న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► 2021 ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది.
► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు.
► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది.
► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి.
► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు.
► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి.
► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్‌మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్‌మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్‌లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది.
► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది.
తొమ్మిది రంగాలు ఇవి...
సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి.
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
Published Tue, Jan 11 2022 5:02 AM | Last Updated on Tue, Jan 11 2022 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment