![Reciprocal tariffs by US may not hurt India much GTRI](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/us.jpg.webp?itok=bPtZNLQS)
అమెరికా ప్రతిపాదిత ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరు దేశాలు ఎగుమతుల తీరుతెన్నులు భిన్నంగా ఉండటమే కారణమని ఆయన చెప్పారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే పిస్తాలపై భారత్ 50 శాతం సుంకాలు విధిస్తోందనుకుంటే, మన దగ్గర్నుంచి దిగుమతయ్యే వాటి మీద కూడా అమెరికా అదే స్థాయిలో టారిఫ్‌లు వడ్డిస్తానంటే ఉపయోగం ఉండకపోవచ్చన్నారు. ఎందుకంటే భారత్ అసలు పిస్తాలే ఎగుమతి చేయదు కాబట్టి నష్టపోయేదేమీ ఉండదని శ్రీవాస్తవ చెప్పారు.
అమెరికా నుంచి దిగుమతుల విలువకు సంబంధించి 75 శాతం భాగానికి టారిఫ్‌లు సగటున 5 శాతం లోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక జౌళి, దుస్తులు, పాదరక్షలులాంటి కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో అమెరికా అత్యధికంగా 15–35 శాతం సుంకాలు విధిస్తోందని వివరించారు. ‘రెండు దేశాల ఎగుమతుల ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా తుది నిర్ణయం కోసం ఏప్రిల్ వరకు ఎదురు చూసి, అప్పుడు అవసరమైతే 2019 జూన్‌లోలాగే మనం కూడా తగిన చర్యలు తీసుకోవచ్చు‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. వ్యాపార భాగస్వామ్య దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
స్పష్టత రావాలి
పరిశ్రమపై విధిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు అత్యంత ప్రాధాన్య దేశాలకు (ఎంఎఫ్‌ఎన్) వ్యవసాయోత్పత్తుల మీద తాము 5 శాతం సుంకాలు విధిస్తుంటే.. భారత్ సగటు ఎంఎఫ్‌ఎన్ టారిఫ్ 39 శాతంగా ఉంటోందని అమెరికా వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. అలాగే తమ మోటర్‌సైకిళ్లపై భారత్ 100 శాతం టారిఫ్‌లు విధిస్తుంటే, భారత మోటర్‌సైకిళ్లపై తాము 2.4 శాతం మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేందుకు అమెరికా ఏదో ఒక అంశాన్ని, అంటే, ఉత్పత్తి లేదా రంగాన్ని ప్రామాణికంగా పరిగణించాలని శ్రీవాస్తవ చెప్పారు. లేకపోతే అత్యధికంగా పారిశ్రామికోత్పత్తులను సరఫరా చేసే చైనాకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని పేర్కొన్నారు.
వాణిజ్యంలో కీలక భాగస్వామి...
అమెరికాకు భారత్ గణనీయంగా ఎగుమతి చేస్తుండగా, అక్కడి నుంచి దిగుమతులు తక్కువగానే ఉంటూ.. వాణిజ్య మిగులు భారత్ పక్షాన సానుకూలంగా ఉంటోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. అప్పట్లో భారత్ 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 42.19 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 82.52 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. భారత్ 52.89 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 29.63 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. భారత్ పక్షాన 23.26 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment