చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్‌ మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ | Sakshi
Sakshi News home page

చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్‌ మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌

Published Wed, Apr 10 2024 5:02 AM

ICMR study that some doctors are prescribing drugs in Unwantedly - Sakshi

కొందరు డాక్టర్లు ఎడాపెడా మందులు రాస్తున్నారన్న ఐసీఎంఆర్‌ స్టడీ

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు మొదలు ఎయిమ్స్‌ వరకు ఇదే తీరు 

కాంబినేషన్‌లో రెండు మూడురకాల మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్‌ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ అనుబంధ జర్నల్‌ ఐజేఎంఆర్‌లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 

పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. 
వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్‌ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది.

జనరల్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్‌ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు.  

జలుబుకు ఇన్ని మందులా..! 
సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్‌+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్‌ట్రోమితార్పాన్,రాబిప్రజోల్‌+డోమ్‌పెరిడోన్‌ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్‌+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్‌+డోమ్‌పెరిడోన్‌ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి.  

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్‌ కోవిడ్‌కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్‌ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు.  

నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? 
నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్‌ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్‌+డోంపెరిడోన్‌ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్‌ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. 

రియాక్షన్లు..దుష్ప్రభావాలు 
కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్‌ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్‌ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్‌ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్‌ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్‌లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి.  

డోసులు ఎక్కువ తక్కువ! 
నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్‌లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్‌ మందులు, హార్మోన్‌ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్‌ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు.  

డాక్టర్లకు అవగాహన కల్పించాలి 
ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్‌ తీసుకువచ్చిన స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త   

Advertisement

తప్పక చదవండి

Advertisement