ఎయిమ్స్‌లో ఉచితంగా మందులు
Published Mon, Jan 6 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రి ఔట్‌పేషెంట్లకు ఉచితంగా జనరిక్ మందులు అందజేసేందుకు త్వరలో ప్రత్యేకంగా ఫార్మసీని ప్రారంభించ నున్నారు. ‘ఇది ఈ నెల ఒకటిన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్థలసేకరణ కోసం సమయం పట్టడం వల్ల ఆలస్యం జరుగుతోంది. ఔట్‌పేషెంట్లకు ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తాం’ అని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెంట్ డీకే శర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ ఈ ఫార్మసీని నిర్వహిస్తుందన్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాటికి బదులు జనరిక్ మందులు మాత్రమే రాయాల్సిందిగా ఎయిమ్స్ తన డాక్టర్లను ఆదేశించనుంది. అంతేగాక మందుల నాణ్యతను పరీక్షించడానికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమిస్తారు. అన్ని విభాగాల అధిపతులతో గత ఏడాది చర్చలు జరిపిన అనంతరం ఉచిత మందుల జాబితాను తయారు చేశామని శర్మ తెలిపారు. ఉచిత మందుల ఫార్మసీ ప్రతిపాదన ఐదేళ్ల క్రితమే వచ్చినా రెండేళ్ల క్రితమే దీనికి ఆమోదం లభించింది.
Advertisement