ఏఐ రాకతో రూపు మారిన బిజినెస్ మెసేజింగ్
ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్‌ను ఆశ్రయిస్తున్న కంపెనీలు
ఆర్‌సీఎస్, జెనరేటివ్ ఏఐ, చాట్‌బోట్స్‌కు పెరుగుతున్న ఆదరణ
సాధారణ మెసేజ్‌లతో పోలిస్తే 90 శాతం చదువుతున్న బిజినెస్ మెసేజ్‌లు
దీంతో దేశంలో వేగంగా విస్తరిస్తున్న బిజినెస్ మెసేజింగ్ వ్యాపారం
ప్రస్తుతం బిజినెస్ మెసేజ్ వ్యాపార పరిమాణం రూ.8500 కోట్లు
ఇది 2030 నాటికి రూ. 26 వేల కోట్లు దాటుతుందని అంచనా
వాట్సాప్ ఆర్సీఎస్ 50% మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటుందని అంచనా
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్‌లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్‌పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్‌లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్‌లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్‌ను ఎంచుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్‌బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్‌లు, ఇతర మెసేజ్‌లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్‌లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి.
రూ.26 వేల కోట్ల మార్కెట్
దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్‌లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment