
ముంబై: ప్రైవేట్ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.
డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్‌బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్ ప్రైవేట్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.
పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్–డిసెంబర్‌లో లిస్టెడ్ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ వరుసగా 50 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment