ఎన్టీఆర్ వైద్యసేవకు బకాయి సుస్తీ
పేద రోగులు వైద్యసేవల కోసం మునుపటిలా కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టెక్కేందుకు సంశరుుస్తున్నారు. ఆరోగ్యశ్రీ (ప్రస్తుత పేరు ఎన్టీఆర్ వైద్యసేవ) కార్డు వెంటబెట్టుకుని వెళ్లడానికి వెనుకాడుతున్నారు. తమను చేర్చుకుని వెంటనే సేవలందిస్తారా లేదా అనే సందేహం వీరిని వెంటాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. చేర్చుకుని సేవలందిస్తే సర్కారు నిధులు విడుదల చేస్తుందా లేదా అనే మీమాంస కార్పొరేట్ ఆస్పత్రులను వెంటాడుతోంది.
ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రోగులను చేర్చుకోవడం పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదని భోగట్టా. అంతేకాదు తమ బకాయిల కోసం ఉద్యమించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు సిద్ధపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం దూరమయ్యేలా ఉంది.
* ఎన్టీఆర్ వైద్యసేవకు నిధులు విడుదల చేయని సర్కారు
* కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు
* వైద్యసేవలు నిలిపివేయాలనే యోచనలో ఆస్పత్రి యాజమాన్యాలు
శ్రీకాకుళం సిటీ : ఎన్టీఆర్ వైద్యసేవలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. రిమ్స్‌తో పాటు పాలకొండ, టెక్కలి, పాతపట్నం, సీహెచ్‌సీల్లో ఈ పథకం కింద వైద్య సేవలందుతున్నాయి. వీటితో పాటు ఎంపిక చేసిన కార్పొరేట్ ఆస్పత్రులు బగ్గు సరోజనీదేవి, కిమ్స్ సాయిశేషాద్రి, సిందూర, జీఎంఆర్, జెమ్స్‌లలో కూడా వైద్య సేవలు అందుతున్నాయి. 2007లో అప్పటి ముఖమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు కార్పొరేట్ స్ధాయి వైద్యం అందించాలన్నదే ముఖ్య ఉద్ధేశంగా ఆయన ఈ పథకాన్ని తీర్చిదిద్దారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చింది. ఎన్‌టీఆర్ వైద్యసేవగా తెర పైకి తీసుకువచ్చింది. పేదప్రజలకు అందిస్తున్న వైద్యానికి రకరకాలు మెలికలు పెట్టి కుదించేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలుచేస్తున్నా ప్రభుత్వం సరిగ్గా నిధులు చెల్లించడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రపదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(ఆషా) ఆందోళన కూడా చేపట్టాల్సి వచ్చింది.
కొన్ని నెలలుగా ప్రభుత్వానికి, ఆషాకు మద్య పలుపర్యాయాలు చర్యలు జరిగినా ఫలితం అంతంతమాత్రమే. ఈనెల 11వ తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం తన హామీని అమలు చేయకపోవడంతో ఆషా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవలను బంద్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఇదే జరిగితే పేద రోగులకు ఇక్కట్లు తప్పవు.
శ్రీకాకుళం పట్టణంలో డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో నిర్వహించిన 407 (ఈఎన్‌టీ, జనరల్‌సర్జన్,గైనిక్, యూరాలజీ తదితర విబాగాలకు) శస్త్ర చికిత్సలకు మూడునెలలుగా రూ. 60 లక్షలకు పైగా బకాయిలు రాలేదని తెలిసింది. ఇది ఒక ఆస్పత్రి బకాయి మాత్రమే. మరో నాలుగు ఆస్పత్రులకు రూ. కోట్లల్లోనే బకాయిలన్నట్లు తెలియవచ్చింది.
ఈ బకాయిల పరిస్థితి రోగులను ప్రభావితం చేస్తోంది. ఈ పథకం కింద సేవలదించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. రోగులను చేర్చుకుంటే మరింత బకారుులు పేరుకుపోవడం తప్ప ఫలితం లేదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సలు సకాలంలో జరగడంలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యసేవలు బంద్ చేపట్టనున్న సమచారం అధికారికంగా తమకు చేరలేదని ఎన్టీఆర్ వైద్యసేవల జిల్లా కో-ఆర్డినేటర్ రాజేష్ పేర్కొనడం విశేషం.