47 శాతం వాటాతో అగ్రస్థానం
219 బిలియన్ డాలర్ల పొదుపు
ఇక్వియా ఇన్‌స్టిట్యూట్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి.
ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్ సరఫరా చేశాయి.
50 శాతంపైగా మన కంపెనీలవే..
చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్ 60 శాతం, లిపిడ్ రెగ్యులేటర్స్ 58, యాంటీ అల్సర్స్ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం.
మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్ 56 శాతం, కొరియా 18, యూరప్ 11 శాతం బయోసిమిలర్స్ సరఫరా చేశాయి.
మరో 1.3 ట్రిలియన్ డాలర్లు..
భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా.
భారత్–యూఎస్ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment