సాక్షి, కర్నూలు: రోగమొచ్చిందంటే వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే. బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నా యి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మూడు మెడికల్ షాపులు ఉన్నాయి. 2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి చెలామణి అవుతున్నాయి.
చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు
వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాస్తున్నారు.
బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ వైద్యులు సైతం జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు ఆ పనిచేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎలాంటి మార్పూ ఉండదు
బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్‌ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికం. ఉదాహరణకు డోలో 650 అనేది బ్రాండెడ్ మందు. కేవలం పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు. వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి. కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి.
ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది
జనరిక్ మందులు నాణ్యతలో బ్రాండెడ్ మందులతో ఏ మాత్రం తీసిపోవు. పైగా ఇవి బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది.
–ఎ.రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment