సాక్షి, అమరావతి: ‘ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్‌గా ఉందని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్ కిరణ్ గోపాల్ వాస్క అన్నారు. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఏపీ ఈ ఘనత సాధించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. దేశ ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమం తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఏపీని సంప్రదించాలని చెబుతున్నాం
ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో భాగంగా ఇప్పటివరకూ ఏపీలో సుమారు 3.50 కోట్ల మందికి హెల్త్ ఐడీలు సృష్టించారు. అదే విధంగా ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిని ఏబీడీఎంలో రిజిస్ట్రర్ చేయడంలో, హెల్త్ ఐడీలకు ప్రజల ఆరోగ్య రికార్డులను అనుసంధానించడం ఇలా అన్ని అంశాల్లో ఏపీ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ క్రమంలో డిజిటలైజేషన్‌లో వెనుకబడిన రాష్ట్రాలకు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఏపీ వైద్యశాఖను సంప్రదించి వారు అవలంబిస్తున్న విధానాలను మిగిలిన రాష్ట్రాల్లో పాటించాలని తెలియజేస్తున్నాం.
రికార్డులను అనుసంధానించడం కీలకం
ప్రతి ఒక్కరికీ హెల్త్ ఐడీలు సృష్టించడం ముఖ్యమే. అయితే, సృష్టించిన హెల్త్ ఐడీలకు ఆయా ప్రజల ఆరోగ్య రికార్డులను అనుసంధానించడం కూడా అంతే కీలకం. లేదంటే ఏబీడీఎం కార్యక్రమం లక్ష్యం నెరవేరదు. ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ప్రతిఒక్కరి ఆరోగ్య చరిత్ర ఒక్క క్లిక్‌తో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా పొందవచ్చు.
25,37,01,350 మందికి ఇప్పటివరకూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ (ఆభా) చేయగా, 2,30,36,463 మంది అకౌంట్స్‌కు మాత్రమే రికార్డులు లింక్ చేశారు. మరోవైపు.. ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు కూడా ఏబీడీఎంలో రిజిస్ట్రర్ కావడాన్ని తప్పనిసరిచేసే ఆలోచన ఉంది. తమ వద్ద చికిత్స పొందే రోగులు, వారికి చేసిన చికిత్స వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు భావించడం సరికాదు.
యూపీఐ తరహాలో యూహెచ్‌ఐ
ఇక చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో వైద్య, ఆరోగ్య సేవల కోసం యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ (యూహెచ్‌ఐ) విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులు, వారి ఆరోగ్య వివరాలు, పొందిన చికిత్స, వైద్య పరీక్షలు, వైద్యుడు సూచించిన మందులు.. ఇలా ప్రతీది యూహెచ్‌ఐలో నమోదవుతుంటాయి. అదే విధంగా ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను వైద్యసేవలకు వన్‌స్టాప్ సొల్యూషన్‌గా తీర్చిదిద్దుతున్నాం.
కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించిన ఈ యాప్‌లో మరిన్ని మార్పులు చేశాం. త్వరలో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ యాప్‌తో పాటు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఓఆర్‌ఎస్) పోర్టల్ కూడా యూహెచ్‌ఐ పరిధిలోకి రాబోతోంది. ఓఆర్‌ఎస్ అనేది ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్ సిస్టమ్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులను అనుసంధానించే వేదిక. ఆధార్‌కు లింక్ అయిన రోగి మొబైల్ నంబర్ ద్వారా వివిధ ఆసుపత్రుల్లో అపాయింట్‌మెంట్‌ను సులభతరంగా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment