విజయవాడ నక్కల రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుడివాడకు చెందిన ఓ రోగి స్వల్ప పక్షవాతంతో చేరారు. మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. ఆయనకు రూ.2.85 లక్షలు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి గొల్లుమనడం పేషెంట్ వంతయ్యింది. ఇందులో ఇంజెక్షన్ల ఖరీదే రూ.1.30 లక్షలు. వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రి కొన్నది రూ.65 వేలకు మాత్రమే.
వైద్య శాఖలో పెద్ద హోదాలో రిటైర్ అయిన ఓ డాక్టర్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఇటీవలే ఓ 70 ఏళ్ల మహిళ కోవిడ్ బారినపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. వారం రోజులు చికిత్స చేసి రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో చూసినా నిత్యం ఇదే తంతు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరిట రోగులు, వారి కుటుంబీకుల నడ్డి విరుస్తున్నాయి. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి.
చిన్న జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి.
జనరిక్ మందులు రాసేందుకు ససేమిరా
బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్‌లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్‌పీని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్‌పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు.
క్యాన్సర్ మందుల్లోనూ అంతే
రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు.
చట్టం చేయడం వల్లే నియంత్రణ సాధ్యం
మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్‌ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్‌లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం.
– డాక్టర్ బి.సాంబశివారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్
నిర్వహణ కష్టమవుతుంది
ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకు అమ్మితే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుంది. వందల మంది సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉంటాయి. 100 పడకల ఆస్పత్రిని నిర్వహించాలంటే ఇప్పుడు చాలా వ్యయమవుతోంది. ఇక జనరిక్ రాయాలంటే కొద్దిగా క్వాలిటీని చూసుకోవాలి కదా. ఎంఆర్‌పీ కంటే తగ్గించడం కష్టం.
– డాక్టర్ మురళి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, విశాఖ
Comments
Please login to add a commentAdd a comment