employment chances
-
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021 ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. ► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు. ► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది. ► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి. ► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. ► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి. ► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్‌లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది. ► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది. తొమ్మిది రంగాలు ఇవి... సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి. -
World Voice Day 2021: మీ గళం మీ మార్గం
స్త్రీల గళాల వల్లే ఈ ప్రపంచం సంగీతమయం అయ్యిందంటే ఎవరూ కాదనకపోవచ్చు. భారతీయ మహిళ తన గొంతు వినిపించడం, తన మాటకు విలువ తెచ్చుకోవడం, తన గళంతో ఉపాధి పొందడం ఇంకా సంపూర్ణంగా సులువు కాలేదు. యాంకర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, అనౌన్సర్లు, గాయనులు, రిసెప్షనిస్టులు, కాల్ సెంటర్ ఉద్యోగినులు... మంచి గొంతు వల్లే ఉపాధి పొందుతున్నారు. నిత్య జీవితంలో గొంతు పెగల్చకుండా జీవనం సాగదు. ‘ప్రపంచ గళ దినోత్సవం’ మన గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంగీకారానికైనా అభ్యంతరానికైనా గొంతును సవరించమని కోరుతుంది. గొంతు నొప్పి వస్తే తప్ప గొంతును పట్టించుకోని మనం మన గళానికి ఏం ఇస్తున్నాం? మన గళంతో ఏం పొందుతున్నాం? సీనియర్ నటి లక్ష్మితో నటుడు కమల హాసన్ ఒకసారి ‘మీరు రోజూ గుడ్ మార్నింగ్ చెప్తే చాలు... మీ గొంతు విని ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేయగలను’ అన్నాడట. ఇది ప్రేమ ప్రకటన కాదు. ఒక మంచి గొంతు వింటే వచ్చే ఉత్సాహం గురించి. మంచి గొంతు కలిగి, అందులో ఉత్సాహం నిండి ఉంటే మనకు మనం పొందే వెలుగు సరే. జగానికి కూడా వెలుగు ఇవ్వవచ్చు. గొంతు పై ఆంక్ష భారతీయ సమాజంలో ‘ఆడది గడప దాటకూడదు. ఇంట్లో నోరు మెదపకూడదు’ అనే భావన అనేక శతాబ్దాలు రాజ్యమేలింది. ‘ఇంట్లో ఆడపిల్లా ఉందా లేదా అన్నట్టు ఆమె గొంతు వినిపించాలి’ అని అనేవారు. ఆడపిల్ల తనకో నోరు ఉన్నట్టు, ఆ నోటి నుంచి మాట రాగలదు అన్నట్టు ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అబ్బాయిలకు. ఆ అబ్బాయి పెద్దయ్యి పురుషుడు అయితే అతని గొంతు అన్ని విధాలా అనుమతి ఉంటుంది. కాని స్త్రీకి మాత్రం కాదు. గొంతు ‘వాడిన’ స్త్రీని ‘గయ్యాళి’ అనడానికి సమాజం రెడీగా ఉండేది. అది కాదు ఆ గొంతును ప్రదర్శనకు పెట్టడం నామోషీగా దిగువ రకం స్త్రీలు చేసే పనిగా ప్రచారం చేశారు. పాటలు పాడేవాళ్లను, నలుగురూ వినేలా కవిత్వం పలికే వారిని, వేదిక ఎక్కి ఏదైనా అభిప్రాయం చెప్పేవారిని సమాజం న్యూనత పరిచేలా చూసింది. సరిగా చెప్పాలంటే న్యూనతతో చూసింది. ఆడేపాడే స్త్రీలకు ఒక కులాన్ని, ఒక సమూహ స్వభావాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీలు మెదడు ఉపయోగించరాదు. శారీరక బలాన్ని ఉపయోగించరాదు. మాటను కూడా ఉపయోగించరాదు. భర్తకు, కుటుంబానికి తప్ప తమ గొంతు ఎలా ఉంటుందో తెలుపకనే... వినిపించకనే గతించిపోయిన స్త్రీలు కోట్లాది మంది. పేరంటం పాటలు పాడటాన్ని కూడా చాలా బిడియంతో నిండిన విషయంగా సగటు స్త్రీలు భావించేవారంటే గొంతు విప్పడం గురించి ఎన్ని ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మీ గొంతు మీ హక్కు మనిషి మనుగడకు, ఉపాధికి గొంతు ఒక ప్రధాన సాధనం. అయితే ఆ గొంతుతో అవకాశం పొందే హక్కుదారు మొదట మగవాడే అయ్యాడు. స్త్రీల గొంతు ఇంటికే పరిమితమైంది. పెళ్లికి ముందు ఎంతో అద్భుతమైన గాయనులుగా గుర్తింపు పొందినవారు పెళ్లి తర్వాత ‘భర్తకు ఇష్టం లేదని చెప్పి’ తమ కెరీర్లను వదులుకున్నారు. మొదటి రేడియో అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, మొదటి టీవీ అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, ఆ తర్వాత టెలిఫోన్ ఆపరేటర్లు, రైల్వే అనౌన్సర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్లు, ఇప్పుడు కాల్‌సెంటర్ ఉద్యోగినులు తమ గొంతు ను ఒక ఉపాధి చేసుకోవడానికి సుదీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. ఇవాళ రాజకీయ పార్టీలకు స్పోక్స్‌పర్సన్స్ దగ్గరి నుంచి విదేశాంగ వ్యవహారాలను తెలియచేసే ప్రతినిధుల వరకు స్త్రీలు తమ గొంతును, మాటను సమర్థంగా ఉపయోగించే స్థాయికి ఎదిగారు. హేళనా బుద్ధి స్త్రీలు చాడీలు చెప్పుకుంటారని, గోడకు ఈ పక్క ఆ పక్క నిలబడి గంటల కొద్దీ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటారని హేళన చేసే కార్టూన్లతో జోకులతో వారిని పలుచన చేసే భావజాలం కొనసాగుతూనే ఉంది. బయట మాట్లాడే వీలు లేనప్పుడు, ఆఫీసుల్లో మాట్లాడే వీలులేనప్పుడు, చాయ్ హోటళ్లలో మాట్లాడే వీలు లేనప్పుడు, స్నేహబృందాలుగా కూచుని మాట్లాడుకునే వీలు లేనప్పుడు, ఇంట్లోనే ఉండక తప్పనప్పుడు స్త్రీలు గోడకు ఈ పక్క ఆ పక్క మాట్లాడక ఎక్కడ మాట్లాడతారు? మాటకు ముఖం వాచిపోయేలా చేసి ఆ తర్వాత వారు గంటల తరబడి మాట్లాడతారనడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. గొంతు ఆరోగ్యం స్త్రీలు వయసు పెరిగే కొద్ది గొంతులో వచ్చే మార్పులను గమనించుకోవాలని ‘ప్రపంచ గళ దినోత్సవం’ సూచిస్తోంది. వినోద రంగంలో ఉండే స్త్రీలు, గొంతు ఆధారంగా ఉపాధి పొందే స్త్రీలు తమ గొంతు గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజే ‘ప్రపంచ గళ దినోత్సవం. పిల్లల గొంతు సమస్యలు గాని, స్త్రీల గొంతు సమస్యలు కాని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని కోరుతుంది. 1999లో బ్రెజిల్ దేశంలో మొదలైన ప్రపంచ గళ దినోత్సవం నేడు ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఇంట్లో ఆడపిల్ల అల్లరి చేస్తుంటే ‘ఏంటా గొంతు’ అని గద్దించే భావధారకు ఇవాళైనా స్వస్తి పలకాల్సిన అవసరాన్ని ఈ దినం ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
ఇవ్వడంలో మనదే పైచేయి
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి. వీసాల జారీలో మాత్రం చిన్నచూపు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది. వీసాల జారీలో సమతుల్యత ఉండాలి భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. – కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్ విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం ‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొ. పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ -
రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్
రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తే... మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, మీకు రుణం మంజూరు చేయాలా? చేయొద్దా? ఒకవేళ చేస్తే ఎంతమేరకు ఇవ్వొచ్చు అనేది తేల్చిచెప్పే నిపుణులు అక్కడ ఉంటారు. వారే.. క్రెడిట్ అనలిస్ట్‌లు. వీరు రుణ దాతలు, గ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తుంటారు. కార్పొరేట్ యుగంలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి సర్వసాధారణంగా మారాయి. అందుకే క్రెడిట్ అనలిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని తమ కెరీర్‌గా మార్చుకుంటే బ్రహ్మాండమైన అవకాశాలు, భారీ ఆదాయం సొంతం చేసుకోవచ్చు. సొంత ఏజెన్సీతో ఆదాయం పుష్కలం క్రెడిట్ విశ్లేషకులకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీఓ) రంగాల్లో కొలువులు దక్కుతున్నాయి. ఆసక్తి, అనుభవం ఉంటే సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనే అవకాశం కూడా ఉంది. దీంతో పనితీరును బట్టి అధిక ఆదాయం పొందొచ్చు. కార్పొరేట్ సంస్థలు తమకు కావాల్సిన రుణం కోసం బ్యాంకుల తలుపు తడుతుంటాయి. తమకు ఏ మేరకు రుణం అందుతుందో ముందే తెలుసుకోవడానికి క్రెడిట్ అనలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కంపెనీ బ్యాలన్స్ షీట్లు, ఫైనాన్షియల్ డేటా, న్యూస్ రిపోర్టులను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కంపెనీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలి. వ్యక్తులు కూడా రుణానికి సంబంధించిన సలహాల కోసం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి రంగంలో క్రెడిట్ అనలిస్ట్‌ల అవసరం ఉంటోంది. కావాల్సిన నైపుణ్యాలు: క్రెడిట్ అనలిస్ట్‌లకు మెరుగైన క్వాంటిటేటివ్, అనలిటికల్, ఆర్గనైజేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల పరిజ్ఞానం అవసరం. ఇంగ్లిష్‌లో రిపోర్ట్ రైటింగ్, ప్రజంటేషన్లను రూపొందించగలగాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే నేర్పు ఉండాలి. వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: ఎంబీఏ పూర్తిచేస్తే క్రెడిట్ అనలిస్ట్‌గా మారొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ సబ్జెక్టులు చదివినా ఎంబీఏ చేయొచ్చు. అయితే, క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ పెంచే సబ్జెక్టులు చదివితే ఈ రంగంలో సులువుగా రాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు బీటెక్, బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్హతలను కూడా కోరుకుంటున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చదివినవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ లాంటి సర్టిఫికేషన్లను అభ్యసించి అర్హతలు, నైపుణ్యాలను పెంచుకోవాలి. వేతనాలు: క్రెడిల్ అనలిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఉంటాయి. పేరొందిన కంపెనీలో చేరితే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. అనుభవం పెరిగేకొద్దీ ఈ ప్యాకేజీ బరువు కూడా పెరుగుతుంది. సంతృప్తికరమైన పనితీరు, ప్రతిభాపాటవాలతో సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) లేదా మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) స్థాయికి చేరుకోవచ్చు. పీజీ డిగ్రీ ఉండి, వృత్తిలో 20 ఏళ్ల అనుభవం కలిగిన సీఈఓకు ఏడాదికి రూ.40 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ ఉంటుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)- అహ్మదాబాద్. వెబ్సైట్: www.iimahd.ernet.in - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- బెంగళూరు. వెబ్సైట్: www.iimb.ernet.in - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in/du - డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ వెబ్సైట్: www.iitd.ac.in - ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్: www.icai.org - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.xlri.ac.in