భారతీయ కంపెనీల వీసాల్లో తగ్గుదల
గతేడాది టాప్–7 భారత కంపెనీల్లో 37 శాతం తగ్గిన వీసాలు
వాషింగ్టన్: అమెరికాలో తొలి ఏడు భారతీయ కంపెనీల హెచ్1బీ వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 2016లో 37 శాతం తక్కువగా హెచ్1బీ వీసాలకు ఆమోదం లభించింది. వాషింగ్టన్‌కు చెందిన ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడు కంపెనీల నుంచి మొత్తంగా 5,436 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. 2015లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 4,674 హెచ్1బీ వీసాలు సంపాదించగా 2016లో ఈ సంఖ్య 2040కు పడిపోయింది. అంటే ఏకంగా 56 శాతం తగ్గిపోయాయి.
విప్రో సైతం 2015తో పోలిస్తే 2016లో 52 శాతం తక్కువ వీసాలు సాధించింది. విప్రో 2015లో 3,079 వీసాలు పొందగా 2016లో కేవలం 1,474 వీసాలే వచ్చాయి. ఇన్ఫోసిస్‌కు 16శాతం తక్కువగా వీసాలు దక్కాయి. ఇన్ఫోసిస్‌కు 2015లో 2,830 వీసాలు రాగా, 2016లో కేవలం 2,376 వీసాలే వచ్చాయి. ఈ ఏడాది భారతీయ కంపెనీల వీసాలు మరింతగా తగ్గే వీలుందని నివేదిక అంచనావేసింది. నిబంధనలు మారడంతో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి డిజిటల్ సేవల రంగాల్లో స్థానికులకు మరింతగా ఉపాధి కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది.