పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్‌..వాఘుల్‌ గురించి తెలుసా..? | Dharma yogi, Guru narayanan vaghul who transformed ICICI to universal banking group | Sakshi
Sakshi News home page

పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్‌..వాఘుల్‌ గురించి తెలుసా..?

Published Wed, May 22 2024 2:19 PM | Last Updated on Wed, May 22 2024 3:06 PM

Dharma yogi, Guru narayanan vaghul who transformed ICICI to universal banking group

భారత సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనే కల బలంగా ఉన్నా తగిన వయసు లేకపోవడంతో బ్యాంకింగ్‌లో తన కెరియర్‌ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన ఘనత నారాయణన్‌ వాఘుల్‌కే దక్కుతుంది. బ్యాంకింగ్‌ రంగంలో తాను చేసిన కృషిని గుర్తించి భారత​ ప్రభుత్వం 2010లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల తన 88వ ఏటా అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఆ ధర్మయోగి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నారాయణన్‌ వాఘుల్ 1936లో అప్పటి బ్రిటిష్ ఇండియా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) జన్మించారు. ఎనిమిది మంది సంతానం ఉన్న కుటుంబంలో ఆయన రెండోవాడు. వాఘుల్‌ తన బాల్యంలో రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్నారు. 1956లో మద్రాస్ విశ్వవిద్యాలయంలోని లయోలా కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. కానీ వయసు కటాఫ్ ఉండడంతో దానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు.

చదువు పూర్తి చేసుకున్న తర్వాత వాఘుల్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరియర్‌ ప్రారంభించారు. ఆ సమయంలో తనకు అప్పటి బ్యాంక్ ఛైర్మన్ ఆర్.కె.తల్వార్ మార్గదర్శకుడిగా ఉన్నారు. ఎస్‌బీఐలో సుధీర్ఘంగా 19 ఏళ్లు పనిచేసిన తరువాత పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌కు అధ్యాపకుడుగా పనిచేశారు. 1978లో ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన 44వ ఏటా 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చిన్న వయసులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం.

1985లో ప్రభుత్వ నియంత్రణలో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఐసీఐ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటైజేషన్‌ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1996లో పదవీ విరమణ చేసినా 2009 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు. బ్యాంకింగ్‌ రంగంలో సేవలందిస్తూ కె.వి.కామత్, కల్పనా మోర్పారియా, శిఖా శర్మ, నచికేత్ మోర్ వంటి బ్యాంకింగ్‌ దిగ్గజాలను తయారుచేశారు. తర్వాతికాలంలో వీరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలకు నాయకత్వం వహించారు.

పదవి విరమణ అనంతరం వాఘుల్‌ విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మిట్టల్ స్టీల్‌తో సహా అనేక కంపెనీల బోర్డులో డైరెక్టర్‌గా వ్యవహరించారు. వాఘుల్‌కు 2010లో వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో భారతదేశపు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. బిజినెస్ ఇండియా 1991 ఏడాదిలో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ది ఎకనామిక్ టైమ్స్.. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించాయి. ఆయన భారతదేశంలోని ఎన్‌జీవోల్లో ఒకటైన ‘గివ్ ఇండియా’కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. నారాయణన్ వాఘుల్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో 2012లో కార్పొరేట్ కాటలిస్ట్ ఫోర్బ్స్ ఫిలాంత్రోపీ అవార్డును అందుకున్నారు.

ఇదీ చదవండి: సముద్రంపై మరోసారి అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు

వాఘుల్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఎక్స్‌ ఖాతాలో నివాళులర్పించింది. ‘ఒక ధర్మ యోగి, సంస్థ నిర్మాత, గురువు, దూరదృష్టి కలిగినవాడు, రచయిత, పరోపకారి, భారతీయ పరిశ్రమలో ప్రముఖుడు. వాణిజ్య బ్యాంకింగ్, బీమా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్‌లు.. ఇలా అన్నింటిలో భాగమైన ఐసీఐసీఐను డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంకింగ్ గ్రూప్‌గా తీర్చిదిద్దిన బ్యాంకర్. అనేక మార్గదర్శక ఆర్థిక సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర వహించిన దూరదృష్టి కలిగిన వ్యక్తి. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు, విద్యాసంస్థల్లో నాయకులకు కొన్నేళ్లుగా మార్గదర్శకాలిచ్చిన గురువుకు ఐసీఐసీఐ బ్యాంకు రుణపడి ఉంటుంది’ అని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement