ఆల్‌టైమ్‌ రికార్డ్‌ కొట్టేసిన బిట్‌కాయిన్‌ | Cryptocurrency Bitcoin Hits New All Time High Of 100000 usd | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు ఫాంటసీ.. ఆల్‌టైమ్‌ రికార్డ్‌ కొట్టేసిన బిట్‌కాయిన్‌

Published Thu, Dec 5 2024 10:54 AM | Last Updated on Thu, Dec 5 2024 12:10 PM

Cryptocurrency Bitcoin Hits New All Time High Of 100000 usd

ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్‌ ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.

బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్‌కాయిన్‌తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్‌ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు.

"బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్‌లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్‌కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.

ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్‌ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్‌ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న గ్యారీ జెన్స్‌లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు.  ఈ పదవికి ఎస్‌ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్‌ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement