బెరైటీస్‌పై పె(గ)ద్దల కన్ను!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారంలోకి రావడమే తరువాయి.. తెలుగుదేశం నేతలు ప్రకృతి సంపదపై కన్నేస్తున్నారు. ఇప్పటికే ఎర్రచందనం, ఇసుకపై దృష్టి సారించిన తెలుగుతమ్ముళ్లు తాజాగా బెరైటీస్ ఖనిజం వైపు చూస్తున్నారు. జిల్లాలో వేలాది కోట్ల విలువ చేసే నిల్వలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈవ్యవహారంలో సీఎం సన్నిహితుడు ఒకరు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళన చేయాలని భావిస్తున్న పల్వరైజింగ్ మిల్లుల యజమానులలో చిచ్చు పెట్టేందుకు తెరవెనుక కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్ల మాటున బెరైటీస్‌ను కొల్లగొట్టడమే అసలు లక్ష్యంగా ఆనేత మదిలో దాగి ఉన్నట్లు సమాచారం.
జిల్లాలోని మంగంపేటలో లభ్యమయ్యే బెరైటీస్ ఖనిజం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. ఈ ఖనిజాన్ని నమ్ముకుని వందలాది పరిశ్రమలను నెలకొల్పారు. తద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గతంలో జీఓ నెంబర్ 296ను విడుదల చేశారు. బెరైటీస్ ఉత్పత్తిలో 40ః60 నిష్పత్తిన ఖనిజ కేటాయింపులు ఉండేలా ఆ ఉత్తర్వులు వివరిస్తున్నాయి. వాటిని రద్దు చేస్తూ ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికుల ఐక్యతను దెబ్బతీసేందుకు అధికారపార్టీ నేతలు తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం.
రోడ్డున పడనున్న 30వేల మంది....
రాష్ట్ర ప్రభుత్వం జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న 30వేల మంది రోడ్డు పాలుకానున్నారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 178 పల్వరైజింగ్ మిల్లులు పనిచేస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి ఉంటోంది. బెరైటీస్ వెలికి తీసే టెండర్లు ఆగస్టు 8న ముగిశాయి. అనంతరం టెండర్లు నిర్వహించాల్సిన ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. ఆమేరకు జీఓ 296ను రద్దు చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, కార్మికులను రోడ్డుపాలు చేయనుంది. ఇప్పటికి 49 మిలియన్ టన్నుల ఖనిజం నిల్వలు మంగంపేటలో ఉన్నట్లు సమాచారం. ఇంకా సుమారు రూ.50వేల కోట్లు విలువ చేసే ఖనిజ నిక్షేపాలు మంగంపేట గర్భంలో దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖనిజాన్ని వెలికి తీసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే స్థానికంగా కాకుండా గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని నిర్ణయించడంపై రైల్వేకోడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
కన్నేసిన
ముఖ్యమంత్రి సన్నిహితుడు...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో క్రీయాశీలక నేతల్లో ఒకరిగా మారిన జిల్లానేత ఒకరు మంగంపేట బెరైటీస్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్లు మాటున బెరైటీస్‌ను సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా కార్పొరేట్ కంపెనీతో జత కట్టినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఆ కంపెనీ పరిశ్రమ నెలకొల్పేందుకు కావాల్సిన భూమిని సైతం అందుబాటులో ఉంచినట్లు సమాచారం. సోఫ్ ప్యాక్టరీ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకారం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 1966 నుంచి 1994 వరకూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మంగంపేట బెరైటీస్ గనులు ఉండేవి. అప్పట్లో రాయలసీమ ఉద్యమనేత, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి చేసిన ఉద్యమ ఫలితంగా ప్రభుత్వ పరమైంది. ఇప్పటి పాలకపక్షం గ్లోబల్ టెండర్ల మాటున బెరైటీస్ సంపదను కొల్లగొట్టేందుకు సమాయత్తైమవుతోంది. పభుత్వ నిర్ణయాన్ని స్థానిక కార్మికులు, మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు.
పార్టీలకతీతంగా అఖిలపక్షం ఏర్పాటై ఉద్యమిస్తోంది. అయితే వారి ఐక్యతను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తద్వారా కార్మికుల పొట్టకొట్టేందుకు వెనుకాడటం లేదని ఏపీ మైనింగ్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విభజన చట్టాన్ని సైతం ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు హైకోర్టుకు వివరించారు. అయితే మిల్లర్లు, కార్మికులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కన్పించడం లేదు. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను హైకోర్టు నియంత్రించగలదనే ఆశాభావాన్ని కార్మికులు వ్యక్తపరుస్తున్నారు.
వాయిదా పడిన మహా ధర్నా
ఓబులవారిపల్లె: పల్వరైజింగ్ మిల్లు యజమానుల మహా ధర్నా వాయిదా పడింది. ఖనిజ సరఫరా విషయంలో ఏపీఎండీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సోమవారం పల్వరైజింగ్ మిల్లు యజమానులు మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ రైల్వేకోడూరు ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు పల్వరైజింగ్ మిల్లు యజమానులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో మాట్లాడి పల్వరైజింగ్ మిల్లులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ బత్యాల అధ్యక్షతన పల్వరైజింగ్ మిల్లుల యజమానులు సమావేశమయ్యారు. ప్రతిమిల్లు యజమాని అభిప్రాయాన్ని ఎమ్మెల్సీ అడిగి తెలుసుకున్నారు. సీఎం రమేష్ ఇచ్చిన హామీతో మహాధర్నాను పది రోజుల పాటు వాయిదా వేయాలని మిల్లుల యజమానులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
తాత్కాలికంగానే వాయిదా
రైల్వేకోడూరు అర్బన్ :మంగంపేటలో సోమవారం చేయాలనుకున్న మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మిల్లు యజమానుల గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అన్నారు. మంగంపేటలోని 172మిల్లులకు గత 14నెలలుగా ఏపీఎండీసీ రాయి సరఫరా చేయకపోవడంతో సోమవారం మహాధర్నా చేసేందుకు పూనుకున్నామన్నారు. ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్‌మేడా మల్లికార్జునరెడ్డి, కోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వారి మాటలను గౌరవించి మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి 25వ తేదీలోపు సమాచారం రాకుంటే మళ్లీ సమావేశమై ధర్నా ఎప్పుడు నిర్వహించేది తెలుపుతామన్నారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వరనాయుడు, గునిపాటి కేశవులు, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
సమస్యను సీఎం దృష్టికి తీసుకెళతాం
రైల్వేకోడూరు అర్బన్: మంగంపేట మిల్లు యజమానుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మిల్లు యజమానులతో ఆదివారం మధ్యాహ్నం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14నెల లుగా మిల్లులకు రాయి ఇవ్వకపోవడంతో యజమాను లు కష్టాల్లో ఉన్నారన్నారు. వారందరికీ రాయి ఇచ్చేందు కు సీఎంతో చర్చిస్తామన్నారు. రాయి ఇవ్వకుండా రిలయన్స్‌కు ప్రభుత్వం ఇస్తుందని ఊహాగానాలు ఉన్నాయని, అటువంటిది ఏదీ లేదన్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలిచి ఎక్కువ ధర వేసిన వారికి రాయి ఇచ్చి తక్కువ రేటుతో రాయి తీసే వారికి టెండర్ ఇచ్చి మిల్లులకు రాయి ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, మిల్లు యజమానులు సుధాకర్‌రెడ్డి, యతీష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాయుడు పాల్గొన్నారు.