Generic drugs
-
యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో భారత్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్ 60 శాతం, లిపిడ్ రెగ్యులేటర్స్ 58, యాంటీ అల్సర్స్ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్ 56 శాతం, కొరియా 18, యూరప్ 11 శాతం బయోసిమిలర్స్ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్–యూఎస్ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. -
బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి ఇలా..
సాక్షి, కర్నూలు: రోగమొచ్చిందంటే వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే. బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నా యి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మూడు మెడికల్ షాపులు ఉన్నాయి. 2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి చెలామణి అవుతున్నాయి. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాస్తున్నారు. బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ వైద్యులు సైతం జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు ఆ పనిచేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి మార్పూ ఉండదు బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికం. ఉదాహరణకు డోలో 650 అనేది బ్రాండెడ్ మందు. కేవలం పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు. వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి. కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది జనరిక్ మందులు నాణ్యతలో బ్రాండెడ్ మందులతో ఏ మాత్రం తీసిపోవు. పైగా ఇవి బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. –ఎ.రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
జనరిక్‌తో జనానికి మేలు!
-
ప్రిస్క్రిప్షన్ ఇలా రాస్తే బెటర్.. లేదంటే ప్రమాదమే!
సాక్షి, అమరావతి: ‘డాక్టరు దగ్గరకు రోగి అనారోగ్యంతో, ఆపద పరిస్థితుల్లో వస్తారు. అలాంటి రోగికి డాక్టరు ఇచ్చే మందులు ఎప్పుడూ భారం కాకూడదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో ఒక మందు రాసి దీర్ఘకాలిక నష్టాలు చేకూర్చకూడదు. దీనివల్ల పేషెంట్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది’ అంటున్నారు వైద్యవిద్యాశాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ జి.శాంతారావు. రోగులకు ప్రిస్క్రిప్షన్ సూచించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఒక్కసారి పరిశీలించి ‘రైట్ మెడిసిన్–రైట్ పేషెంట్స్’ అనే సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలు వివరించారు. అవి ఆయన మాటల్లోనే. కరోనా పరిస్థితుల్లో ఏదో ఒకటి రాయద్దు చాలామంది రోగులు కరోనా పరిస్థితుల్లో ఫోన్లో మందులు అడుగుతున్నారు. దీనిపై డాక్టరు ఆలోచించి మందులు ఇవ్వాలి. రోగాన్ని, రోగిని అంచనా వేయకుండా ఇచ్చే మందులు చాలాసార్లు కాలేయం, మూత్రపిండాలు, గుండెకు నష్టం చేస్తున్నాయి. రోగాన్ని నయంచేసే ప్రతి మందు వల్ల ఎంతోకొంత నష్టమూ ఉంటుంది. ఆ నష్టాన్ని తక్కువగా ఉండేలా చూడాలి. అర్థమయ్యేలా రాయండి ఎవరికీ అర్థంకాని భాషలో చాలామంది ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. దీనివల్ల మెడికల్షాపులో ఊహించి మందులిస్తారు. ఒకవేళ వేరే మందులిస్తే రోగి పరిస్థితి ఏమిటి? దీన్ని ఒక్కసారి ఆలోచించి స్పష్టంగా రాయాలి. క్యాపిటల్ లెటర్స్‌లో మందులు రాస్తే నామోషీ ఏమీ కాదు. జనరిక్ మందులు రాస్తే మంచిది బ్రాండెడ్‌కు, జనరిక్ మందులకు రేటులో చాలా తేడా ఉంటుంది. జనరిక్ మందులు రాస్తే పేషెంట్లకు ఆర్థికభారం తగ్గుతుంది. రోగిని దృష్టిలో ఉంచుకోవాలి గానీ ఇందులో ఇతరత్రా ఏమీ చూడకూడదు. ఇలా అలవాటు చేస్తూ వెళితే జనరిక్ మందుల మీద నమ్మకమూ పెరుగుతుంది. మందుల్లో లోపాలు చెప్పడం ప్రజారోగ్యానికి ముఖ్యం మందులు వాడుతున్నారంటేనే ప్రమాదం వచ్చిందని లెక్క. ఆ మందులు మరో ప్రమాదానికి దారితీయకూడదు. అవనసర డోసులు రాయడం, ఏదో ఒకటి మందు అనే పద్ధతిలో నిర్లక్ష్యంగా రాయడం వంటివి రోగి జీవితకాలం బాధపడే వరకు తెస్తాయి. ఒక చిన్న నిర్లక్ష్యానికి రోగి అంతగా బాధపడకూడదు. కరోనా మందులతో పాటు పెయిన్‌కిల్లర్స్, యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్ వంటివి ఇచ్చేముందు ఒక్కసారి వాటిని మోతాదుకు మించి ఇస్తే జరిగే పరిణామాలను వివరిస్తే మంచిది. చిట్టీలో ఫోన్ నంబరు ఇవ్వాలి మనం ఇచ్చే మందులు ఒక్కోసారి వికటించవచ్చు. అలాంటప్పుడు మందులిచ్చింది ఒకరు, వైద్యం చేసేదొకరు వంటి పరిస్థితి రాకూడదు. అందుకే చిట్టీలో ఫోన్ నంబరు ఇస్తే...రోగి అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తారు. దానికి విధిగా స్పందించాలి. ఆ రోగియొక్క వైద్యం నీకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వే దాన్ని పరిష్కరించేలా ఉండాలి. వైద్యపరంగా లోపాలను తగ్గించాలి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం వైద్యపరంగా జరిగే లోపాలను అరికట్టాలని పేర్కొంది. మంచి డాక్టరు అంటే మంచి ప్రిస్క్రిప్షన్ రాయడమేనని చెప్పింది. ప్రిస్క్రిప్షన్‌లో పేరు, ఫోన్ నంబరు, చిరునామా అన్నీ ఇవ్వాలని సూచించింది. మందు స్వభావం, పనిచేసే తీరు, ఎంతకాలం తీసుకోవాలి, పేషెంటు వయసు, బరువు వంటివన్నీ ప్రిస్క్రిప్షన్‌లో ఉండాలని చెప్పింది. వీటిని డాక్టర్లు పాటించాలి. -
కళ్లుతిరిగే.. కార్పొ‘రేటు’.. రూ.10కి దొరికే టాబ్లెట్ 100కు!
విజయవాడ నక్కల రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుడివాడకు చెందిన ఓ రోగి స్వల్ప పక్షవాతంతో చేరారు. మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. ఆయనకు రూ.2.85 లక్షలు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి గొల్లుమనడం పేషెంట్ వంతయ్యింది. ఇందులో ఇంజెక్షన్ల ఖరీదే రూ.1.30 లక్షలు. వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రి కొన్నది రూ.65 వేలకు మాత్రమే. వైద్య శాఖలో పెద్ద హోదాలో రిటైర్ అయిన ఓ డాక్టర్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఇటీవలే ఓ 70 ఏళ్ల మహిళ కోవిడ్ బారినపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. వారం రోజులు చికిత్స చేసి రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో చూసినా నిత్యం ఇదే తంతు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరిట రోగులు, వారి కుటుంబీకుల నడ్డి విరుస్తున్నాయి. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి. చిన్న జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. జనరిక్ మందులు రాసేందుకు ససేమిరా బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్‌లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్పీని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ మందుల్లోనూ అంతే రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు. చట్టం చేయడం వల్లే నియంత్రణ సాధ్యం మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్‌ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం. – డాక్టర్ బి.సాంబశివారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్వహణ కష్టమవుతుంది ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు అమ్మితే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుంది. వందల మంది సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉంటాయి. 100 పడకల ఆస్పత్రిని నిర్వహించాలంటే ఇప్పుడు చాలా వ్యయమవుతోంది. ఇక జనరిక్ రాయాలంటే కొద్దిగా క్వాలిటీని చూసుకోవాలి కదా. ఎంఆర్పీ కంటే తగ్గించడం కష్టం. – డాక్టర్ మురళి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖ -
జనరిక్ మందులపై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కడప, చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే కడప–బెంగళూరు 268 కి.మీ. పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రగతిని ప్రధాని ఏపీ, కర్ణాటక సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పథకంపై మోదీ సమీక్షించారు. ప్రధాని మాట్లాడుతూ జనరిక్ మందుల వినియోగంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. జనరిక్ మందుల కేంద్రాల ఏర్పాటుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సివిల్ ఆస్పత్రుల్లో అద్దెలేని స్థలాలను కల్పించాలని సూచించారు. అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉంది నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వైఎస్సార్ కడప జిల్లాలో 56.04 హెక్టార్ల భూమికి అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ మాట్లాడుతూ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 56 హెక్టార్ల భూమికి అటవీ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు చేపట్టామని సీఎస్ వివరించారు. రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్, బోర్డ్ ఆస్పత్రులు జనరిక్ మందులు వినియోగంలో మంచి ఫలితాలు సాధించాయని, మిగతా అన్ని ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వినియోగంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. -
భారతీయ ఫార్మా కంపెనీలపై దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఓ దావాను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సన్ ఫార్మా, లుపిన్, అరబిందో సహా 26 కంపెనీలు ఉన్నాయి. కుట్రపూరితంగా ధరలను కృత్రిమంగా పెంచడం, పోటీని తగ్గించడం, యూఎస్‌లో జరుగుతున్న జనరిక్ డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకున్నాయని ఆరోపిస్తూ మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ ఫ్రోష్ కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. జనరిక్ డ్రగ్ మార్కెట్ తిరిగి గాడిలో పడేందుకై ఈ కంపెనీలతోపాటు 10 మంది వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా చేస్తూ వీరి నుంచి నష్టపరిహారం, జరిమానాతోపాటు తగు చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు. 80 రకాల జనరిక్ డ్రగ్స్ విషయమై విచారణ సాగనుంది. మేరీల్యాండ్‌తోపాటు యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా దాఖలులో సహ పార్టీలుగా ఉన్నారు. ఈ కంపెనీల ధర నియంత్రణ పథకాలు రోగులకు, బీమా కంపెనీలకు భారంగా మారాయి అని ఫ్రోష్ వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకుతోడు తాజాగా వేసిన దావా మూడవదికాగా, కంపెనీలు ఇలా ఏకమై ధరలు పెంచిన కేసు యూఎస్ చరిత్రలో అతిపెద్దది అంటూ వ్యాఖ్యానించారు. -
మందులన్నింటా మాయాజాలమే.. వంచనే
అర్ధ శతాబ్దంగా మందుల ధరలు, ప్రమాణాలు, క్లిని కల్ ట్రయల్స్, విపరిణామాలపై దుమారం రేగుతూనే ఉంది. 30 ఏళ్లుగా భారతీయ ఫార్మా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. అప్పట్లో ఇంకా జనరిక్ మందుల ప్రయోగం, వాడకం మొదలు కాలేదు. ఎన్ని అవకతవకలకు పాల్పడినా మన దేశీకంపెనీలు పోటీతత్వం ఇంకా పలు కారణాలచేత నాణ్యతను, పోటీ వెలను సాధించి ప్రజలకు చికిత్స నోచుకోవడానికి కొంత సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది వాస్తవం. అవి బాగా లాభాలు సంపాదించిందీ వాస్తవం. ఇక్కడ, విదేశాల్లో జనరిక్, బ్రాండెడ్ వ్యాపారం చేసే సంస్థలు రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేసి పార్లమెంట్‌ను, ఇండియన్ డ్రగ్ కంట్రోలర్ జనరల్‌ను మచ్చిక చేసుకొని, దారికి తెచ్చుకున్నదీ వాస్తవమే. క్యాథరన్ ఇబాన్ రాసిన ‘బాటిల్ ఆఫ్ లైస్ : రాన్‌బాక్సీ ఆండ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫార్మా’ అనే పుస్తకం ఆధారంగా సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ ‘జనరిక్ మందులు పనిచేస్తున్నాయా?’ పేరిట రాసిన సాక్షి ఎడిట్ పేజీ వ్యాసంలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నప్పటికీ, నాసిరకం, అంతులేని మోసపూరిత విధానాలు కేవలం జనరిక్ మందులకే కాదు దేశీ, విదేశీ బ్రాండెడ్ మందులకు కూడ అంతే వర్తిస్తాయి. మరి, అక్రమ లాభాలపై కొరడా ఝళిపించే ‘చౌకీదారులు’ ఏం చేస్తునట్లు? గత ఇరవై ఏళ్లలో దేశీ మార్కెట్ కంటే పేటెంట్ ముగి సిన మందులను మరో రసాయనిక క్రమంలో రూపొందించి విదేశీ జనరిక్ మార్కెట్లో అమ్మడం ద్వారా వేలవేల కోట్ల లాభాలను మన దేశీ కంపెనీలు ఆర్జించాయి. నిజమే రాన్‌బ్యాక్సీ, ఇతర కంపెనీలు ఇతర దేశాలకు ఉత్పత్తి చేసే జనరిక్ మందుల ప్రమాణాలను దేశీయ మార్కెట్లో పాటించకపోతే పాలకులది తప్పు కానీ జనరిక్ మందులది కాదు కదా!. ర్యాన్ బ్యాక్సీ మాజీ ఉద్యోగి దినేష్ టాకూర్ 2004లో చాలా విషయాలను, ఫార్మా కంపెనీల గోల్మాల్ను, ల్యాబరేటరీలు, వాటి నాణ్యతా పరీక్షల క్విడ్‌ప్రో గురించి చెప్పింది బ్రాండెడ్, జనరిక్ అన్ని మందుల గురించే. కరణ్ థాపర్ కాథరిన్ ఇబాన్ పుస్తకాన్ని తిరగేసినప్పుడు కనపడిన చీకటి కోణం... జనరిక్ మందులను అనుమానించడంతో సమాప్తమయ్యేది కాదు. సగటు భారతీయుడు ఖర్చుపెడుతున్న సరాసరి ఖర్చుల్లో సింహ భాగం ఈ ఆకలిగొన్న ఫార్మా లాభాల సింహమే మింగేస్తున్నప్పుడు అడిగే పాలక, ప్రతిపక్ష సభ్యులేరి? సంఘాలేవీ? ఇప్పుడు దేశంలో కొత్త పదం వాడుకలో ఉంది. అవి బ్రాండెడ్ జనరిక్స్ మందులను ప్రజలు కూడా నమ్మకంతో పెద్ద కంపెనీ మందులు అని అనుకుంటారు. కానీ చాల బ్రాండెడ్, జనరిక్స్ రేటు వాటి అసలు బ్రాండెడ్ మందుల కంటే ఎక్కువ. అంత మాత్రానికి ‘జనరిక్ వెర్షన్’ ఎందుకు? జనరిక్‌లో నాసిరకం ఉంటే బ్రాండెడ్ను ఏరికోరి తప్పక కొనే కుట్ర కూడా ఉందేమో? హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్ హెడ్ ఫ్రొఫెసర్ నితీష్ చౌదరి జనరిక్ మందులు బ్రాండెడ్ మందులకంటే ఏ విధంగానూ తక్కువకాదని, చిన్న తేడాలు అంత ముఖ్యం కాదని, జనరిక్ మందులు చౌకగా అందుబాటులోకి వస్తే రోగి మందులు అర్ధం తరంగా కొనలేక ఆపివేసే ప్రమాదం తక్కువని, ఆరోగ్య వ్యవస్థపై జనరిక్ మందులది సానుకూల అంశమే అని ప్రకటించారు. ప్రజానుకూల నాయకుల ఒత్తిడి ప్రతిఫలంగానే యూపీఏ ప్రభుత్వ సమయంలో జన ఔషధీ కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెరచి, జనరిక్స్‌ను ప్రోత్సహించారు. కానీ వీటిని దేశి మార్కెట్లో బ్రాండెడ్ ధరలతో సమానంగా అమ్మడం, జనరిక్ మందుల నాణ్యతాప్రమాణాల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టకపోవడంతో అతి పెద్ద తప్పుడు ఆచరణ కొనసాగింది. జనరిక్ మందులపై కొత్త భయాలను బ్రాండెడ్ మందుల మీద కొత్త భ్రమలను పెంచుకోవద్దని అంతా దొందూ... దొందే దోరణి కొనసాగుతుందని పై విషయాలు తెలియజేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కూడా మార్కెటింగ్ చేసుకునే దయనీయ స్థితిలో ఉన్న మన దేశంలో జనరిక్ మీద దాడి కంటే ఎట్లా గాడిలో పెట్టాలో కరణ్ థాపర్ సూచిస్తే బాగుండేది. ఆరోగ్యవ్యవస్థలో అత్యంత సున్నితమైన అనేక అంశాల మీద తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందుల నాణ్యత మీద, నిఘా, ధరల విషయంలో నిర్దాక్షిణ్యంగా తగ్గించడం చేస్తే గాని ఈ దేశంలో, ఈ దశాబ్దంలో ఎన్నో ట్రిలియన్ డాలర్లు దేశ ప్రజలకు అమెరికాలోవలె పొదుపు కావు కదా! దయగల ప్రభువులు ప్రజల ఎడల ప్రేమ ఉన్న సంఘాలను, నిపుణులను పిలిచే ‘అచ్చేదిన్’ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడాల్సిందే. అప్పటిదాక జరిగే దందాలో మందుల కంపెనీలు, పాలకులు, దళారులు, క్లినికల్ ట్రయల్ ల్యాబ్‌లు, డాక్టర్లు, హాస్పిటల్స్, మందుల షాపులు అనివార్యంగా భాగస్వాములే. డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త రాజకీయ కార్యకర్త, వైద్యులు మొబైల్: 98484 72329 -
జనరిక్ మందులు ఎంతో మేలు
నిజామాబాద్ అర్బన్ : జనరిక్ మందులు ఎంతో ప్రయోజనకరమని మధ్య, పేద తరగతి వారికి ఆర్థిక భారం ఉండదని రాష్ట్ర ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రనాథ్సాయి అన్నారు. ఆదివారం నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మెడిజన్ జనరిక్ మందుల షాపును ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ జనరిక్ మందులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మరికొద్ది రోజు ల్లో మండలస్థాయిల్లో మూడు మందుల షాపుల చొప్పున ప్రారంభించనున్నామన్నారు. ప్రభుత్వం జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మందులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జనరిక్ మందులు కంపెనీల మందులతో సమానంగా పనిచేస్తాయన్నారు. ప్రజలకు ఆర్థికభారం ఉండదన్నారు. షాపు నిర్వహకులు పాల్గొన్నారు. -
ఇదో జనరిక్ దోపిడీ
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సావిత్రి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని నక్కలరోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈమె ఐసీయూలో మూడు రోజులు ఉన్నారు. ఈమెకు మెరీపెనం యాంటీబయోటిక్ ఇంజెక్షన్ వాడారు. ఇది బ్రాండెడ్ జనరిక్ మందు. దీని వాస్తవ ధర రూ.150. ఎంఆర్పీ మాత్రం రూ.2 వేలు ఉంటుంది. ఈ మందును సావిత్రికి రూ.1800కు విక్రయించి బిల్లువేశారు. సాక్షి, అమరావతి: మందులు తయారు చేసే కంపెనీలు.. వాటిని అమ్మే డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ వ్యాపారులు అందరూ లాభాలు చూసుకుని సేఫ్‌గా బయటపడుతున్నారు. చివరి లబ్ధిదారుడు, బాధితుడు అయిన రోగికి మాత్రం దిమ్మ తిరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్–జనరిక్ అనే మాయా ప్రపంచంలో ఏది అమ్ముతున్నారో, దేనికెంత వసూలు చేస్తున్నారో తెలియని సామాన్య రోగి.. జబ్బు నయం కావాలనే ఆశతో సర్వశక్తులూ ఒడ్డి మందులకు చెల్లిస్తున్నాడు. ఒళ్లు గుల్ల చేసుకుని, ఇళ్లమ్ముకుని, అప్పులు చేసుకుని ఆస్పత్రి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడుతున్న పరిస్థితి కలచివేస్తోంది. మందుల మాఫియా కోరల్లో విలవిలలాడుతున్న సామాన్య రోగుల పరిస్థితి రోజుకో రకంగా మారుతోంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ బ్రాండెడ్ జనరిక్ మాఫియా బారిన లక్షలాది మంది పేద రోగులు నిలువెల్లా మోసపోతున్నారు. ఈ మోసాన్ని అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఎక్కడా కానరావడంలేదు. బ్రాండెడ్ కంపెనీలు జనరిక్ బాటలో చాలా మల్టీ నేషనల్ ఫార్మాస్యుటికల్ కంపెనీలు బ్రాండెడ్ జనరిక్ పేరుతో మందులు తయారు చేస్తున్నాయి. వీటిపై ఎంఆర్పీ ధరలు ఇప్పటికీ రివైజ్ (సవరణ) చెయ్యలేదు. ఉదాహరణకు సెఫిపారజోన్ ఇంజక్షన్ ధర ఎంఆర్పీ రూ.370 ఉంటుంది. కానీ దీని జనరిక్ ధర 30 రూపాయలే. ఇలాంటి వందలాది రకాల బ్రాండెడ్ జనరిక్ ధరలు ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రాండెడ్ రేట్లకే అమ్ముతున్నారు. రోగికి ఏది బ్రాండెడో, ఏది జనరిక్ మందులో అర్థం కాక ఆస్పత్రులు వేస్తున్న బిల్లులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. ఇలా రోజూ వేలాది మంది రోగుల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మోకాలి చిప్పల రేట్లు తగ్గినా కొన్ని నెలల క్రితం ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యుటిక్ ప్రైసింగ్ అథారిటీ) దేశంలో ఏ కంపెనీ అయినా సరే మోకాలిచిప్పను రూ.36 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించి, ఈ ఇంప్లాంట్స్‌ను ధరల నియంత్రణలోకి తెచ్చింది. గుండెకు వేసే స్టెంట్‌ను కూడా ధరల నియంత్రణలోకి తెచ్చింది. మోకాలి చిప్పల ధరలు తగ్గక మునుపు ఒక్కో కాలికి మోకాలి చిప్ప మార్చాలంటే లక్షన్నర నుంచి రూ.1.70 లక్షల వరకూ వసూలు చేసేవారు. ఇప్పుడు అంతే వసూలు చేస్తున్నారు. అదేమంటే ప్రొసీజర్ కాస్ట్, నర్సింగ్ కాస్ట్, థియేటర్ చార్జీల పేరిట బిల్లు వేస్తున్నారు. గుండెకు వేసే స్టెంట్ల ధరలు కూడా ధరల నియంత్రణలోకి వచ్చినా అవి వేయించుకునే రోగులకు మాత్రం బిల్లులు లక్షల్లోనే వేస్తున్నారు. -
జనరిక్ మందులు రాయకుంటే చర్యలు
న్యూఢిల్లీ: ఇక వైద్యులు జనరిక్ మందులనే ప్రిస్క్రిప్షన్‌లో రాయాలని, అలా రాయని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) హెచ్చరించింది. జనరిక్ మందులపై తాజాగా ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలకు ఎంసీఐ నడుంబిగించింది. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌లో మందుల పేర్లను పెద్దక్షరాలతోనే (కేపిటల్ లెటర్స్) రాయాలని ఆదేశించింది. 2016లోనే ఈ ఆదేశాలు జారీ చేసినా సరిగా అమలు కాకపోవడంతో.. ఇకపై చర్యలకు ఉపక్రమించనున్నట్లు పేర్కొంది. -
జనరిక్ మందులే రాయాలి!
వైద్యులంతా అనుసరించేలా త్వరలో నిబంధనలు ► గిరిజనులకు భూ హక్కులివ్వకుండా కాంగ్రెస్ మోసం ► ధాన్యం సేకరణ గడువు వారం పెంపు ► గుజరాత్ పర్యటనలో మోదీ సూరత్/సిల్వాసా: దేశవ్యాప్తంగా డాక్టర్లు.. ప్రజలకు జనరిక్ మందులు రాసేలా నిబంధనలు తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పా రు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువ ధరకే దొరికే జనరిక్ మందుల వినియోగం పెంచాలన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.400 కోట్లతో నిర్మించిన కిరణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం మోదీ ప్రారంభించారు. ‘పేదల ఆరోగ్యం మెరుగుపరిచే విషయంలో ధనికులు తమవంతు పాత్ర పోషించాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లోని చేతిరాత అర్థం కాక పేదలు ప్రైవేటు మెడికల్ దుకాణాల్లో వెళ్లి ఖరీదైన మందులు కొనాల్సి వస్తోంది. డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్‌లో తప్పనిసరిగా జనరిక్ మందులే వాడాలని సూచించేలా నిబంధనలు తెస్తాం. మన దేశంలో వైద్యులు తక్కువ, ఆసుపత్రులు తక్కువ. కానీ మందుల ధరలు మాత్రం చాలా ఎక్కువ’ అని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చి స్టెంట్లు, మందుల ధరలను నియంత్రిస్తే.. కొన్ని ఫార్మాకంపెనీలకు చాలా కోపం వచ్చిందన్నారు. దాదాపు 700 మందుల ధరలను పేదలకు అందుబాటులో ఉండేలా నియంత్రించినట్లు మోదీ గుర్తుచేశారు. తక్కువధరకే ప్రజలకు వైద్య సేవలందించటం ప్రభుత్వ బాధ్యత అని మోదీ తెలిపారు. ‘సేవా పరమో ధర్మ’ భారతీయుల నినాదమన్నారు. అయితే రోగాలు రాకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపించాలని.. స్వచ్ఛంగా ఉండటంతోపాటు యోగా చేయటం ద్వారా అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ధాన్యం సేకరణ గడువు పెంపు దేశవ్యాప్తంగా రైతులకు భారీ ఊరటనిచ్చేలా.. ధాన్యం సేకరణ గడువును పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ గడువును మరో వారం రోజులు పెంచుతున్నట్లు తెలిపారు. బాజీపురలో సూరత్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల ఫీడ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. కందిపప్పు ఉత్పత్తి పెరిగేందుకు మరింత ప్రయత్నం చేయాలన్న తన విన్నపాన్ని అంగీకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘గతేడాది రుతుపవనాలు ఆలస్యం కావటంతో పంట ఆలస్యమైంది. అందుకే తొలిసారిగా కనీస మద్దతు ధరకే ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించాం. ఇటీవలే కొందరు రైతులు సేకరణ గడువు పెంచాలని కోరారు. అందుకే దీన్ని వారం రోజులు పెంచుతున్నాం’ అని మోదీ ప్రకటించారు. రైతులు సౌరవిద్యుత్ ప్యానెల్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, తేనె ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేసుకోవాలని ప్రధాని సూచించారు. నవీ పార్డీ గ్రామంలో ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వజ్రాలు, ఆభరణాల రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దటంలో సూరత్ వజ్రాల వ్యాపారులు పనిచేయాలని ప్రధాని కోరారు. సూరత్‌లో వజ్రాల కటింగ్ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం వ్యాపారులనుద్దేశించి మోదీ మాట్లాడారు. కాంగ్రెస్‌చేతిలో మోసపోయారు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గిరిజనులకు భూముల కేటాయింపులో గత యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మోదీ విమర్శించారు. నేరుగా కేంద్రం ఆజమాయిషీలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల గిరిజనుల భూముల హక్కుల విషయంలోనూ యూపీఏ సర్కారు తన బాధ్యతను నిర్వహించకపోగా.. రాష్ట్రాలను విమర్శించిందని గుర్తుచేశారు. దాద్రా, నగర్ హవేలీలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క గిరిజనుడికి కూడా భూమిపై హక్కులు ఇవ్వలేదని తెలిసి ఆశ్చర్యపోయాను అని మోదీ చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాన్వాయ్ ఆపి.. చిన్నారిని కలిసి సూరత్‌కు చెందిన నాలుగేళ్ల నాన్సీ అనే చిన్నారి ప్రధాని మోదీకి వీరాభిమాని. టీవీలో మోదీని చూసినపుడల్లా ఉత్సాహంగా ‘మోదీ దాదా’ అంటూ గంతులేస్తుంది. మోదీని కలవాలన్నది ఆమె కల. ప్రధానిని కలవటం కష్టమే.. కానీ ఆమెకు మాత్రం చాలా సులువుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశం దక్కింది. సోమవారం సూరత్ పర్యటనలో భాగంగా మోదీ ఆసుపత్రి ప్రారంభానికి వెళ్తున్నారు. రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి మోదీకి స్వాగతం పలుకుతున్నారు. డైమండ్ కట్టర్‌గా పనిచేసే నాన్సీ తండ్రి.. కూతురితో రోడ్డుపక్కన నిలబడ్డారు. కాన్వాయ్ వేగంగా సాగుతుండగానే.. తం డ్రి చంక దిగిన నాన్సీ ప్రధాని కారు వైపు పరిగెట్టింది. ఆ చిన్నారిని ఆపేందుకు ఎస్పీజీ కమాండోలు యత్నిస్తుండగానే.. ఆశ్చర్యకరంగా మోదీ తన కాన్వాయ్ ఆపారు. ఆమెను కారులోకి తీసుకొని ఆప్యాయంగా పలకరించి ముద్దాడారు. -
అమెరికాలో మరో 10 జనరిక్ ఔషధాలు
వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో నాట్కో లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొత్తగా మరో 10 జనరిక్స్ ఔషధాల తయారీ అనుమతుల కోసం ఏఎన్‌డీఏలు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ కీలకమైన ఔషధాలకు సంబంధించి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏకి 38 ఏఎన్‌డీఏలు దాఖలు చేసింది. సూత్రప్రాయ అనుమతులు లభించిన మూడింటితో పాటు మొత్తం 16 ఏఎన్‌డీఏలకు అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా ఇన్వెస్టర్లకు తెలిపింది. ఎఫ్‌డీఏ సమీక్షిస్తున్న 21 ఔషధాల మార్కెట్ విలువ దాదాపు 15.4 బిలియన్ డాలర్ల మేర ఉండనున్నట్లు పేర్కొంది. అమెరికా మార్కెట్‌కు సంబంధించి అల్వోజెన్, మైలాన్ తదితర సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నాట్కో ఆదాయాల్లో ఆరు శాతం పైగా వెచ్చిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 309 కోట్ల ఆదాయంపై రూ. 51 కోట్ల ఆదాయం ఆర్జించింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం లాభంతో రూ. 659.55 వద్ద ముగిసింది. -
ఎంఎన్సీ టేకోవర్లతో దేశీ ఫార్మా కుదేలు
బ్రౌన్‌ఫీల్డ్ ఫార్మాలో ఎఫ్‌డీఐలను నిషేధించాలి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీ) టేకోవర్లు చేస్తుండటంతో ప్రస్తుత విధానాలు ఇలాగే కొనసాగితే దేశీ ఫార్మా సంస్థలు కుదేలయ్యే ప్రమాదం ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా యూనిట్లలో (బ్రౌన్ ఫీల్డ్ యూనిట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించాలని సూచించింది. లేని పక్షంలో జనరిక్ ఔషధాలను చౌకగా అందించడంలో దేశీ ఫార్మా సంస్థల సామర్ధ్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఫార్మా ఎఫ్‌డీఐలపై గతంలో చేసిన సిఫార్సుల మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించి స్థాయీ సంఘం సమర్పించిన నివేదికను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేవలం ఎఫ్‌డీఐ గణాంకాలపైనే దృష్టి పెట్టిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ).. దేశీ ఫార్మా కంపెనీలను ఎంఎన్‌సీలు ఇష్టారీతిగా టేకోవర్ చే స్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని నివేదిక తూర్పారబట్టింది. చౌక జనరిక్స్‌కి కేంద్రంగా భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దిన దేశీ దిగ్గజాలు కనుమరుగైపోతే విదేశీ కంపెనీల చేతిలో పడి భారత ఫార్మా పరిశ్రమ లాభాపేక్షే ధ్యేయంగా ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా అందుబాటు ధరలో ఔషధాలు లభించడానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖతో డీఐపీపీ కలిసి పనిచేయాలని సూచించింది. -
ఎయిమ్స్‌లో ఉచితంగా మందులు
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రి ఔట్‌పేషెంట్లకు ఉచితంగా జనరిక్ మందులు అందజేసేందుకు త్వరలో ప్రత్యేకంగా ఫార్మసీని ప్రారంభించ నున్నారు. ‘ఇది ఈ నెల ఒకటిన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్థలసేకరణ కోసం సమయం పట్టడం వల్ల ఆలస్యం జరుగుతోంది. ఔట్‌పేషెంట్లకు ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తాం’ అని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెంట్ డీకే శర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ ఈ ఫార్మసీని నిర్వహిస్తుందన్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాటికి బదులు జనరిక్ మందులు మాత్రమే రాయాల్సిందిగా ఎయిమ్స్ తన డాక్టర్లను ఆదేశించనుంది. అంతేగాక మందుల నాణ్యతను పరీక్షించడానికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమిస్తారు. అన్ని విభాగాల అధిపతులతో గత ఏడాది చర్చలు జరిపిన అనంతరం ఉచిత మందుల జాబితాను తయారు చేశామని శర్మ తెలిపారు. ఉచిత మందుల ఫార్మసీ ప్రతిపాదన ఐదేళ్ల క్రితమే వచ్చినా రెండేళ్ల క్రితమే దీనికి ఆమోదం లభించింది. -
దేశీ ఫార్మా కంపెనీలకు భలే చాన్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒత్తిడి నివారణకు వినియోగించే సింబల్టా ఔషధానికి జనరిక్ వెర్షన్ తయారు చేసి విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మాతో సహా ఐదు దేశీయ కంపెనీలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడికి గురయ్యే వారి చికిత్సకు వినియోగించే ఈ ఔషధానికి అమెరికాలో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ ఉన్నట్లు అంచనా. దీంతో ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన దేశీయ కంపెనీలు అరబిందో, డాక్టర్ రెడ్డీస్‌తో సహా లుపిన్, సన్‌ఫార్మా గ్లోబల్ ఎఫ్జెడ్ఈ, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఆదాయాలు రానున్న కాలంలో గణనీయంగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఊరిస్తున్న భారీ మార్కెట్... ఇప్పటివరకు సింబల్టా ఔషధంపై ప్రత్యేక హక్కులు కలిగి ఉన్న ఎలి లిల్లీ చెప్పిన ప్రకారం గడిచిన తొమ్మిది నెలల్లో 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ ఔషధం నుంచే సమకూరింది. కాని ఎలీ లిల్లీకి సింబల్టా పైన ఉన్న ప్రత్యేక హక్కులకు కాలపరిమితి డిసెంబర్ 11తో ముగిసిపోవడంతో దేశీయ కంపెనీలకు జనరిక్ వెర్షన్‌తో అమెరికాలో విక్రయించడానికి అనుమతి లభించింది. -
సేవే పరమావధి కావాలి
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తక్కువ ధరకు వచ్చే జనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులకు ఏమాత్రం తీసిపోని విధంగా రోగాలు నయం అవుతాయని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించి జనరిక్ మందులు కొనుగోలు చేసే విధంగా డాక్టర్లు ప్రోత్సహించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కోరారు. సామాన్యులకు వైద్యసేవలు అందించడమే పరమావధిగా భావించాలని, సామాన్యుడికి సహాయపడాలనే బాధ్యతను వైద్యులు విస్మరించకూడదని హితబోధచేశారు. ధనంతో ఆరోగ్యంరాదని, ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకున్నప్పుడే కుటుంబాలు బాగుపడతాయని ఆయన గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన ‘41వ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా’ సదస్సుకు శనివారం గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిషియన్లు రోగులతో చికాకుపడకుండా ఓపికతో మాట్లాడితే రోగాన్ని సులభంగా గుర్తించవచ్చన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడ కూడదని వైద్యులకు సూచించారు. వైద్యుడు దేవునితో సమానమని ప్రజలు భావిస్తారని అందుకే వైద్యో నారాయణ హరీ అన్నారని గుర్తుచేశారు. క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులాంటి వ్యాధుల చికిత్స ఎంతో ఖరీదుతో కూడుకున్నదని, వీటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమేనన్నారు. అందుకు వైద్యులు, వైద్యవిద్యార్థులు, ఆరోగ్యంపై కృషిచేసే స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. వైద్యపట్టా హోదాకు గుర్తింపు కాదని, పేదలసేవే పరమావధిగా వైద్యులు భావించాలన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలి: కలెక్టర్ కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. జిల్లా లో మాతాశిశు మరణాలు, టీబీ వంటి జబ్బుల శాతం ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. వాటిని నివారించేందుకు ఇలాంటి వైద్యసదస్సులు దో హదపడాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చిన గవర్నర్ నేరుగా రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంకు వెళ్లారు. అక్కడికి వచ్చిన బాలానగర్ కెజీబీవీకి చెందిన విద్యార్థినులు సోను, సరళతో మాట్లాడారు. ముఖ్యం గా విద్యపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వైద్య సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను గవర్నర్ విడుదల చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ ఎ.మృగనాథన్, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఐవీ రావు, ఏపీ కాన్ సెక్రటరీ డాక్టర్ వైఎస్ఎన్. రాజు, ఎలక్టెడ్ చైర్మన్ డాక్టర్ ఎస్వీ రమణ మూర్తి, వైద్యసదస్సు నిర్వహణ చైర్మన్ డాక్టర్ కేజే రెడ్డి, రామచంద్రారెడ్డి, డాక్టర్ రాంరెడ్డి, జిల్లా ఎస్పీ డి.నాగేంద్ర కుమార్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ పి.రాజారాం, డీఆర్వో రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.