సేవే పరమావధి కావాలి | The low-cost generic drugs, branded drugs to treat diseases | Sakshi
Sakshi News home page

సేవే పరమావధి కావాలి

Published Sun, Aug 11 2013 3:12 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

The low-cost generic drugs, branded drugs to treat diseases

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తక్కువ ధరకు వచ్చే జనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులకు ఏమాత్రం తీసిపోని విధంగా రోగాలు నయం అవుతాయని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించి జనరిక్ మందులు కొనుగోలు చేసే విధంగా డాక్టర్లు ప్రోత్సహించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కోరారు. సామాన్యులకు వైద్యసేవలు అందించడమే పరమావధిగా భావించాలని, సామాన్యుడికి సహాయపడాలనే బాధ్యతను వైద్యులు విస్మరించకూడదని హితబోధచేశారు.
 
 ధనంతో ఆరోగ్యంరాదని, ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకున్నప్పుడే కుటుంబాలు బాగుపడతాయని ఆయన గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన ‘41వ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా’ సదస్సుకు శనివారం గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిషియన్లు రోగులతో చికాకుపడకుండా ఓపికతో మాట్లాడితే రోగాన్ని సులభంగా గుర్తించవచ్చన్నారు.
 
 నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడ కూడదని వైద్యులకు సూచించారు. వైద్యుడు దేవునితో సమానమని ప్రజలు భావిస్తారని అందుకే వైద్యో నారాయణ హరీ అన్నారని గుర్తుచేశారు. క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులాంటి వ్యాధుల చికిత్స ఎంతో ఖరీదుతో కూడుకున్నదని, వీటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమేనన్నారు. అందుకు వైద్యులు, వైద్యవిద్యార్థులు, ఆరోగ్యంపై కృషిచేసే స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. వైద్యపట్టా హోదాకు గుర్తింపు కాదని, పేదలసేవే పరమావధిగా వైద్యులు భావించాలన్నారు.
 
 మాతాశిశు మరణాలు తగ్గించాలి: కలెక్టర్
 కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. జిల్లా లో మాతాశిశు మరణాలు, టీబీ వంటి జబ్బుల శాతం ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. వాటిని నివారించేందుకు ఇలాంటి వైద్యసదస్సులు దో హదపడాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చిన గవర్నర్ నేరుగా రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంకు వెళ్లారు. అక్కడికి వచ్చిన బాలానగర్ కెజీబీవీకి చెందిన విద్యార్థినులు సోను, సరళతో మాట్లాడారు. ముఖ్యం గా విద్యపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వైద్య సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను గవర్నర్ విడుదల చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ ఎ.మృగనాథన్, ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఐవీ రావు, ఏపీ కాన్ సెక్రటరీ డాక్టర్ వైఎస్‌ఎన్. రాజు, ఎలక్టెడ్ చైర్మన్ డాక్టర్ ఎస్‌వీ రమణ మూర్తి, వైద్యసదస్సు నిర్వహణ చైర్మన్ డాక్టర్ కేజే రెడ్డి, రామచంద్రారెడ్డి, డాక్టర్ రాంరెడ్డి, జిల్లా ఎస్పీ డి.నాగేంద్ర కుమార్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ పి.రాజారాం, డీఆర్వో రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement