జెనరిక్‌ ఔషధాలంటే నాసిరకం కాదు! | Sakshi Guest Column On Generic medicines | Sakshi
Sakshi News home page

జెనరిక్‌ ఔషధాలంటే నాసిరకం కాదు!

Published Wed, Sep 27 2023 12:48 AM | Last Updated on Wed, Sep 27 2023 12:48 AM

Sakshi Guest Column On Generic medicines

వైద్యులు తప్పనిసరిగా జెనరిక్‌ ఔషధాలనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసి, వైద్యుల ఆందోళన అనంతరం ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్‌ ఔషధాలు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు.

అధిక ధర ఉన్నప్పటికీ ‘బ్రాండెడ్‌’ మందులను తీసుకోవడానికే మొగ్గుచూపు తున్నారు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నాసిరకం మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) ఉత్పత్తవుతాయి. అందువల్ల, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి.

ప్రపంచ ఫార్మసీగా భారత్‌ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో జెనరిక్‌ మందులు భారత్‌ నుండి ఎగుమతి అవుతాయి. 21వ శతాబ్ది ప్రారంభం వరకు, మన దేశంలోని పేటెంట్‌ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది. ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు, పేటెంట్‌ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించింది.

‘రివర్స్‌ ఇంజనీరింగ్‌’ విధానం వల్ల వివిధ తయారీ ప్రక్రియలు అభివృద్ధి చెందగలవు. భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని పరిగణిస్తున్నారు. ప్రత్యేకంగా, హెచ్‌ఐవి/ ఎయిడ్స్, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్‌ లు వంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి జెనరిక్‌ ఔషధాలకు సంబంధించి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నాము. ‘బ్రాండెడ్‌’ ఔషధాల లాగే జెన రిక్‌ మందులు కూడా అదేవిధమైన క్రియాశీల పదార్థం కలిగినవి కాబట్టి, ఒకేరకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి.

జెనరిక్‌ ఔషధాల ధర తక్కువగా ఉండటమే వాటిని సమర్థించ డానికి ప్రధాన కారణం. ఎందుకంటే అవి పదేపదే జంతు, క్లినికల్‌ అధ్యయనాలకు గురికావాల్సిన అవసరం లేదు. ధర సమస్య దృష్ట్యా, అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ముఖ్యమైనవి. అలాగే ఇవి ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయి. ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైన రాజీ ఉండకూడదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్‌ మందులు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు సహేతుకంగానే జెనరిక్‌ ఔషధాలను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్‌ మందులను తీసుకోవడానికే వీరు తరచుగా మొగ్గు చూపు తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ ఔషధి ఔట్‌లెట్లలో పేలవమైన అమ్మకాలే దీనికి నిదర్శనం.

వైద్యులు తప్పనిసరిగా జెనరిక్‌ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న జెనరిక్‌ ఔషధాల నాణ్యతకు సంబంధించిన తీవ్రమైన సమస్యను ఇది తెరపైకి తెచ్చింది. ఆ ప్రకటనపై వైద్యులు సముచితమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

దీంతో జెనరిక్‌ ఔషధాలను వైద్యులు తప్పని సరిగా రాయడానికి సంబంధించిన తన నిర్ణయాన్ని ఎన్‌ ఎంసి ప్రస్తు తానికి నిలిపివేయడం సరైన చర్య. ఏదేమైనప్పటికీ, జెనరిక్‌ ఔషధాల ప్రాధాన్యతపై దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి, ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జెనరిక్‌ ఔషధాల వినియోగం చక్కటి మార్గం. ప్రభుత్వం కూడా నాణ్యమైన జెనరిక్‌లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాలి.

మన దేశంలో నకిలీ లేదా నాసిరకం ఔషధాలు ఉండటం, ప్రధా నంగా పేలవమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ ఫలితమే. అలాంటి కొన్ని మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైన తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి.

గత సంవత్సరం, ఒక కంపెనీ తయారు చేసిన ప్రొపోఫోల్‌ ఇంజెక్షన్‌ను ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రతికూల ఫలితాలు, ఆఖరికి మరణం సంభవించడం కూడా చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌ దృష్టికి వచ్చింది. భారతదేశం నుండి ఎగుమతైన దగ్గు సిరప్‌ వాడకం వల్ల గాంబి యాలో నమోదైన మరణాలు, ఫార్మా హబ్‌గా మన దేశానికి ఉన్నపేరు ప్రతిష్ఠను దెబ్బతీశాయి.

నాసిరకం మందులు వాడిన తర్వాత ఉండే ప్రమాదాల్లో తగిన రీతిలో లేని ప్రతిస్పందన, ఆ ఔషధానికి నిరోధకత అభివృద్ధి కావడం వంటివి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలు. సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు, కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదాచేసుకునే ప్రయత్నంలో, అంత ర్జాతీయంగా ఆమోదించిన ఉత్తమ పద్ధతులను అనుసరించకుండా విస్మరిస్తున్నాయి.

వీటి ఉత్పత్తుల విషయంలో కంపెనీలు చాలా తరచుగా రాజీపడి పోతు న్నాయి. నిర్లక్ష్యం, కల్తీ ఉండటం వంటి నిజాయితీ లేని పద్ధతులను కూడా గమనించవచ్చు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నకిలీ మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) సంభవిస్తాయి. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది.

బ్రాండెడ్‌ ఔషధాల లాగే ప్రభావవంతమైనవనీ, సురక్షితమైన వనీ, వాటికి ప్రత్యామ్నాయం కాగలవనీ తగిన ధ్రువీకరణ జరిగిన తర్వాత మాత్రమే యూరోపియన్‌ దేశాలు, అమెరికా జెనరిక్‌ ఔషధా లను ఉపయోగించడానికి ఆమోదిస్తాయనేది అందరికీ తెలిసిందే. జెనరిక్‌ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైన సమీక్షా ప్రక్రియ అమలులో ఉంటుంది.

ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ), ఉత్తమ ఉత్పాదక పద్ధతులకు అను గుణంగా ఉండేలా తయారీ ప్లాంట్‌లను కూడా తనిఖీ చేస్తుంది. ఇది జెనరిక్‌ ఔషధాలపై రోగి విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్‌ఎస్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం, జెనెరిక్‌ మందులు అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఒక దశాబ్దంలో (2009– 2019) దాదాపు 2.2 ట్రిలియన్‌  డాలర్లను ఆదా చేశాయి. జెనరిక్‌ ఔషధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సొమ్మే చెబుతోంది.

అందువల్ల, మనం పాఠాలు నేర్చుకుని, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. కచ్చిత మైన నాణ్యతా నియంత్రణ చర్యలు అమలులో లేకుంటే, అసమర్థ మైన మందులు, తీవ్రమైన దుష్ప్రభావాల రూపంలో జంట ప్రమా దాలు అలాగే ఉంటాయి. మన ప్రస్తుత విధాన మార్గదర్శకాలను పునఃపరి శీలించి, అమలు ప్రక్రియను బలోపేతం చేయడం తక్షణ అవసరం.

పూర్తి శిక్షణ పొందిన నిపుణులు నిర్వహించే పరీక్షా సౌకర్యాల రూపంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతమున్న చట్టబద్ధమైన, ఇతర రక్షణలకు చెందిన కచ్చి తమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది. చట్టపరమైన నియంత్రణ విధానాలు కంపెనీలు స్వీయనియంత్రణను ప్రోత్సహించే విధంగా నిర్మాణాత్మకంగా ఉండాలి.

అయితే వికృతమైన కేసులను సాహసంతో ఎదుర్కో వటానికి సంకల్పం ఉండాలి. భారతదేశంలో ఔషధాల నాణ్యతను నియంత్రించడానికి బాధ్యత వహించే ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ (సీడీఎస్‌సీవో)ను తప్పనిసరిగా బలోపేతం చేయాలి.

మన ఔషధ అప్రమత్తత, నిఘా వ్యవస్థ జాగరూకత కార్యక్రమా లను కూడా శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్‌ అనంతరం మన ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి ఇవి మార్గాలు. ఔషధ హెచ్చరికల తర్వాత, వాటిని వెనక్కి తీసుకునే ఏ తదుపరి చర్య నైనా తప్పనిసరిగా పబ్లిక్‌ డొమైన్‌ లో వీలైనంత త్వరగా ఉంచాలి.

నాణ్యమైన జెనరిక్‌ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక బ్రాండెడ్‌ మందులను మార్కెట్‌ చేయవద్దని ప్రభుత్వం ఔషధ కంపెనీలను  ఆదేశించాలి. ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు తమ మార్కె టింగ్‌ బడ్జెట్‌లను తగ్గించి, పరిశోధన, అభివృద్ధితో పాటు నాణ్యతా నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి.

నాణ్యమైన జెనరిక్‌ ఔషధాలను నిర్ధారించే సవాలును సీడీఎస్‌సీఓ తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత, జాతీయ వైద్య కమిషన్‌ ఆదేశాన్ని స్వాగతించవచ్చు.

డాక్టర్‌ కె.కె. తల్వార్‌ 
వ్యాసకర్త పీజీఐఎంఈఆర్‌ మాజీ డైరెక్టర్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement