ముకేశ్ అంబానీ గారాల తనయ 'ఇషా అంబానీ' రిలయన్స్ గ్రూపుకు చెందిన వివిధ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే.. ఇతర సంస్థలను కూడా పర్యవేక్షిస్తోంది. ఈ కథనంలో ఇషా సారథ్యంలో ముందుకు సాగుతున్న సంస్థల గురించి తెలుసుకుందాం.
తీరా బ్యూటీ (Tira Beauty)
ఇషా అంబానీ సారథ్యంలోని ప్రముఖ వెంచర్‌లలో తీరా బ్యూటీ ఒకటి. ఇది ఏప్రిల్ 2023లో ప్రారంభమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా వెర్సేస్, మోస్చినో, డోల్స్ & గబ్బానా వంటి లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని కస్టమర్‌లకు అందించడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం.
హామ్‌లేస్ (Hamleys)
రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో సుమారు రూ. 620 కోట్లతో టాయ్ రిటైలర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. ఇది కూడా ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉంది. హామ్‌లేస్ అనేది ప్రపంచ మార్కెట్లోని పురాతనమైన, అతిపెద్ద బొమ్మల రిటైలర్‌లలో ఒకటి. ఇషా అంబానీ ఈ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.
అజియో (Ajio)
ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉన్న మరో సంస్థ అజియో. లాక్మే ఫ్యాషన్ వీక్ ఎస్ఎస్16 సందర్భంగా ప్రారంభమైన అజియో.. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అధిక లాభాలను గడిస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.
కవర్ స్టోరీ (Cover Story)
ఇషా దర్శకత్వంలో మరో కీలకమైన బ్రాండ్ 'కవర్ స్టోరీ'. ఇది భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ కాస్మొటిక్స్ అందించే మొట్టమొదటి ఫ్యాషన్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఇతర దేశాల సౌందర్య ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారభించారు.
ఫ్రెష్‌పిక్ (Freshpik)
2021లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో.. ఫ్రెష్‌పిక్ పేరుతో ఇషా అంబానీ ఫుడ్ రిటైల్ కంపెనీని ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కూడా ఇషా అంబానీ సారథ్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
నెట్‌మెడ్స్ (Netmeds)
ఇషా అంబానీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కస్టమర్ అవసరాలను తీర్చే లక్ష్యంతో.. చెన్నైలో ఈ-ఫార్మసీ నెట్‌మెడ్స్‌ను కూడా పర్యవేక్షిస్తుంది. 2020లో నెట్‌మెడ్స్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయడం ద్వారా ఔషధ రంగంలోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!
7-ఎలెవెన్ (7-Eleven)
రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 7-ఎలెవెన్‌ను భారతదేశానికి తీసుకురావడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వినియోగదారులకు ఐకానిక్ 24/7 కన్వీనియన్స్ స్టోర్ పరిచయం చేసి.. మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment