Loans: రుణ పడొద్దు! | Types, and Tips on Loans, sakshi special story | Sakshi
Sakshi News home page

Loans: రుణ పడొద్దు!

Published Mon, Jan 15 2024 12:38 AM | Last Updated on Mon, Jan 15 2024 5:43 AM

Types, and Tips on Loans, sakshi special story - Sakshi

సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు.

గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్‌ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్‌లను కాదని రిటైల్‌ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్‌ 17 నాటికి చూస్తే రిటైల్‌ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్‌ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లోనూ రిటైల్‌ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్‌ రుణాల్లో కన్జ్యూమర్‌ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి.

ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్‌ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డ్‌ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్‌ రుణాలన్నీ కూడా అన్‌సెక్యూర్డ్‌. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్‌ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్‌ బ్యాంక్‌ వ్యక్తిగత, అన్‌ సెక్యూర్డ్, క్రెడిట్‌ కార్డ్‌ రుణాలకు రిస్క్‌ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది.   

క్రెడిట్‌ స్కోర్‌కు విఘాతం
 తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్‌ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్‌ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్‌ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి.

రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్‌మెంట్‌ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్‌ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే అన్‌సెక్యూర్డ్‌ రుణాలు మంజూరు చేస్తున్నాయి.

తదుపరి పరిణామాలు..
బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్‌ స్కోర్‌ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి.

అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్‌ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్‌ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్‌ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది.  

రుణం ఎగ్గొట్టడం సివిల్‌ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్‌ ఇనుస్ట్రుమెంట్‌ యాక్ట్, 1881లోని సెక్షన్‌ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు.

హోమ్‌లోన్‌ లేదా ప్రాపర్టీ లోన్‌ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్‌ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్‌ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి.

బ్యాంక్‌ జాబ్‌ కష్టమే!
బలహీన క్రెడిట్‌ స్కోర్‌ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్‌ స్కోర్‌ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్‌ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్‌ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి.

2022 మార్చిలో ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్‌ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫైబ్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు.  

ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? 
రుణం కోసం రుణం...
తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్‌ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్‌ కార్డ్‌ రుణాన్ని తీర్చివేయవచ్చు.  

రుణ గ్రహీత ముందున్న మార్గం
రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్‌ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్‌ పరిష్కారం కోసం డిమాండ్‌ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని
తగ్గిస్తాయి.

క్రెడిట్‌ కార్డు రుణం
క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్‌ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్‌ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు బ్లాక్‌ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్‌ లిస్ట్‌లో చేరుస్తాయి.  

విద్యా రుణం
విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్‌ క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది.

వ్యక్తిగత రుణం
వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్‌ ఇంటరెస్ట్‌) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్‌ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి.

వినియోగ రుణం
కన్జ్యూమర్‌ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్‌ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు.

గృహ రుణం
ఇంటిపై పొందే మార్ట్‌గేజ్‌ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్‌ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్‌ చేసుకోవాలంటే లీగల్‌ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్‌ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి.  దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్‌ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement