![Sakshi Editorial On Generic medicines](/styles/webp/s3/article_images/2023/08/18/med1.jpg.webp?itok=xWH7aEti)
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది.
అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది.
ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి.
స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే.
బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు.
డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ.
నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట.
గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి.
ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది.
ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్.
వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్‌ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి.
షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే!
Comments
Please login to add a commentAdd a comment