number of employees
-
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021 ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. ► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు. ► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది. ► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి. ► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. ► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి. ► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్‌లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది. ► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది. తొమ్మిది రంగాలు ఇవి... సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి. -
ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు
• ఏప్రిల్ నాటికి లక్షకు చేరనున్న క్యాప్‌జెమిని ఉద్యోగులు • కంపెనీ భారత్ సబ్సిడరీ చీఫ్ వెల్లడి ముంబై: ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి లక్షను చేరనున్నది. రక్షణాత్మక విధానాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాలు అధికంగానే ఇస్తామని క్యాప్‌జెమిని తెలిపింది. ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు ఇస్తామని క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య 98,800గా ఉందని, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఈ సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భారతీయులు ఉద్యోగులుగా ఉన్న విదేశీ ఐటీ కంపెనీల్లో ఇది మూడవది. యాక్సెంచర్, ఐబీఎమ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ‘వీసా’ ఇబ్బందులు లేవు.. నియామకాల కోసం తాము సందర్శిస్తున్న క్యాంపస్‌ల సంఖ్య, ఇస్తున్న ఉద్యోగ ఆఫర్ల సంఖ్య పెరుగుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. రక్షణాత్మక విధానాలు తమపై ప్రభావం చూపబోవని, ఆటోమేషన్ జోరు పెరిగితేనే హైరింగ్ మందగిస్తుందని వివరించారు. తాము ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తే అక్కడి వారికే ఉద్యోగాలిస్తామని, అందుకని హెచ్ 1–బి వీసా ఇబ్బందులు తమపై ఉండవని వివరించారు. వీసా ఆంక్షలు ఉన్నప్పటికీ, అత్యున్నత ప్రతిభ గల అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు. ప్రతిపాదిత వీసా నిబంధనలపై స్పం దన అతిగా ఉందని విమర్శించారు. డిజిటల్‌కు మారడం, ఆటోమేషన్, క్లౌడ్..ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పెద్ద సమస్యలని పేర్కొన్నారు. 25 వేలమంది ఉద్యోగులతో కూడిన ఐ గేట్ విలీనం విజయవంతంగా పూర్తయిందన్నారు. -
‘ఉద్యానవనం’.. ఉద్యోగులు శూన్యం!
మోర్తాడ్ : జిల్లాలో ఉద్యానవన శాఖలోని ఖాళీలను, ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే పాలకుల హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉండిపోనున్నాయని స్పష్టమవుతుంది. జిల్లాలో 36 మండలాలు ఉండగా, కేవలం ఏడుగురు ఉద్యానవన శాఖాధికారులతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులందరికీ ఉ ద్యానవన శాఖ పథకాలు అందడం లేదని వెల్లడవుతోంది. జిల్లా అంతటికీ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ఒకటి , నాలుగు ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌లో ఏడీఏ పోస్టు ఉంది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలలో ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి అధికారి బదిలీ కాగా, ఇంతవరకు భర్తీ కాలేదు. ఆ ర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో మాత్రం ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు మూడు ఉన్నాయి. ఖాళీలతో లక్ష్యాలు చేరేనా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడటం, పం టలకు గిట్టుబాటు ధరలు అంతగా లేకపోవడం తో చాలామంది రైతులు ఉద్యానవనాల పెం పుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ సంవత్సరం వంద హెక్టార్లలో పం డ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఉద్యోగులు తక్కువగా ఉండటంతో పండ్ల తోటల పెంపకం 50 శాతం కూడా సాగయ్యే సూచనలు కనిపించడం లేదు. మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ, బత్తాయి, జామ, నిమ్మ తదితర పండ్లతోటలను పెంచడంతో పాటు రైతులకు కూరగాయల విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో అందించడం ఉద్యానవన శాఖ విధి. పండ్ల తోటల పెంపకంతో పాటు వ్యవసాయ పరికరాలు, పసుపు రైతులకు తగిన సూచనలు సలహాలు, పని ముట్లను ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నారు. పైరవీలు చేస్తేనే పనులు జిల్లాల్లో 36 మండలాలకు కేవలం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఒక ఉద్యానవన అధికారితోపాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డు కన్సల్టెంట్లు ఉంటేనే రైతులకు పరిపూర్ణంగా సేవలు అందుతాయి. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ శాఖ ద్వారా అందించే పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పైరవీలు చేసిన వారికి మాత్రమే ఉద్యానవన పథకాల లబ్ధి చేకూరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖ ప్రయోజనాలు అందాలంటే ఉద్యోగుల సంఖ్యను త్వరితగతిన పెంచాల్సిన అవసర ముందని పలువురు సూచిస్తున్నారు.