అర్ధ శతాబ్దంగా మందుల ధరలు, ప్రమాణాలు, క్లిని కల్ ట్రయల్స్, విపరిణామాలపై దుమారం రేగుతూనే ఉంది. 30 ఏళ్లుగా భారతీయ ఫార్మా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. అప్పట్లో ఇంకా జనరిక్ మందుల ప్రయోగం, వాడకం మొదలు కాలేదు. ఎన్ని అవకతవకలకు పాల్పడినా మన దేశీకంపెనీలు పోటీతత్వం ఇంకా పలు కారణాలచేత నాణ్యతను, పోటీ వెలను సాధించి ప్రజలకు చికిత్స నోచుకోవడానికి కొంత సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది వాస్తవం. అవి బాగా లాభాలు సంపాదించిందీ వాస్తవం. ఇక్కడ, విదేశాల్లో జనరిక్, బ్రాండెడ్ వ్యాపారం చేసే సంస్థలు రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేసి పార్లమెంట్‌ను, ఇండియన్ డ్రగ్ కంట్రోలర్ జనరల్‌ను మచ్చిక చేసుకొని, దారికి తెచ్చుకున్నదీ వాస్తవమే.
క్యాథరన్ ఇబాన్ రాసిన ‘బాటిల్ ఆఫ్ లైస్ : రాన్‌బాక్సీ ఆండ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫార్మా’ అనే పుస్తకం ఆధారంగా సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ ‘జనరిక్ మందులు పనిచేస్తున్నాయా?’ పేరిట రాసిన సాక్షి ఎడిట్ పేజీ వ్యాసంలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నప్పటికీ, నాసిరకం, అంతులేని మోసపూరిత విధానాలు కేవలం జనరిక్ మందులకే కాదు దేశీ, విదేశీ బ్రాండెడ్ మందులకు కూడ అంతే వర్తిస్తాయి. మరి, అక్రమ లాభాలపై కొరడా ఝళిపించే ‘చౌకీదారులు’ ఏం చేస్తునట్లు? గత ఇరవై ఏళ్లలో దేశీ మార్కెట్ కంటే పేటెంట్ ముగి సిన మందులను మరో రసాయనిక క్రమంలో రూపొందించి విదేశీ జనరిక్ మార్కెట్లో అమ్మడం ద్వారా వేలవేల కోట్ల లాభాలను మన దేశీ కంపెనీలు ఆర్జించాయి. నిజమే రాన్‌బ్యాక్సీ, ఇతర కంపెనీలు ఇతర దేశాలకు ఉత్పత్తి చేసే జనరిక్ మందుల ప్రమాణాలను దేశీయ మార్కెట్‌లో పాటించకపోతే పాలకులది తప్పు కానీ జనరిక్ మందులది కాదు కదా!. ర్యాన్ బ్యాక్సీ మాజీ ఉద్యోగి దినేష్ టాకూర్ 2004లో చాలా విషయాలను, ఫార్మా కంపెనీల గోల్‌మాల్‌ను, ల్యాబరేటరీలు, వాటి నాణ్యతా పరీక్షల క్విడ్‌ప్రో గురించి చెప్పింది బ్రాండెడ్, జనరిక్ అన్ని మందుల గురించే.
కరణ్ థాపర్ కాథరిన్ ఇబాన్ పుస్తకాన్ని తిరగేసినప్పుడు కనపడిన చీకటి కోణం... జనరిక్ మందులను అనుమానించడంతో సమాప్తమయ్యేది కాదు. సగటు భారతీయుడు ఖర్చుపెడుతున్న సరాసరి ఖర్చుల్లో సింహ భాగం ఈ ఆకలిగొన్న ఫార్మా లాభాల సింహమే మింగేస్తున్నప్పుడు అడిగే పాలక, ప్రతిపక్ష సభ్యులేరి? సంఘాలేవీ? ఇప్పుడు దేశంలో కొత్త పదం వాడుకలో ఉంది. అవి బ్రాండెడ్ జనరిక్స్ మందులను ప్రజలు కూడా నమ్మకంతో పెద్ద కంపెనీ మందులు అని అనుకుంటారు. కానీ చాల బ్రాండెడ్, జనరిక్స్ రేటు వాటి అసలు బ్రాండెడ్ మందుల కంటే ఎక్కువ. అంత మాత్రానికి ‘జనరిక్ వెర్షన్’ ఎందుకు? జనరిక్‌లో నాసిరకం ఉంటే బ్రాండెడ్‌ను ఏరికోరి తప్పక కొనే కుట్ర కూడా ఉందేమో?
హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్ హెడ్ ఫ్రొఫెసర్ నితీష్ చౌదరి జనరిక్ మందులు బ్రాండెడ్ మందులకంటే ఏ విధంగానూ తక్కువకాదని, చిన్న తేడాలు అంత ముఖ్యం కాదని, జనరిక్ మందులు చౌకగా అందుబాటులోకి వస్తే రోగి మందులు అర్ధం తరంగా కొనలేక ఆపివేసే ప్రమాదం తక్కువని, ఆరోగ్య వ్యవస్థపై జనరిక్ మందులది సానుకూల అంశమే అని ప్రకటించారు. ప్రజానుకూల నాయకుల ఒత్తిడి ప్రతిఫలంగానే యూపీఏ ప్రభుత్వ సమయంలో జన ఔషధీ కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెరచి, జనరిక్స్‌ను ప్రోత్సహించారు. కానీ వీటిని దేశి మార్కెట్‌లో బ్రాండెడ్ ధరలతో సమానంగా అమ్మడం, జనరిక్ మందుల నాణ్యతాప్రమాణాల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టకపోవడంతో అతి పెద్ద తప్పుడు ఆచరణ కొనసాగింది. జనరిక్ మందులపై కొత్త భయాలను బ్రాండెడ్ మందుల మీద కొత్త భ్రమలను పెంచుకోవద్దని అంతా దొందూ... దొందే దోరణి కొనసాగుతుందని పై విషయాలు తెలియజేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కూడా మార్కెటింగ్ చేసుకునే దయనీయ స్థితిలో ఉన్న మన దేశంలో జనరిక్ మీద దాడి కంటే ఎట్లా గాడిలో పెట్టాలో కరణ్ థాపర్ సూచిస్తే బాగుండేది.
ఆరోగ్యవ్యవస్థలో అత్యంత సున్నితమైన అనేక అంశాల మీద తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందుల నాణ్యత మీద, నిఘా, ధరల విషయంలో నిర్దాక్షిణ్యంగా తగ్గించడం చేస్తే గాని ఈ దేశంలో, ఈ దశాబ్దంలో ఎన్నో ట్రిలియన్ డాలర్లు దేశ ప్రజలకు అమెరికాలోవలె పొదుపు కావు కదా! దయగల ప్రభువులు ప్రజల ఎడల ప్రేమ ఉన్న సంఘాలను, నిపుణులను పిలిచే ‘అచ్చేదిన్’ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడాల్సిందే. అప్పటిదాక జరిగే దందాలో మందుల కంపెనీలు, పాలకులు, దళారులు, క్లినికల్ ట్రయల్ ల్యాబ్‌లు, డాక్టర్లు, హాస్పిటల్స్, మందుల షాపులు అనివార్యంగా భాగస్వాములే.
డా. చెరుకు సుధాకర్
వ్యాసకర్త రాజకీయ కార్యకర్త, వైద్యులు
మొబైల్: 98484 72329
Comments
Please login to add a commentAdd a comment