబర్ 20 నుంచీ అమలవుతున్న విధానం ప్రకారం బ్యాంక్ రెండు స్లాబ్స్‌లో గృహ రుణం ఉండేది. ఇందులో ఒకటి రూ.75 లక్షల లోపు ఒక స్లాబ్. రూ.75 లక్షల పైబడి స్లాబ్ మరొకటి. రూ.75 లక్షల లోపు రుణంపై మహిళలకు 10.10% వడ్డీ, ఇతరులకు 10.15% అమలయ్యేది. రూ.75 లక్షల పైబడిన రుణంపై మహిళలకు 10.25% రుణం అమలయితే, ఇతరుల విషయంలో ఇది 10.30%గా ఉండేది. ఈ శ్లాబ్‌లు ఇకపై తొలగిపోయి శ్లాబ్ రహిత తాజా రేట్లు అమలవుతాయి. ఇప్పుడు శ్లాబ్‌లతో సంబంధం లేకుండా గృహ రుణాలపై మహిళలకు 10.10%, ఇతరులకు 10.15 శాతం చొప్పున వడ్డీ రేటు ఉంటుంది. కాగా, తాజా స్లాబ్ రహిత (యూనిఫామ్) గృహ రుణ రేట్లు 26 ఆగస్టు 2014 నుంచీ అమల్లోకి వచ్చాయి.
మహిళల విషయంలో...: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ఏకైక దరఖాస్తుదారుగా ఉండాలి. సహ-దరఖాస్తుదారులు అయితే వారిలో మహిళ మొదటివారై ఉండాలి. ఇదే విషయం ప్రోపర్టీకీ వర్తిస్తుంది. ప్రోపర్టీ కేవలం మహిళకు చెందినదై ఉండాలి. సహ యజమానులైతే, వారిలో మొదటివారు మహిళై ఉండాలి.
పీఎన్‌బీ కూడా...
పండుగ సీజన్ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ. 2 కోట్ల వరకూ రుణాలపై వడ్డీరేటు 10.25%గా నిర్ణయించింది. అలాగే గృహ, కారు, ద్విచక్ర వాహనాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు పేర్కొంది. రూ.2 కోట్ల పైబడిన రిటైల్, హౌసింగ్ రుణాలపై రేట్లు 10.50%గా బ్యాంక్ పే ర్కొంది. ఫ్లోటింగ్ ప్రాతిపదికన ద్విచక్ర వాహన రుణ రేటు 12.25%గా ఉంటుంది. ఫిక్స్‌డ్ బేసిస్‌పై కార్ రుణ రేటు 10.65 శాతంగా ఆఫర్ చేస్తోంది. ఫ్లోటింగ్ బేసిస్‌పై 10.50 శాతమని పేర్కొంది.