సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు.
వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ
భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి.
అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి.
వీసాల జారీలో మాత్రం చిన్నచూపు
అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను
అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది.
వీసాల జారీలో సమతుల్యత ఉండాలి
భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి.
– కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్
విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం
‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రొ. పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్
ఇవ్వడంలో మనదే పైచేయి
Published Mon, Feb 17 2020 3:26 AM | Last Updated on Mon, Feb 17 2020 3:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment