విదేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఏర్పాట్లు
నగరంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న కాన్సెప్ట్
కార్పొరేట్ కల్చర్‌పై యాజమాన్యాల సందిగ్ధం
సిబ్బందికి, వైద్యులకు ఉపయుక్తమంటున్న నిపుణులు
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు..
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.
ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు..
నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు.
ఒత్తిడిని జయించేందుకు..
ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం
వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.
సిబ్బందికి ఉపయుక్తం..
ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.
లాభనష్టాల బేరీజు లేకుండా..
ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్‌లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్‌లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు.
– డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment