న్యూఢిల్లీ: రష్యాకు రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయనే నెపంతో భారత్‌కు చెందిన 19 కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది. భారత కంపెనీలు సహా మొత్తం 400 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ 30న అమెరికా విదేశాంగ శాఖ, ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారీన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయంటూ కంపెనీలపై అమెరికా ఏకపక్ష చర్యలకు దిగింది. దీంతో ఈ దిశగా భారత్ చేపట్టాల్సిన చర్యలను జీటీఆర్‌ఐ సూచించింది. ఆయా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా అమెరికాతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంప్రదింపులు చేపట్టడం ద్వారా పరిష్కారాలు గుర్తించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఆంక్షలను నివారించేందుకు వీలుగా ఎగుమతులకు సంబంధించి కఠిన నియంత్రణలు, స్పష్టమైన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరింది.
‘‘యూఎస్ ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా భారత్ మాదిరి దేశాలు ఈ ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించడమే వాస్తవిక కార్యాచరణ అవుతుంది. అమెరికా చర్యలు భారత వ్యాపార ప్రయోజనాలకు హానికలించినా లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఐ) దృష్టికి భారత్ తీసుకెళ్లాలి’’అని జీటీఆర్‌ఐ తన తాజా నివేదికలో సూచించింది.
అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి..
భారత వ్యాపార సంస్థలు సున్నితమైన ఉత్పత్తుల (పౌర, సైనిక వినియోగం) ఎగుమతుల విషయంలో స్థానిక చట్టాలనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని అమెరికా ఆంక్షలు గుర్తు చేస్తున్నాయని జీటీఆర్‌ఐ పేర్కొంది. ఆంక్షలు విధించిన దేశాలు, సంస్థలకు మద్దతు విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారత కంపెనీలు అటు సైనిక, ఇటు పౌర అవసరాల కోసం ఉద్దేశించినవి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది. వీటిల్లో కొన్ని అమెరికాలో తయారైనవే కాకుండా, స్థానికంగా తయారు చేసినవీ రష్యా సైనిక అవసరాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.
అమెరికా ఆంక్షలు ఆ దేశ తయారీ ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలించే కంపెనీలకూ వర్తిస్తాయంటూ.. భారత ఎగుమతిదారులపై పరిశీలన మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితికి వెలుపల ఏకపక్ష చర్యలకు భారత్ మద్దతు ఇవ్వరాదని.. అమెరికా ఆంక్షల విధానం కేవలం ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాలకే పరిమితం కావాలని పేర్కొంది. భారత కంపెనీలు తమ ఉత్పత్తుల సరఫరా చైన్‌ను తప్పకుండా పరిశీలించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment