ప్రిస్క్రిప్షన్‌ ఇలా రాస్తే బెటర్‌.. లేదంటే ప్రమాదమే! | Dr Shanta Rao Comments On Generic Medicines | Sakshi
Sakshi News home page

ప్రిస్క్రిప్షన్‌ ఇలా రాస్తే బెటర్‌.. లేదంటే ప్రమాదమే!

Published Mon, Jun 21 2021 5:25 AM | Last Updated on Mon, Jun 21 2021 2:09 PM

Dr Shanta Rao Comments On Generic Medicines - Sakshi

సాక్షి, అమరావతి: ‘డాక్టరు దగ్గరకు రోగి అనారోగ్యంతో, ఆపద పరిస్థితుల్లో వస్తారు. అలాంటి రోగికి డాక్టరు ఇచ్చే మందులు ఎప్పుడూ భారం కాకూడదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో ఒక మందు రాసి దీర్ఘకాలిక నష్టాలు చేకూర్చకూడదు. దీనివల్ల పేషెంట్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది’ అంటున్నారు వైద్యవిద్యాశాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ జి.శాంతారావు. రోగులకు ప్రిస్క్రిప్షన్‌ సూచించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఒక్కసారి పరిశీలించి ‘రైట్‌ మెడిసిన్‌–రైట్‌ పేషెంట్స్‌’ అనే సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలు వివరించారు.   అవి ఆయన మాటల్లోనే.

కరోనా పరిస్థితుల్లో ఏదో ఒకటి రాయద్దు
చాలామంది రోగులు కరోనా పరిస్థితుల్లో ఫోన్‌లో మందులు అడుగుతున్నారు. దీనిపై డాక్టరు ఆలోచించి మందులు ఇవ్వాలి. రోగాన్ని, రోగిని అంచనా వేయకుండా ఇచ్చే మందులు చాలాసార్లు కాలేయం, మూత్రపిండాలు, గుండెకు నష్టం చేస్తున్నాయి. రోగాన్ని నయంచేసే ప్రతి మందు వల్ల ఎంతోకొంత నష్టమూ ఉంటుంది. ఆ నష్టాన్ని తక్కువగా ఉండేలా చూడాలి.

అర్థమయ్యేలా రాయండి
ఎవరికీ అర్థంకాని భాషలో చాలామంది ప్రిస్క్రిప్షన్‌ రాస్తున్నారు. దీనివల్ల మెడికల్‌షాపులో ఊహించి మందులిస్తారు. ఒకవేళ వేరే మందులిస్తే రోగి పరిస్థితి ఏమిటి? దీన్ని ఒక్కసారి ఆలోచించి స్పష్టంగా రాయాలి. క్యాపిటల్‌ లెటర్స్‌లో మందులు రాస్తే నామోషీ ఏమీ కాదు.

జనరిక్‌ మందులు రాస్తే మంచిది
బ్రాండెడ్‌కు, జనరిక్‌ మందులకు రేటులో చాలా తేడా ఉంటుంది. జనరిక్‌ మందులు రాస్తే పేషెంట్లకు ఆర్థికభారం తగ్గుతుంది. రోగిని దృష్టిలో ఉంచుకోవాలి గానీ ఇందులో ఇతరత్రా ఏమీ చూడకూడదు. ఇలా అలవాటు చేస్తూ వెళితే జనరిక్‌ మందుల మీద నమ్మకమూ పెరుగుతుంది.

మందుల్లో లోపాలు చెప్పడం ప్రజారోగ్యానికి ముఖ్యం
మందులు వాడుతున్నారంటేనే ప్రమాదం వచ్చిందని లెక్క. ఆ మందులు మరో ప్రమాదానికి దారితీయకూడదు. అవనసర డోసులు రాయడం, ఏదో ఒకటి మందు అనే పద్ధతిలో నిర్లక్ష్యంగా రాయడం వంటివి రోగి జీవితకాలం బాధపడే వరకు తెస్తాయి. ఒక చిన్న నిర్లక్ష్యానికి రోగి అంతగా బాధపడకూడదు. కరోనా మందులతో పాటు పెయిన్‌కిల్లర్స్, యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్‌ వంటివి ఇచ్చేముందు ఒక్కసారి వాటిని మోతాదుకు మించి ఇస్తే జరిగే పరిణామాలను వివరిస్తే మంచిది.

చిట్టీలో ఫోన్‌ నంబరు ఇవ్వాలి
మనం ఇచ్చే మందులు ఒక్కోసారి వికటించవచ్చు. అలాంటప్పుడు మందులిచ్చింది ఒకరు, వైద్యం చేసేదొకరు వంటి పరిస్థితి రాకూడదు. అందుకే చిట్టీలో ఫోన్‌ నంబరు ఇస్తే...రోగి అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ చేస్తారు. దానికి విధిగా స్పందించాలి. ఆ రోగియొక్క వైద్యం నీకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వే దాన్ని పరిష్కరించేలా ఉండాలి.

వైద్యపరంగా లోపాలను తగ్గించాలి
జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం వైద్యపరంగా జరిగే లోపాలను అరికట్టాలని పేర్కొంది. మంచి డాక్టరు అంటే మంచి ప్రిస్క్రిప్షన్‌ రాయడమేనని చెప్పింది. ప్రిస్క్రిప్షన్‌లో పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా అన్నీ ఇవ్వాలని సూచించింది. మందు స్వభావం, పనిచేసే తీరు, ఎంతకాలం తీసుకోవాలి, పేషెంటు వయసు, బరువు వంటివన్నీ ప్రిస్క్రిప్షన్‌లో ఉండాలని చెప్పింది. వీటిని డాక్టర్లు పాటించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement