global traders
-
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. జాగ్రత్తగా అధిగమించాలి
న్యూఢిల్లీ: రష్యాకు రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయనే నెపంతో భారత్‌కు చెందిన 19 కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. భారత కంపెనీలు సహా మొత్తం 400 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ 30న అమెరికా విదేశాంగ శాఖ, ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారీన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయంటూ కంపెనీలపై అమెరికా ఏకపక్ష చర్యలకు దిగింది. దీంతో ఈ దిశగా భారత్ చేపట్టాల్సిన చర్యలను జీటీఆర్ఐ సూచించింది. ఆయా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా అమెరికాతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంప్రదింపులు చేపట్టడం ద్వారా పరిష్కారాలు గుర్తించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఆంక్షలను నివారించేందుకు వీలుగా ఎగుమతులకు సంబంధించి కఠిన నియంత్రణలు, స్పష్టమైన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరింది.‘‘యూఎస్ ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా భారత్ మాదిరి దేశాలు ఈ ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించడమే వాస్తవిక కార్యాచరణ అవుతుంది. అమెరికా చర్యలు భారత వ్యాపార ప్రయోజనాలకు హానికలించినా లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఐ) దృష్టికి భారత్ తీసుకెళ్లాలి’’అని జీటీఆర్ఐ తన తాజా నివేదికలో సూచించింది. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి.. భారత వ్యాపార సంస్థలు సున్నితమైన ఉత్పత్తుల (పౌర, సైనిక వినియోగం) ఎగుమతుల విషయంలో స్థానిక చట్టాలనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని అమెరికా ఆంక్షలు గుర్తు చేస్తున్నాయని జీటీఆర్ఐ పేర్కొంది. ఆంక్షలు విధించిన దేశాలు, సంస్థలకు మద్దతు విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారత కంపెనీలు అటు సైనిక, ఇటు పౌర అవసరాల కోసం ఉద్దేశించినవి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది. వీటిల్లో కొన్ని అమెరికాలో తయారైనవే కాకుండా, స్థానికంగా తయారు చేసినవీ రష్యా సైనిక అవసరాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.అమెరికా ఆంక్షలు ఆ దేశ తయారీ ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలించే కంపెనీలకూ వర్తిస్తాయంటూ.. భారత ఎగుమతిదారులపై పరిశీలన మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితికి వెలుపల ఏకపక్ష చర్యలకు భారత్ మద్దతు ఇవ్వరాదని.. అమెరికా ఆంక్షల విధానం కేవలం ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాలకే పరిమితం కావాలని పేర్కొంది. భారత కంపెనీలు తమ ఉత్పత్తుల సరఫరా చైన్‌ను తప్పకుండా పరిశీలించాలని సూచించింది. -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆటోమొబైల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్‌టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్‌టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్‌పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్‌కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్‌టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్‌లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్‌తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
గ్లోబల్ ట్రేడ్‌లో ఇలా రుణం తీర్చడం ఇదే ఫస్ట్ టైం!
వస్తు మార్పిడి.. తెలియని విషయమేం కాదు. పాతరోజుల్లో బాగా ఆచరణలో ఉండేది. కరెన్సీ వాడకంలోకి వచ్చాక.. క్రమంగా తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య రుణ ఒప్పందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. ఈ క్రమంలో గ్లోబల్ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక, ఇరాన్ నుంచి కొన్ని ఏళ్లుగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు నాలుగేళ్లుగా 251 మిలియన్ డాలర్ల విలువైన రుణం పేరుకుపోయింది. దీనిని తీర్చేందుకు సంచలన ప్రకటన చేసింది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. రుణాన్ని ధన రూపేణ కాకుండా.. వస్తుమార్పిడి రూపంలో తీరుస్తామని, ఈమేర విలువ చేసే సిలోన్ టీ ఉత్పత్తులను ఇరాన్‌కు అందిస్తామని పేర్కొంది. గత యాభై ఏళ్లలో విదేశీ వాణిజ్యంలో ఈ తరహా ప్రకటన చేసిన దేశం శ్రీలంకే కావడం విశేషం!. ఇందుకు సంబంధించి శ్రీలంక మంత్రి రమేశ్ పాథిరానా అధికారికంగా ఓ ప్రకటన చేశారు. జనవరి నుంచి ప్రతీ నెలా 5 మిలియన్ డాలర్ల విలువ చేసే తేయాకు ఉత్పత్తులను ఇరాన్‌కు అందిచనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఉత్పత్తుల విషయంలో ఇరాన్‌కి పడ్డ రుణం నాలుగేళ్లుగా పేరుకుపోతోంది. ఈ తరుణంలోనే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదా? ఇదిలా ఉంటే యూఎన్, యూఎస్ ఆంక్షల పరిధిలో ‘టీ’ కూడా ఉంది. అయితే మానవతా కోణం దృష్ట్యా(ఎమర్జెన్సీ సందర్భాల్లో) టీ అనేది ఫుడ్ జాబితాలో ఉందని గుర్తు చేస్తోంది లంక ప్రభుత్వం. అంతేకాదు ఇరాన్ బ్యాంక్‌ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక ప్రకటించుకుంది. మరోవైపు శ్రీలంక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. విదేశీ మారకద్రవ్య సంక్షోభం, కరోనా ప్రభావంతో టూరిజం నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రతీ ఏడాది 340 మిలియన్ కేజీల టీని ఉత్పత్తి చేస్తోంది. కిందటి ఏడాది 265 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేయగా.. 1.24 బిలియన్ డాలర్లు సంపాదించింది. దేశం మొత్తం మీద ఐదు శాతం జనాభా తేయాకు ఆధారిత పనులతో జీవనం కొనసాగిస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్! -
ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 2019, 2020 సంవత్సరాలకు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తెలిపింది. 2020 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య వృద్ధి 2.7 శాతం ఉంటుందని అంచనా వేయడం కాస్త ఉపశమనం కల్పించేదే. గతంలో వేసిన 3 శాతంతో పోలిస్తే కాస్త తగ్గించింది. -
బెరైటీస్‌పై పె(గ)ద్దల కన్ను!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారంలోకి రావడమే తరువాయి.. తెలుగుదేశం నేతలు ప్రకృతి సంపదపై కన్నేస్తున్నారు. ఇప్పటికే ఎర్రచందనం, ఇసుకపై దృష్టి సారించిన తెలుగుతమ్ముళ్లు తాజాగా బెరైటీస్ ఖనిజం వైపు చూస్తున్నారు. జిల్లాలో వేలాది కోట్ల విలువ చేసే నిల్వలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈవ్యవహారంలో సీఎం సన్నిహితుడు ఒకరు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళన చేయాలని భావిస్తున్న పల్వరైజింగ్ మిల్లుల యజమానులలో చిచ్చు పెట్టేందుకు తెరవెనుక కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్ల మాటున బెరైటీస్‌ను కొల్లగొట్టడమే అసలు లక్ష్యంగా ఆనేత మదిలో దాగి ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని మంగంపేటలో లభ్యమయ్యే బెరైటీస్ ఖనిజం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. ఈ ఖనిజాన్ని నమ్ముకుని వందలాది పరిశ్రమలను నెలకొల్పారు. తద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గతంలో జీఓ నెంబర్ 296ను విడుదల చేశారు. బెరైటీస్ ఉత్పత్తిలో 40ః60 నిష్పత్తిన ఖనిజ కేటాయింపులు ఉండేలా ఆ ఉత్తర్వులు వివరిస్తున్నాయి. వాటిని రద్దు చేస్తూ ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికుల ఐక్యతను దెబ్బతీసేందుకు అధికారపార్టీ నేతలు తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం. రోడ్డున పడనున్న 30వేల మంది.... రాష్ట్ర ప్రభుత్వం జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న 30వేల మంది రోడ్డు పాలుకానున్నారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 178 పల్వరైజింగ్ మిల్లులు పనిచేస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి ఉంటోంది. బెరైటీస్ వెలికి తీసే టెండర్లు ఆగస్టు 8న ముగిశాయి. అనంతరం టెండర్లు నిర్వహించాల్సిన ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. ఆమేరకు జీఓ 296ను రద్దు చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, కార్మికులను రోడ్డుపాలు చేయనుంది. ఇప్పటికి 49 మిలియన్ టన్నుల ఖనిజం నిల్వలు మంగంపేటలో ఉన్నట్లు సమాచారం. ఇంకా సుమారు రూ.50వేల కోట్లు విలువ చేసే ఖనిజ నిక్షేపాలు మంగంపేట గర్భంలో దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖనిజాన్ని వెలికి తీసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే స్థానికంగా కాకుండా గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని నిర్ణయించడంపై రైల్వేకోడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. కన్నేసిన ముఖ్యమంత్రి సన్నిహితుడు... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో క్రీయాశీలక నేతల్లో ఒకరిగా మారిన జిల్లానేత ఒకరు మంగంపేట బెరైటీస్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్లు మాటున బెరైటీస్‌ను సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా కార్పొరేట్ కంపెనీతో జత కట్టినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఆ కంపెనీ పరిశ్రమ నెలకొల్పేందుకు కావాల్సిన భూమిని సైతం అందుబాటులో ఉంచినట్లు సమాచారం. సోఫ్ ప్యాక్టరీ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకారం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 1966 నుంచి 1994 వరకూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మంగంపేట బెరైటీస్ గనులు ఉండేవి. అప్పట్లో రాయలసీమ ఉద్యమనేత, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి చేసిన ఉద్యమ ఫలితంగా ప్రభుత్వ పరమైంది. ఇప్పటి పాలకపక్షం గ్లోబల్ టెండర్ల మాటున బెరైటీస్ సంపదను కొల్లగొట్టేందుకు సమాయత్తైమవుతోంది. పభుత్వ నిర్ణయాన్ని స్థానిక కార్మికులు, మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకతీతంగా అఖిలపక్షం ఏర్పాటై ఉద్యమిస్తోంది. అయితే వారి ఐక్యతను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తద్వారా కార్మికుల పొట్టకొట్టేందుకు వెనుకాడటం లేదని ఏపీ మైనింగ్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విభజన చట్టాన్ని సైతం ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు హైకోర్టుకు వివరించారు. అయితే మిల్లర్లు, కార్మికులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కన్పించడం లేదు. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను హైకోర్టు నియంత్రించగలదనే ఆశాభావాన్ని కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. వాయిదా పడిన మహా ధర్నా ఓబులవారిపల్లె: పల్వరైజింగ్ మిల్లు యజమానుల మహా ధర్నా వాయిదా పడింది. ఖనిజ సరఫరా విషయంలో ఏపీఎండీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సోమవారం పల్వరైజింగ్ మిల్లు యజమానులు మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ రైల్వేకోడూరు ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు పల్వరైజింగ్ మిల్లు యజమానులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో మాట్లాడి పల్వరైజింగ్ మిల్లులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ బత్యాల అధ్యక్షతన పల్వరైజింగ్ మిల్లుల యజమానులు సమావేశమయ్యారు. ప్రతిమిల్లు యజమాని అభిప్రాయాన్ని ఎమ్మెల్సీ అడిగి తెలుసుకున్నారు. సీఎం రమేష్ ఇచ్చిన హామీతో మహాధర్నాను పది రోజుల పాటు వాయిదా వేయాలని మిల్లుల యజమానులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. తాత్కాలికంగానే వాయిదా రైల్వేకోడూరు అర్బన్ :మంగంపేటలో సోమవారం చేయాలనుకున్న మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మిల్లు యజమానుల గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అన్నారు. మంగంపేటలోని 172మిల్లులకు గత 14నెలలుగా ఏపీఎండీసీ రాయి సరఫరా చేయకపోవడంతో సోమవారం మహాధర్నా చేసేందుకు పూనుకున్నామన్నారు. ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్‌మేడా మల్లికార్జునరెడ్డి, కోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వారి మాటలను గౌరవించి మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి 25వ తేదీలోపు సమాచారం రాకుంటే మళ్లీ సమావేశమై ధర్నా ఎప్పుడు నిర్వహించేది తెలుపుతామన్నారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వరనాయుడు, గునిపాటి కేశవులు, సాంబశివారెడ్డి పాల్గొన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళతాం రైల్వేకోడూరు అర్బన్: మంగంపేట మిల్లు యజమానుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మిల్లు యజమానులతో ఆదివారం మధ్యాహ్నం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14నెల లుగా మిల్లులకు రాయి ఇవ్వకపోవడంతో యజమాను లు కష్టాల్లో ఉన్నారన్నారు. వారందరికీ రాయి ఇచ్చేందు కు సీఎంతో చర్చిస్తామన్నారు. రాయి ఇవ్వకుండా రిలయన్స్‌కు ప్రభుత్వం ఇస్తుందని ఊహాగానాలు ఉన్నాయని, అటువంటిది ఏదీ లేదన్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలిచి ఎక్కువ ధర వేసిన వారికి రాయి ఇచ్చి తక్కువ రేటుతో రాయి తీసే వారికి టెండర్ ఇచ్చి మిల్లులకు రాయి ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, మిల్లు యజమానులు సుధాకర్‌రెడ్డి, యతీష్రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాయుడు పాల్గొన్నారు.