Corporate hospitals
-
Nikhila Vengala: బ్యూటీ కాంటెస్ట్‌లో ‘నువ్వు ఫిట్ కావు’ అన్నారు..
‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్‌కు మెంటార్‌గా ఉన్నాను. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఫైనల్స్‌కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్‌లో నేనొక మెంబర్‌గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్‌లో ఉండి ఆ ఫౌండేషన్‌కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది. ► కష్టమైనా .. సులువే.. ఎమ్‌ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్‌పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి, క్యాన్సర్ హాస్పిటల్‌కి మెడికల్ రైటర్‌గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్‌తో ఇలాంటి కాంటెస్ట్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. ► టైమ్ ప్రకారం ప్లానింగ్.. నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్‌ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్‌కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్‌కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్‌కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్‌ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్‌ని, డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను. ► నువ్వు ఫిట్ కావు అన్నారు... బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్‌కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్‌కి తీసుకువచ్చింది. ► యాసిడ్ దాడి బాధితులకు.. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను. ► అవగాహన కలిగిస్తూ... చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్‌కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్‌లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ. – నిర్మలారెడ్డి -
ఆరోగ్యశ్రీలో కేన్సర్‌కు వైద్య సేవలందించాలి: హరీష్ రావు ఆదేశం
సాక్షి, శేరిలింగంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేన్సర్‌కు వైద్య సేవలు అందించాలని, వాటి బిల్లులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన ఎథోస్ రేడియోథెరపీ సిస్టమ్‌ను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...ఎథోస్ రేడియోథెరపీతో ఈ ప్రాంత ప్రజలకు అధునాత టెక్నాలజీతో కూడా వైద్య సేవలు అందడం సంతోషం అన్నారు. కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ విభాగంలో 300 బెడ్స్ అదనంగా జతచేశామని వివరించారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో సామాజికసేవలో భాగంగా పేదలకు కేన్సర్‌కు వైద్యసేవలు అందించి ఆదుకోవాలని సీఓఓ డాక్టర్ ప్రభాకర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, అల్ల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.. -
AP: ‘కార్పొరేట్’కు కన్నుకుట్టేలా..
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2017 నుంచి ఉన్నట్లుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీవ్యవస్థలో సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయంకాలేదు. చివరి ప్రయత్నంగా 2021లో బాధితుడిని కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అతడు ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి నిర్ధారించారు. మూడ్రోజుల చికిత్స తరువాత ఆ వ్యక్తి అందరిలాగే లేచి నడవడం ప్రారంభించాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగి. గత నెల 20వ తేదీ ఉదయం విధినిర్వహణలో ఉండగా ఇతనికి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్‌స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. గంటన్నరలోనే వైద్యులు థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇచ్చారు. ఐదున్నర గంటల్లో బసవయ్య లేచి ఎవరి సాయంలేకుండా నడవగలిగాడు. సాక్షి, అమరావతి: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులకు అంతుపట్టని అరుదైన వ్యాధులకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. దీంతో పెద్దాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. పెద్దాస్పత్రుల్లో సేవలు పొందుతున్న వారిసంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగంపై సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయి. గణనీయంగా పెరిగిన సర్జరీలు టీడీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతిచెందడం, సెల్‌ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఆపరేషన్లు చేసిన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో గణనీయంగా సర్జరీల సంఖ్య పెరగడమే. 2018–19లో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు నిర్వహించారు. అప్పట్లో ఏడాది కాలంలో జరిగిన సర్జరీల కంటే ఎక్కువ సర్జరీలను ప్రస్తుతం 9 నెలల్లోనే చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని బోధనాస్పత్రుల్లో 2,42,980 మైనర్, 1,18,482 మేజర్ సర్జరీలను చేశారు. ఈ లెక్కన పరిశీలిస్తే టీడీపీ హయాంలో రోజుకు సగటున 870 సర్జరీలు నిర్వహిస్తే, ప్రస్తుతం రోజుకు సగటున 1,338 సర్జరీలు చేపడుతున్నారు. రోజుకు 22వేలకు పైగా ఓపీలు ఇక ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో రోజుకు 22 వేల మందికి పైగా అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందుతున్నారు. అదే విధంగా 2,400 మంది వరకూ ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలు అందుకుంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో 60.99 లక్షలకు పైగా ఓపీలు, 6.25 లక్షలకు పైగా ఐపీలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్ జీజీహెచ్‌లో 6.06 లక్షల మంది ఓపీ సేవలు పొందారు. ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌లో 5.34 లక్షలు, కాకినాడ జీజీహెచ్‌లలో 5.31 లక్షల ఓపీలు నమోదయ్యాయి. నాడు అవస్థలు.. నేడు అత్యున్నత ప్రమాణాలు టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పట్లో బోధనాస్పత్రుల్లో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర వసతుల కొరత తీవ్రంగా వేధించేది. కానీ, 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించారు. ఈ క్రమంలో మానవ వనరుల కొరతకు చెక్‌పెడుతూ వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీచేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఎసెన్షియల్ డ్రగ్స్‌కు కూడా కొరత ఉండేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మందుల కొరతకు తావులేకుండా, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులను 608 రకాల వరకూ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతోంది. ఇందులో 530కు పైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తోంది. మిగిలిన మందులను ఆస్పత్రుల్లో అవసరాలకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరోగ్యశ్రీలోనూ టీడీపీ హయాంలో కేవలం 1,059 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తే.. ఇప్పుడు ఏకంగా 3,255 రకాలకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాక.. నాడు–నేడు కింద రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రులు, కళాశాలలను బలోపేతం చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 207 పీజీ సీట్లు పెరిగాయి. ఇవేకాక.. గత ఏడాది మరో 630 పీజీ సీట్ల పెంపునకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
Andhra Pradesh: ఆరోగ్య ధీమా
పేద, మధ్యతరగతి వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆస్తులమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకునే వారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద మన వాళ్లకు ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. ఆ తర్వాతా ‘ఆరోగ్య ఆసరా పథకం’ ఆర్థికంగా భరోసా ఇస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. – సాక్షి అమరావతి గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన పి.సూరిబాబు దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు అనిల్ కుమార్ 2018లో ఇంటర్ పూర్తి చేశాడు. గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాడు. బీటెక్ పూర్తయితే కుమారుడు ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు భావించారు. 2018 చివరిలో అనిల్‌కు కాళ్లు తిమ్మిరిగా ఉండటం, స్పర్శ తెలియకపోవడం, నడవడానికి ఇబ్బంది పడటం సమస్యలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. క్రమంగా అనిల్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పలు చోట్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. అప్పులు చేసి మూడేళ్లలో రూ.20 లక్షలు ఖర్చు చేశారు. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. వైద్య పరీక్షలు చేసి అనిల్.. ‘స్పైనల్ ఎపిడ్యూరల్ లైపోమ్యాటోసిస్’ వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. దీంతో ప్రస్తుతం అనిల్ నడవగలుగుతున్నాడు. ‘వ్యాధితో మూడేళ్లు నరకం చూశాను. చదువు ఆగిపోయింది. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఏడ్వని రోజు లేదు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఉంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చు అయ్యేది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేసి నయం చేశారు’ అని అనిల్ చెప్పాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లె గ్రామానికి చెందిన వెంకట రామయ్యదీ నిరుపేద వ్యవసాయ కుటుంబం. రామయ్య దంపతుల కుమారుడు యోగేంద్రకు ఎనిమిదేళ్లు. యోగేంద్ర ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే లాభం లేదు.. గుంటూరుకు తీసుకువెళ్లమని చెప్పారు. హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం యోగేంద్ర బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు తేల్చారు. అరుదైన జబ్బుకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద వెంకటరామయ్య ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్ ఆస్పత్రిలో గత నెలలో శస్త్ర చికిత్స చేయించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రామయ్య తనకున్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయం, కూలికి వెళితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ‘ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుని ఉండకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది’ అని రామయ్య తెలిపారు. పేదల పాలిట వరమే.. అనిల్ కుమార్, యోగేంద్రలే కాకుండా పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతూ.. సొంతంగా డబ్బు ఖర్చు చేసే స్తోమత లేక, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకునే దీన స్థితిలో ఉన్న వారి పాలిట ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ పథకం వరంగా మారింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే, ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తోంది. కేవలం వైద్యం అందించి వదిలేయకుండా, చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి వారి జీవన భృతి కోసం ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్ జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది. విశాఖ మధురవాడకు చెందిన ఎస్.కొండమ్మకు 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో, 2021 జనవరిలో నాలుగుసార్లు ఉచితంగా కీమో థెరఫీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.80 లక్షలు ఖర్చు చేసింది. గత ఏడాది మార్చిలో రూ.11 లక్షల ఖర్చుతో బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. మొత్తంగా రూ.18.80 లక్షల విలువైన చికిత్సను కొండమ్మకు ఉచితంగా అందించింది. ఈ మేలు మరచిపోలేను నేను నిరుపేదను. నాకు గుండె వ్యాధి ఉందని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కడపలో డాక్టర్‌కు చూపిస్తే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.2 లక్షలు అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా సర్జరీ చేస్తారని ఆరోగ్య మిత్ర చెప్పారు. తెలిసిన వారి ద్వారా హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ వారు నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇందుకు మన ప్రభుత్వం కేర్ ఆసుపత్రికి రూ.1,18,881 చెల్లించింది. నేను కోలుకుంటున్న సమయంలో ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం నా బ్యాంక్ ఖాతాకు రూ.9,500 జమ చేసింది. ఈ మేలు నేను మరచిపోలేను. నాలాంటి పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా పునర్జన్మ లభిస్తోంది. – ఎస్.అజ్మతుల్లా, నకాష్ స్ట్రీట్, కడప, వైఎస్సార్ జిల్లా రూ.12 లక్షల ఆపరేషన్ ఉచితం మా పాపకు రెండున్నరేళ్లు. పుట్టుకతో వినికిడి లోపం ఉంది. విశాఖపట్నంలోని విమ్స్‌లో వైద్య పరీక్షలు చేసి, రెండు చెవులకు ఆపరేషన్ చేస్తే వినికిడి లోపం పోయి పాప మాట్లాడగలుగుతుందని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.12 లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ ప్రభుత్వం మేలును జన్మలో మరవలేము. – పార్వతి, మక్కువ, విజయనగరం జిల్లా ప్రాణం పోస్తున్న 108 జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాలవాడకు చెందిన జి.శంకర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగం నుంచి పేగులు బయటకు రావడంతో శంకర్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్ చేశారు. కొద్ది సేపటికి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అంబులెన్స్ టెక్నీషియన్.. గాయపడ్డ వ్యక్తి పేగులపై స్టెరైల్ డ్రెస్సింగ్ ప్యాడ్స్, వాటిపై నార్మల్ సెలైన్ వేసి పేగులకు సరైన తేమ శాతం ఉండేలా ప్రథమ చికిత్స చేశాడు. ఆ వెంటనే అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి బయలుదేరారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)లోని వైద్యుడిని సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు శంకర్‌రెడ్డికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. సరైన సమయంలో నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయడంతో శంకర్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. వైఎస్సార్ జిల్లా గునకనపల్లిలో ఇటీవల ఫక్కీరప్ప అనే వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతగా తట్టిలేపినా ఉలుకు.. పలుకు లేదు. శరీరం చల్లబడింది. ఇక ఫక్కీరప్ప లేవరని భావించారు. చుట్టుపక్కల వాళ్లు ఎవరో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. సిబ్బంది అతడ్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. చికిత్స అందిస్తూ సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఫక్కీరప్ప కోలుకున్నాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోయి ఉంటే తాము బతికుండే వాళ్లం కాదని శంకర్‌రెడ్డి, ఫక్కీరప్పలు కొనియాడుతున్నారు. 108 తమకు పునర్జన్మ ఇచ్చిందని చెబుతున్నారు. మండలానికి ఒకటి.. శంకర్ రెడ్డి, ఫక్కీరప్ప తరహాలో అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న లక్షల మందికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. గతంలో జనాభాకు అనుగుణంగా ఉండేవి కాదు. 2020 జూలై నుంచి మండలానికో 108 అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 14:48 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19:20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 22:21 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుంటున్నాయి. 2,54,111 మంది కరోనా బాధితులు 108లో ఉచితంగా రవాణా సేవలు పొందారు. గతంలో 1,19,595 మందికి ఒకటి చొప్పున 440 అంబులెన్స్‌లు ఉండేవి. వీటి స్థానంలో 532 బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్), 190 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్), 26 నవజాత శిశువుల అంబులెన్స్‌లు 19 కలిపి మొత్తంగా 748 అంబులెన్స్ సేవలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 2,753 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. 108కు కోటి దండాలు మాది గంట్యాడ మండలం పెదవేమలి. మా అల్లుడు శ్రీనివాస్‌కు గంట్యాడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అతని కాలు విరిగిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మాట్లాడలేని స్థితిలో ఉండగా 108 ద్వారా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. త్వరగా తీసుకొచ్చినందునే బతికించగలిగామని వైద్యులు చెప్పారు. 108 అంబులెన్స్‌కు కోటి దండాలు. – గేడు సన్యాసమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా పునర్జన్మనిచ్చారు గర్భిణినైన నాకు గత ఏడాది నవంబర్ 13న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. మా కుటుంబీకులు నన్ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపు తప్పటంతో అదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేసారు. అప్పుడు వాహనాలు అందుబాటులో లేవు. 108కు సమాచారం ఇవ్వగానే పది నిమిషాల్లో వచ్చింది. మార్గంమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. ఆముదాలవలస చేరే సరికి నేను స్పృహ కోల్పోయాను. అంబులెన్స్ సిబ్బందే సుఖ ప్రసవం చేయించారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. 11 గంటలకు మమ్మల్ని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి చేర్చారు. నా బిడ్డకు ఆయుష్షు పోసి, నాకు పునర్జన్మనిచ్చారు. – కండాపు హేమలత, సంకిలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా -
హెల్త్ హబ్స్ టెండర్ల నిబంధనల్లో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా అంతర్జాతీయస్థాయి వైద్య సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల కార్పొరేట్ ఆస్పత్రులను హెల్త్ హబ్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. తొలుత పిలిచిన బిడ్డింగ్‌లో కర్నూలు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన చోట్ల కూడా ప్రముఖ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధంగా టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేకుండా, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీనీ రెండేళ్లకే పరిమితం చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థలను తీసుకువచ్చే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. నిబంధనలు మారినందున బిడ్ల దాఖలు గడువును ఈనెల 18 వరకు పెంచుతూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. బిడ్లను పరిశీలించిన తర్వాత.. ఎంపికైన సంస్థ వివరాలను ఏప్రిల్ 15న వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ఆరోగ్య శ్రీకి కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. -
4 ఏళ్ల నరకయాతన.. 3 రోజుల్లో విముక్తి
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల నరకయాతనకు గుంటూరు జీజీహెచ్ వైద్యులు మూడు రోజుల్లో విముక్తి కల్పించారు. 10 లక్షల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ రుగ్మతకు చికిత్స చేయించుకున్న రైతు కోలుకుని హాయిగా నడవగలిగే స్థితికి వచ్చాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన రైతు ఆర్.రమణయ్య కు 2017 నుంచి ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్సరే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీ వ్యవస్థ సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి, ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయం కాలేదు. నాలుగేళ్లలో సుమారు రూ.10 లక్షలను ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు సెల్‌ఫోన్ రింగ్ వినిపించినా, చిన్న శబ్దమైనా అతడి కండరాలు అమాంతం బిగుసుకుపోయేవి. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 6న రమణయ్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి.. రమణయ్య ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిచారు. 3 రోజుల చికిత్స అందించిన అనంతరం రమణయ్య స్వతహాగా లేచి నడవడం ప్రారంభించాడు. -
Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట
ప్రభుత్వాస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అనుసరించాలి. ఆరోగ్యం బాగోలేకపోయిన వారంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► ఆస్పత్రుల నిర్వహణలో భాగంగా బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. ► కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్మాణాలు ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యం. ► రిసెప్షన్ సేవలు కూడా కీలకం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే.. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయి. ► జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను వినియోగించాలి. విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను ఖరారు చేయాలి. పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలి. ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో, జనవరి 26 నుంచి రాష్ట్రం అంతటా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ► మొత్తం యాక్టివ్ కేసులు : 14,652 ► పాజిటివిటీ రేటు శాతం : 2.23 ► రికవరీ రేటు శాతం : 98.60 ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 91.66 ► ప్రైవైట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 71.04 ► 104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ : 753 ► ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలు : 21 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు : 9 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలెండర్లు : 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ► అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,08,54,556 ► సింగిల్, డబుల్ డోసులు పూర్తయిన వారు : 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు : 3,50,39,318 -
Andhra Pradesh: పట్టణ ప్రజలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై జబ్బున పడ్డ సర్కారీ వైద్యానికి సీఎం వైఎస్ జగన్ చికిత్స చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత ప్రజలకు సర్కార్ వైద్యాన్ని చేరువ చేయడం కోసం ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి. పెరిగిన పట్టణ జనాభా, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’లుగా మార్చడంతో పాటు, కొత్తగా 301 క్లినిక్‌ల ఏర్పాటుకు గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు సొంత భవనాలు సమకూరుస్తూనే.. ఆగస్టు 15 నుంచి తాత్కాలిక భవనాల్లో వైద్య సేవలను ప్రారంభించింది. 30 వేల మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ లెక్కన గత టీడీపీ ప్రభుత్వం 50 వేల జనాభాకు ఒకటి చొప్పున పట్టణ ప్రాథమిక కేంద్రాలు కేవలం 73 మున్సిపాలిటీల్లో 259 మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి పట్టణాల్లో 30 వేల జనాభాకు ఒకటి చొప్పున వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గుంటూరు రెడ్డిపాలెంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ సొంత భవనాల నిర్మాణం వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న సొంత భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సొంత భవనాలు 205 ఉండగా, వీటిలో 150 భవనాలకు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి. 355 క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉండగా, 345 భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. వీటిలో 343 భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించి, శంకుస్థాపనలు చేశారు. ఈ భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఒక్కో భవనానికి రూ.80 లక్షలు ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.80 లక్షలు, సొంత భవనాల మరమ్మతులకు ఒక్కోదానికి రూ.10 లక్షలు వెచ్చిస్తోంది. కొత్తగా నిర్మించే భవనాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రోగులు వేచి ఉండే గది, అవుట్ పేషెంట్, ప్రసూతి, డ్రెస్సింగ్, లేబోరేటరి, ఫార్మసీ గదులు, ఆపరేషన్ థియేటర్, కౌన్సెలింగ్ హాల్, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ఉండేలా నిర్మిస్తున్నారు. సేవలు ఇలా.. ► ప్రతి వార్డుకు రెండు కిలోమీటర్ల దూరం లోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండే వారు. ► గతంలో 73 మున్సిపాలిటీల్లో మాత్రమే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులోకి వచ్చాయి. ► ఇప్పటికే ఉన్న 61 మంది డాక్టర్లకు అదనంగా ప్రభుత్వం 499 మందిని నియమించింది. ► గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ► వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ► ఇప్పటికే 206 రకాల మెడిసిన్స్‌ను ప్రభుత్వం క్లినిక్‌లలో అందుబాటులో ఉంచింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 32 రకాల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. నవంబర్‌కు పూర్తి నవంబర్ ఆఖరుకు వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళుతున్నాం. పనుల్లో నాణ్యత లోపించకుండా చూస్తున్నాం. – డాక్టర్ వి.చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్, మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చదవండి: హ్యాట్సాఫ్ టు సీయం జగన్ ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా -
''బలమెవ్వడు" మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా "బలమెవ్వడు". ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ నాయికగా నటిస్తోంది. సత్య రాచకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుంది. ఆదివారం (జూలై 11) మణిశర్మ బర్త్ డే సందర్భంగా "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే...పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం. కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్ లో స్పష్టంగా చూపించారు. సుహసినీ, నాజర్, పృథ్విరాజ్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సత్య రాచకొండ దర్శకుడు పేర్కొన్నారు. -
లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం! దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని.. దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!! ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా? ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!! అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ! కోవిడ్–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్‌పై, ఫంగస్‌లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్మింత్స్ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది... ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు! తెలిసినవి అతిస్వల్పం... మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్–19 కారక వైరస్ సంగతి చూద్దాం... కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్ ల్యాబ్‌లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్‌లలో. కోవిడ్–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్‌ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట! అన్నింటా ప్రమాదమే...? సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్లలోకి ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు.. దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్ టీకాను బయోసేఫ్టీ లెవెల్–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు. ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి. విస్మరిస్తే.. ఏమవుతుంది? వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్–కోవ్–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్–కోవ్–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్‌లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు. -
విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని గొలగాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో అక్రమాల బాగోతం బట్టబయలైంది. కరోనా రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హెల్త్‌సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ముగ్గురు సభ్యులతో కూడిన ‘డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లైయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు. జిమ్స్‌లో ‘కుమార్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరుగా పలువురు కోవిడ్ పేషెంట్ల కుటుంబసభ్యులను సంప్రదించి వివరాలు సేకరించింది. వారిలో ఓ రోగి నుంచి సుమారు రూ.7 లక్షలు వసూలు చేసి, రూ.1.20 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులు లేకపోవడంతో రూ.3 లక్షలకు షూరిటీగా చెక్కు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారని మరో కుటుంబం ఆధారాలతో సహా వివరించింది. ఆ ఆధారాలతో ఈ నెల 6, 7 తేదీలలో జిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు, బిల్లులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బాధితులు చెప్పినవన్నీ నిజమేనని తేలింది. అంతేకాకుండా రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలన్నింటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్‌రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్‌సిటీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే విధంగా దోపిడీ సాగుతోందని, వాటిపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
వైద్య సేవల రంగంలో గిరిజన యువత
సాక్షి, అమరావతి: గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ) ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. గిరిజన యువత కోసం ఏపీ ఎస్‌ఎస్‌ఐడీసీ వివిధ ఉపాధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో శిక్షణ ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒక శిక్షణా ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటివరకు 361 మంది గిరిజన యువత హాస్పిటల్ సర్వీసెస్ కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 244 మందికి ఇప్పటికే ఉపాధి లభించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ ఈడీ హనుమాన్ నాయక్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాథమికంగా రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు జీతం లభిస్తోందని తెలిపారు. విశాఖ, బేతంచర్లలో కూడా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి నర్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా గిరిజన యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా 2020లో 3,300 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
కార్పొరేట్ దోపిడీపై అధికారుల కొరడా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై అధికారులు స్పందించారు. మానవత్వాన్ని మరచి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. రెండు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ కోవిడ్ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోమవారం జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో సబ్–కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత సన్‌రైజ్ ఆస్పత్రికి వెళ్లగా, అప్పుడే అక్కడ మరణించిన కోవిడ్ రోగి బంధువులు నిరసన తెలియజేస్తున్నారు. వారి నుంచి జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యం పొందుతున్న రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సన్‌రైజ్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు, అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం చికిత్స కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం చుట్టుగుంటలోని అనీల్ న్యూరో అండ్ ట్రామా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ వైద్యం చేసేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 17న దరఖాస్తు చేసుకుని, అనుమతి రాకుండానే.. అదే రోజు 12 మంది కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకున్నారని నిర్ధారించారు. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రూ.2 లక్షల జరిమానా విధించారు. జీవో నం.77 ప్రకారం వైద్యం చేయాల్సిందే.. జిల్లాలోని కోవిడ్ వైద్యానికి అనుమతులు పొందిన ఆస్పత్రుల్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.77 ప్రకారం ఫీజులు తీసుకుని వైద్యం చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తేల్చి చెప్పారు. అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదు అందినా.. సుమోటోగా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే 104కు గానీ, 1902కు గానీ ఫోన్ చేయాలని శివశంకర్ సూచించారు. -
Oxygen Cylinder Shortage in Hyderabad: అందని ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలు నిలబెట్టే ఈ ప్రాణవాయువును కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వాడకూడదని.. కేవలం కరోనా ఆసుపత్రులకు మాత్రమే వినియోగించాలని ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలు జారీ చేసినా ఏ కంపెనీ కూడా ఖాతర్ చేయడంలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరిగా అందక రోగులు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆక్సిజన్, ఐసీయూ పడకలపై ఉన్న రోగులకు పూర్తిస్థాయిలో కాకుండా కొంచెం కొంచెం మాత్రమే ఆక్సిజన్ అందిస్తూ నెట్టుకొస్తున్నారు. వీఐపీ రోగులైతే పైరవీలు చేయించుకొని పూర్తిస్థాయిలో ప్రాణవాయువు పొందుతుండగా.. సాధారణ రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆస్పత్రులు అయితే వారికి కొద్దిసేపు ఇచ్చి.. కొద్దిసేపు ఆపేస్తున్నాయి. రోగి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంటే తప్ప ఆక్సిజన్ వాడటంలేదు. మూడింతలు పెరిగిన డిమాండ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా ఆసుపత్రుల అవసరాలకు దాదాపు 165 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని అంచనా. అయితే, గత 2,3 రోజులుగా డిమాండ్ మూడింతలు పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 165 మెట్రిక్ టన్నుల్లో 40 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు, మిగిలింది ప్రైవేటు ఆస్పత్రులకు కావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేసి.. అక్కడ నుంచి పైపుల ద్వారా రోగుల పడకల వద్దకు సరఫరా చేస్తారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండటంలేదు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వీటికి 99 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 60 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని అంటున్నారు. అంతేకాకుండా అవి సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా మార్చడంతో డిమాండ్ మరింత పెరిగింది. ఇష్టారాజ్యంగా ధరలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకట్రెండింటికి మినహా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ లేదు. అక్కడ సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయి. ఇది మొత్తం డ్రగ్ కంట్రోల్ విభాగం ద్వారా జరుగుతుంది. ఆస్పత్రులకే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లు అవసరం. ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించిన మేరకు వాటిని కేటాయించాలి. ఎంతమంది రోగులు ఐసీయూ, ఆక్సిజన్ పడకలపై ఉన్నారో ఆ మేరకు సిలెండర్లు ఇవ్వాలి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా అవి రావడంలేదని అంటున్నారు. పైగా ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నారు. 22 క్యూబిక్ లీటర్ల పెద్ద సిలెండర్ ధర గతంలో రూ. 3,080 నుంచి రూ.3,740 ఉండేది. అంటే లీటర్‌కు రూ.140 నుంచి రూ.170 వరకు పడేది. ఇప్పుడు దానిని రూ.7,700 నుంచి రూ.8,580 వరకు విక్రయిస్తున్నారు. అంటే.. లీటర్‌కు రూ.350 నుంచి రూ.390 వరకు పడుతోందన్నమాట. ఇక పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం ఇదే సిలెండర్‌ను రూ.10 వేలైనా వెచ్చించి కొంటున్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారనే విమర్శలున్నాయి. ఇంతగా ధరలు పెంచడంతో ఆక్సిజన్ కొనలేక కొందరు, కొరత వల్ల కొన్ని ఆసుపత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ కొంచెం ఆక్సిజన్ సైతం దక్కనీయకుండా కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు గుత్తాధిపత్యం వహిస్తున్నాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పడకలు కూడా లేవని పలువురు రోగులను ప్రైవేటు ఆస్పత్రులు వెనక్కి పంపుతున్నా.. డ్రగ్‌కంట్రోల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్‌లో రెమిడెసివీర్.. తుసిలిజుమాబ్ ఆక్సిజన్ సంగతి పక్కన పెడితే.. కరోనా రోగులకు వినియోగించే ఔషధాల విషయంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. కరోనా బాధితులకు కీలకమైన సమయంలో రెమిడిసివీర్ ఇస్తారు. కేంద్రం సిఫార్సు చేయకపోయినా తుసిలిజుమాబ్‌ను కూడా కొన్ని ఆసుపత్రులు ఇస్తున్నాయి. ఇవి యాంటీ వైరల్ డ్రగ్స్ అయినా కూడా కొన్ని ఆసుపత్రులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నాయి. వాస్తవానికి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులే రోగుల సంఖ్యను ఆధారం చేసుకొని ఇస్తుంటారు. అయితే, ఆస్పత్రులు మాత్రం వాటి కొరత ఉందంటూ రోగులనే తెచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రూ.5,600 ధర ఉన్న రెమిడిసివీర్ ఇంజెక్షన్‌ను ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నాయి. ఇక తుసిలిజుమాబ్ ధర రూ.12 వేలు కాగా, రోగుల నుంచి ఏకంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రి ఒక రోగికి ఏకంగా రూ.75 వేలకు తుసిలిజుమాబ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రులు ఇలా రోగులను దోపిడీ చేస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేట్ లేబరేటరీల్లో రూ.550కు చేయాల్సిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1200 నుంచి రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీపీఆర్ కిట్ ధర రూ.65కి తగ్గినా.. ఆ మేరకు ధర తగ్గించడంలేదు. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
వ్యాక్సిన్‌కు రెట్టింపు వసూలు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిలోనూ కాసుల వేటకు దిగాయి. కరోనా వ్యాక్సిన్‌కు నిర్ధారించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై జనం మండిపడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆయా యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. మరికొన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు రాగా, వాటిపై కూడా జిల్లా వైద్యాధికారులతో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అవి పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బీపీ చెక్ చేస్తున్నామంటూ అదనపు వసూళ్లు ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నారు. అయితే ప్రైవేట్‌లో మాత్రం టీకాకు రూ. 150, సర్వీస్ చార్జి కింద రూ. 100 వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగాలని... టీకా ధరే వసూలు చేయాలని, సర్వీస్ చార్జి వసూలు చేయొద్దని డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని కొన్ని ఆసుపత్రులు అంగీకరించాయి. కానీ కొన్ని ఆసుపత్రులు ఆ మాట వినకపోగా, రెట్టింపు వసూలు చేస్తున్నాయి. విచిత్రమేంటంటే బంజారాహిల్స్‌లో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రెట్టింపు అంటే రూ. 500 వసూలు చేస్తోంది. దీనిపై ఆ యాజమాన్యాన్ని పిలిపించి వివరణ కోరారు. తాము బీపీ చెక్ చేస్తున్నామని, వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ తెలుసుకుంటున్నారని, అందుకే రెట్టింపు వసూలు చేస్తున్నామని వింత సమాధానం చెప్పారు. బీపీ చెక్ చేస్తే అంత వసూలు చేయాలా? వ్యాక్సిన్ వేసే ముందు డాక్టర్ ఒకసారి లబ్ధిదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సర్వసాధారణం. దానికి అంత వసూలు చేయాలా? అని వైద్య వర్గాలు యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. సర్వీస్ చార్జీ రూ. 100 వసూలు అనేది ఇటువంటి సేవలకేనని, అలాంటిది రెట్టింపు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వైద్యాధికారులు ప్రశ్నించగా, సమాధానం రాలేదు. దీంతో ఆ ఆసుపత్రికి ఇచ్చిన వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. అలాగే మరో రెండు ఆసుపత్రుల వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. ప్రభుత్వంలోనే అధికంగా వ్యాక్సినేషన్ రాష్ట్రంలో ప్రస్తుతం 354 ప్రభుత్వ, 218 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 9,68,050 వ్యాక్సిన్లు వేయగా, అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,22,952 టీకాలు వేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2,45,098 మందికి వేశారు. ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వంలోనే ఎక్కువగా టీకాలు వేశారు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా వేయించుకుంటున్నారు. కాగా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 20 పడకలకు మించి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు టీకా వేసేందుకు అనుమతి కోరాయి. అయితే నిర్ణీత ధరకు మించి వసూలు చేయొద్దని, అలా చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. -
90 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 70 శాతం మంది వరకు లక్షణాలు లేకపోగా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంటే వైరస్ లక్షణాలు కనిపించేవారి సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది. గతంలో వైరస్ లక్షణాలున్న వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటివి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా కనిపిస్తున్నాయని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోవడం, బాగా తక్కువ లక్షణాలు ఉండటంతో చాలా మంది తమకు ఏమీకాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యక్తులకు వైరస్ వ్యాపించే ప్రమాదం నెలకొందని వైద్యారోగ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సరిహద్దులు, స్కూళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడం, చాలా మంది ఒక్కచోటికి చేరుతుండటంతో.. విద్యార్థులకు కరోనా వ్యాపిస్తోంది. టెస్టులు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండగా.. పరీక్షలు చేయక వెలుగు చూడని వైరస్ బాధితులు ఎందరో ఉన్నారని అంచనా. అలాంటి వారి నుంచి ఇండ్లలో తల్లిదండ్రులకు, పెద్దవయసు వారికి వైరస్ సోకుతోంది. ఇక కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేని సాధారణ స్థితికి వచ్చామన్న భావనతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలా రెండు నెలల్లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లోనూ బెడ్స్ నిండిపోతున్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ 50 నుంచి 60 శాతం మేరకు కరోనా కేసులతో నిండాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కరోనాకు కేటాయించిన 90 ఆక్సిజన్ బెడ్లలో 70 నిండిపోయాయి. 40 ఐసీయూ బెడ్లలో 10 నిండాయి. గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిలో 50 ఆక్సిజన్ బెడ్లలో 30.. 20 ఐసీయూ బెడ్లలో 12 నిండాయి. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో 30 ఐసీయూ బెడ్లలో అన్నీ ఫుల్ అయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొండాపూర్‌లోని కిమ్స్‌లో 34 ఆక్సిజన్ బెడ్లలో 23, ఆరు ఐసీయూలలో నాలుగింటిలో కరోనా బాధితులు చేరారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో 58 ఆక్సిజన్ బెడ్లలో 31, 19 ఐసీయూ బెడ్లలో 13 నిండిపోయాయి. పరిస్థితి ఇలా తీవ్రంగా మారుతుండటంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ సరఫరాకు ఆర్డర్లు పెట్టడంతోపాటు 15 వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్ వయల్స్‌ను తెప్పిస్తున్నారు. 30లక్షల మల్టీ విటమిన్ మాత్రలకు ఆర్డర్ పెట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. ఒక్కరోజే 313 కరోనా కేసులు రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 313 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. వైరస్‌తో మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,664కు చేరినట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 2,98,262 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 943 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. గురువారం 62,972 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 94,82,649కు చేరుకుందని వివరించారు. కాగా.. తెలంగాణలో 1.22 శాతమే వ్యాక్సిన్ వృధా అవుతోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్లు వృధా అయినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవంగా పది శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతాయనే భావనతో.. కంపెనీలే 10 శాతం అధికంగా వ్యాక్సిన్లు ఇస్తాయని, ఈ లెక్కన మన దగ్గర వృథా చాలా తక్కువని వివరించారు. పాఠశాలలు, పక్క రాష్ట్రాల నుంచే.. పాఠశాలల విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి వ్యాప్తి జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సరిహద్దు జిల్లాల్లోనే ఉంటున్నాయి. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అర్హులైన వారంతా టీకాలు వేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
కళ్లుతిరిగే.. కార్పొ‘రేటు’.. రూ.10కి దొరికే టాబ్లెట్ 100కు!
విజయవాడ నక్కల రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుడివాడకు చెందిన ఓ రోగి స్వల్ప పక్షవాతంతో చేరారు. మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. ఆయనకు రూ.2.85 లక్షలు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి గొల్లుమనడం పేషెంట్ వంతయ్యింది. ఇందులో ఇంజెక్షన్ల ఖరీదే రూ.1.30 లక్షలు. వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రి కొన్నది రూ.65 వేలకు మాత్రమే. వైద్య శాఖలో పెద్ద హోదాలో రిటైర్ అయిన ఓ డాక్టర్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఇటీవలే ఓ 70 ఏళ్ల మహిళ కోవిడ్ బారినపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. వారం రోజులు చికిత్స చేసి రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో చూసినా నిత్యం ఇదే తంతు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరిట రోగులు, వారి కుటుంబీకుల నడ్డి విరుస్తున్నాయి. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి. చిన్న జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. జనరిక్ మందులు రాసేందుకు ససేమిరా బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్‌లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్పీని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ మందుల్లోనూ అంతే రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు. చట్టం చేయడం వల్లే నియంత్రణ సాధ్యం మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్‌ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం. – డాక్టర్ బి.సాంబశివారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్వహణ కష్టమవుతుంది ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు అమ్మితే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుంది. వందల మంది సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉంటాయి. 100 పడకల ఆస్పత్రిని నిర్వహించాలంటే ఇప్పుడు చాలా వ్యయమవుతోంది. ఇక జనరిక్ రాయాలంటే కొద్దిగా క్వాలిటీని చూసుకోవాలి కదా. ఎంఆర్పీ కంటే తగ్గించడం కష్టం. – డాక్టర్ మురళి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖ -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణా అంతే ముఖ్యం. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి.. వైద్యులు లేరు, సిబ్బంది లేరు అంటే బావుండదు. వైద్యులు ఎంత మంది అవసరమో అందర్నీ తీసుకోండి. భవనాలు, వైద్య పరికరాలు, ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటి నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను పాటించండి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మెరుగైన పారిశుధ్యం, ప్రమాణాలు ఉండాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలే ప్రామాణికంగా ఉండాలి. బోధన ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పడకల మీద వేసే బెడ్షీట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో అత్యుత్తమ నాణ్యత పాటించాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు, ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రుల్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రమాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక్క వైద్య రంగంలోనే రూ.16,270 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పత్రి లోపలికి వెళ్లగానే మంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామనిపించేలా చక్కటి వాతావరణం, బెడ్స్, పరికరాలు, ఇతర వసతులు ఉండాలన్నారు. నిర్మాణం ఒకెత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు అని చెప్పారు. ఆస్పత్రుల్లో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు చూసేందుకు నైపుణ్యమున్న వారిని తీసుకోవాలని.. పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వేర్వేరుగా ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, విద్య రంగాల్లో నాడు–నేడు పనులను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. నాడు–నేడు పనులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ, ఇతరత్రా ఎలాంటి సమస్యలైనా వస్తే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పేషెంటుకు ఇచ్చిన గది నుంచి పడక వరకు ఆస్పత్రి వాతావరణం బాగుండాలన్నారు. రోగులకు అందిస్తున్న భోజనం కూడా బావుండాలని, ఇందులో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. ఎక్కడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని, ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ ఆస్పత్రిలోనూ పరికరాలు పని చేయలేదనే మాట వినిపించకూడదని, ఆస్పత్రుల నిర్వహణ ఎలా ఉండాలో స్కూళ్లలోనూ అలాగే ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సెప్టెంబర్‌లోగా హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయండి ► రాష్ట్రంలో మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో 1,426 క్లినిక్స్‌ను పునరుద్ధరిస్తున్నారు. వీటి పనులు సెప్టెంబర్‌లోగా పూర్తి చేయండి. ► వీటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలి. ప్రత్యేక పర్యవేక్షణతో సకాలంలో పనులు పూర్తి చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే పీహెచ్‌సీలు కూడా త్వరగా పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందించండి. ► పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. మే 15కు మెడికల్ కాలేజీల టెండర్లు పూర్తి ► కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు మే 15 నాటికి టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ధి పనులకు ఏప్రిల్ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారవుతాయన్నారు. ► కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, అక్టోబర్ నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ► రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివిటీపై సీఎంకు వివరించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి అంత ఉధృతి లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్ల వ్యయంతో ఒకేసారి ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైద్య విద్యా రంగంలో పెను మార్పులకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ వైద్య విద్యా రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభ్వుత్వ సామాజిక బాద్యతగా చేపట్టి భావి తరాల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై పలు సార్లు సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. కార్పొరేట్‌కు ధీటుగా 50 ఎకరాల్లో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలపై జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం కోసం పంపారు. పాడేరు, మచిలీపట్నం కాలేజీలపై కూడా ఈ నెలలోనే జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపనున్నారు. ఈ నాలుగు కాలేజీలకు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం బాపట్ల మెడికల్ కాలేజీల జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్లో టెండర్లను ఆహ్వానించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలపై జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం జనవరిలో టెండర్లు ఆహ్వానించేలా కార్యాచరణ రూపొందించారు. -
కార్పొరేట్ ఆస్పత్రుల ‘కరోనా కాటు’
(వెబ్ స్పెషల్): ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ప్రజలను పట్ట పగటి దొంగల్లా పలు ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వెల్లువెతున్న విషయం తెల్సిందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ఇప్పటికీ వాటి ముక్కుకు తాడేయలేక పోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్న వారు. సరైన మార్గదర్శకాల కోసం ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్’ కూడా తన వంతు ధర్మంగా రిట్ పిటిషన్లో భాగస్వామిగా చేరింది. కరోనా వైరస్ మహమ్మారి మానవాళిపై విరచుకుపడకు ముందు నుంచే దేశంలోని పలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్స పేరిట దోచుకుంటున్నాయి. మందులు, ఇంజెక్షన్లపై కార్పొరేట్ ఆస్పత్రులు 1700 శాతం లాభాలు చూసుకుంటున్నట్లు ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ గతంలో ఓ నివేదికలో కూడా వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూ కరోనా మహమ్మారి సంక్షోభం నాటికి తారా స్థాయికి చేరుకుంది. నేడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల్లో ఎక్కడా పారదర్శకత అనేది లేకుండా పోయింది. మాస్క్‌లు, గ్లౌజులు లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ)ను ఓ రోగికి ఎన్ని సరఫరా చేశారో, వాటి ధర ఎంతో పేర్కొనకుండా వీటికి లెవీ చార్జీలు రోజుకు అంటూ పది నుంచి పదిహేను వేల రూపాయల చార్జీలను వసూలు చేస్తున్నాయి. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ చార్జీలు, వ్యర్థ వైద్య పరికరాల తరలింపు, ఆస్పత్రి అడ్మిషన్, రోగి వైద్య చరిత్ర అంచనా, వైద్య పరికరాల వినియోగ, ముందు జాగ్రత్త, పార్కింగ్ చార్జీల పేరిట ఒక్కో రోగి నుంచి లక్షల రూపాయలు కార్పొరేట్ ఆస్పత్రులు పిండుతున్నాయని దేశంలోని మూడు నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రలు బిల్లులను పరిశీలించిన ‘ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్’ సుప్రీం కోర్టు పిటిషన్లో పేర్కొంది. (కరోనా లక్షణాలు లేనివారిలో.. వెరీ డేంజర్!) కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా రోగులపై వారి అనుమతి లేకుండా ‘ఫేవిపిరావిర్, హెచ్‌సీక్యూ, టోసిలిజుమాబ్, లోపినవిర్ ప్లస్ రిటోనవిర్, రెమిడిసివిర్ లాంటి మందులను ప్రయోగిస్తున్నట్లు కూడా ఏఐడీఏఎన్ ఆరోపించింది. కరోనా చికిత్సకు ఆస్పత్రులు వేస్తున్న చార్జీలు, బిల్లులు ఏకపక్షంగానే కాకుండా అహేతుకంగా ఉంటుండంతో వైద్య బీమా కంపెనీలు కూడా రోగుల బిల్లులను చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు పాక్షికంగానే బిల్లులను చెల్లిస్తున్నాయి. వ్యక్తిగత రక్షణ పరికరాలు రోగికి అవసరం లేదని, రోగి నుంచి ఆస్పత్రి సిబ్బందికి అంటురోగాలు అంటుకోకుండా వినియోగించడానికంటూ వాటి చార్జీలను పూర్తిగా చెల్లించేందుకు నిరాకరిస్తూ వచ్చిన కంపెనీలు, ఇప్పుడు పది, హేను వేల బిల్లులకు ఒకటి, రెండు వేల రూపాయలను చెల్లిస్తున్నాయి. ఎలాంటి పారదర్శకత లేకుండా కార్పొరేట్ ఆస్పత్రులు తమ ఇష్టానుసారం రోగులపై అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నాయని, వైద్య బీమాలేని రోగులకంటే బీమా ఉన్న రోగులపై వాటి వడ్డింపులు ఎక్కువగా ఉంటున్నాయని ‘జనరల్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్’ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వైద్యానికి వేర్వేరు చార్జీలను నిర్దేశించడమే కాకుండా వైద్య బీమా విషయంలో విభిన్న వైఖరులను అవలంభించడం కూడా కార్పోరేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీల నుంచి వైద్య బీమా వినియోగదారులను మినహాయించగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యానికి చార్జీలను నిర్దేశిస్తూ జూన్ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులో వైద్య బీమా వినియోగదారులను మినహాయించ లేదు. అయినప్పటికీ అక్కడి కార్పొరేట్ ఆస్పత్రులన్నీ వైద్య బీమా ఉన్న ప్రజలను ప్రభుత్వ చార్జీల నుంచి ఏకపక్షంగా మినహాయించాయి. ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీలను అమలు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారులతో కమిటీలు వేసి తనిఖీలు చేయిస్తుండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం అధికార కమిటీలు అధిక చార్జీలను వసూలు చేసిన కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి వాటిని వసూలు చేసి రోగులకు ఇప్పించాయి. అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా, హెల్త్‌కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ సంస్థలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చార్జీలను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. కార్పొరేట్ ఆస్పత్రుల లాబీ వల్ల, వాటి దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకరాలేక పోతున్నాయి. ఉన్న చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయలేక పోతున్నాయి. ఫిక్కీలాంటి సంస్థల్లో కూడా కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాతినిథ్యం బలంగా ఉండడంతో క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కార్పొరేట్ ఆస్పత్రుల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వాటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. (‘కరోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!) -
బాధితులతో రాయ‘బేరాలు’
సాక్షి,సిటీబ్యూరో: నియమాలు ఉల్లంఘించి కరోనా చికిత్సపై కాసులు ఏరుకుంటున్న కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మరో అడుగు ముందుకు వేశాయి. తమ నిర్వాకాలపై ఫిర్యాదు చేసిన బాధితులను నయానో, భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డాయి. ఇటీవల కరోనా చికిత్సలు చేయకుండా అనైతిక చర్యలకు పాల్పడటంతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఆసుపత్రుల ప్రతినిధులు ఫిర్యాదుదారులను దారిలోకి తెచ్చే పనులకు దిగారు. తమ ఆస్పత్రి వైద్యం, బిల్లులు, అనైతిక చర్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వారికి ఫోన్ చేయడంతో పాటు వాళ్లను నేరుగా కలుస్తున్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే అధిక బిల్లు విషయంలో చర్చిద్దామని రాజీ భేరాలు చేస్తున్నారు. (‘విరించి’పై వేటు!) కోవిడ్ వ్యాధి కోసం రోడ్ నంబర్–1లోని ఓ ఆస్పత్రిలో చేరి రూ.14.60 లక్షల బిల్లులు చెల్లించిన ఓ వృద్ధ దంపతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరితో ఆస్పత్రి నుంచి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వ్యక్తి సంప్రదింపులు జరిపి ఫిర్యాదును ఉపసంహరించుకుంటే తాము కట్టించుకున్న ఫీజులో కొంత వాపస్ చేసే విషయమై మాట్లాడతామని ప్రతిపాదన పెట్టాడు. దీంతో వారు వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అనంతరం సంబంధిత ఆస్పత్రి ప్రతినిధి ఎంతకూ ఫోన్ లేపకుండా తమని మరోసారి వంచనకు గురి చేశాడని ఆ వృద్ధ దంపతులు మీడియాను ఆశ్రయించారు. తమను రెండుసార్లు మోసం చేసిన సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఆస్పత్రి ప్రతినిధిని ‘సాక్షి’ ప్రశ్నిస్తే ‘‘మాకు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. వివాదం కోర్టులో ఉంది’’ అని పేర్కొనడం విశేషం. -
గాంధీ హౌస్‌ఫుల్.. వెంటిలేటర్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. ఆయనకు వెంటిలేటర్ సహాయం అవసరమైంది. ఆస్పత్రిలో 105 వెంటిలేటర్లు ఉండగా, అప్పటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితున్ని గాంధీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు బాధితుని బంధువులకు సూచించారు. విధిలేని పరిస్థితుల్లో శనివారం రాత్రి అతికష్టం మీద గాంధీకి తీసుకొచ్చారు. తీరా.. ఇక్కడ వెంటిలేటర్లు ఖాళీ లేవని వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని, ఇందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగినంత చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా పాలకుర్తికి చెందిన వ్యక్తికి మాత్రమే కాదు..కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న అనేక మంది ఆఖరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), కింగ్‌కోఠిలో 50, ఛాతి ఆస్పత్రిలో 28 వెంటిలేటర్ల చొప్పున ఉన్నప్పటికీ..టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారు. గాంధీ ఐసీయూ హౌస్‌ఫుల్ 1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటిలేటర్ దొరకని పరిస్థితి. అంతేకాదు ఆక్సిజన్, సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికైనా వెంటిలేటర్ అనివార్యమైతే..అప్పటికప్పుడు ఇతరులకు అమర్చిన వెంటిలేటర్ తొలగించి అవసరమైన వారికి అమర్చాల్సి వస్తుంది. కొత్తగా ఆస్పత్రికి చేరుకున్న వారికి వెంటిలేటర్ కావాలంటే..ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ..సమకూర్చలేని దుస్థితి. విధిలేని పరిస్థితుల్లో చాలా మందిని సాధారణ ఆక్సిజన్‌తోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పలు ఆ స్పత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్‌పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ...ప్రతిష్టాత్మాక ఆయా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చేరాలని భావిస్తున్నారు. రోగుల బంధువుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా ఆస్పత్రులు ఆసరాగా చేసుకుంటున్నాయి. అడిగినంత చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే ఐసీయూ పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.9000 ధర నిర్ణయించగా..ఆయా ఆస్పత్రులు ఒక్కో వెంటిలేటర్ రోగి నుంచి రోజుకు రూ.80 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తున్నాయి. బాధితులు చెల్లించిన డబ్బుకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్న ఆయా కార్పొరేట్ ఆస్పత్రులపై 1200పైగా ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు రెండు మినహా మరే ఇతర ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ప్రేవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు అంటూ ఖరారు చేయక పోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. -
ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలకు సంబం ధించి ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం కన్నా అవే బలమైనవిగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలకు, చికిత్సలకు నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ప్రైవేటు ఆస్పత్రులు పట్టిం చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. ఇంత నిర్లక్ష్యంగా, లాభాపేక్షతో వ్యవహరిస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి రాయితీ, లీజు పద్ధతిలో భూములు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు ఒప్పందం మేరకు పేదలకు ఉచితంగా వైద్యం చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. రాయి తీగా ఇచ్చిన భూమిని, లీజుకు ఇచ్చిన భూమిని ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవడంలేదని అడిగింది. అసలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏం జరుగు తోందని ప్రభుతాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని, ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, కరోనా చికిత్సలు అంది స్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర శానిటరీ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకోవాలని.. ఇలా దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్య దర్శి డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మా సనం ముందు హాజరయ్యారు. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమి స్తోందని, ఎందరో అధికారులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని సోమేశ్‌కుమార్ వివరించారు. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. 2 వారాల్లో అమలు చేయాలి గతంలో తామిచ్చిన ఆదేశాలను 95 శాతం వరకు అమలు చేశారని, ప్రభుత్వ పనితీరు బాగుందని, ఇంకా మిగిలిన 5 శాతం ఆదేశాలను కూడా రెండు వారాల్లో అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో తెలంగాణ ఇతర రాష్ట్రా లకు ఆదర్శంగా నిలవాలని, దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. తాము ప్రభుత్వాన్ని కించపర్చడం, తక్కువ చేసి మాట్లాడడం చేయడంలేదని.. అందరం కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాం క్షతో పనిచేద్దామని సూచించింది. తదుపరి విచార ణకు సీఎస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం చిన ధర్మాసనం.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం హాజరుకావాలని పేర్కొంటూ సెప్టెంబర్ 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది." ఆ టెస్టుల కచ్చితత్వం ఎంత ? ‘‘ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కచ్చితత్వంపై మాకు అనుమానాలున్నాయి. 40 శాతం వరకే వీటిని విశ్వ సించాలనే వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి పరీక్ష చేసినా నెగెటివ్ అని వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టుల కచ్చితత్వంపై మా అను మానాలను నివృత్తి చేయండి’’అని ధర్మాసనం ఆదేశించింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి యాంటిజెన్ టెస్టు చేస్తే 100 శాతం పాజిటివ్ అనే వస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఐసీఎంఆర్ సైతం యాంటిజెన్ పరీక్షలు చేయాలని చెబుతోందని, ఇతర రాష్ట్రాలు సైతం పాజిటివ్ కేసులను గుర్తిం చేందుకు ఈ టెస్టుల మీదనే ఆధారపడ్డాయని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య 650కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చేందుకు రూ.12 కోట్లు కూడా విడుదల చేసినట్టు వెల్లడించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 86 కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామనే విషయాన్ని జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ వెబ్సైట్లో పేర్కొన్నాం’’అని సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు. ధర్మాసనం ఆదేశాల్లో ఇంకా ఏమున్నాయంటే కరోనా టెస్టులు చేయించుకుంటున్న వారిలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఎన్ననే వివరాలతో పాటు పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఉన్న వారెందరు? లక్షణాలు లేనివారెందరు? వంటి వివరాలను మీడియా బులెటిన్‌లో చెప్పాలి. పేద ప్రజలు ఐసోలేషన్‌లో ఉండేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ల సమాచా రాన్ని మీడియా బులెటిన్‌లో ప్రకటించాలి. ఏ కేంద్రంలో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నా యో తెలియజేయాలి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ మీద వస్తున్న ఫిర్యా దులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. పదే పదే జీవోలను ఉల్లంఘిస్తుంటే ఆయనా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని బెడ్స్‌ను పేదలకు కేటాయించేలా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన తరహాలో ప్రభుత్వం ఇక్కడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆదేశాలు ఇవ్వలేకపోతే కారణాలు ఏంటి? రసూల్‌పురాలోని హాకీ స్టేడియాన్ని, ఇతర స్టేడి యాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే అం శాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మరింత సమర్థంగా చేస్తారనే... ‘‘ఓ కంసాలి.. తన కుమారుడు ఎంత మంచిగా నగ తయారు చేసినా తండ్రి ఏదో లోపముందనేవాడు. ఒక రోజు భార్య భర్తను అడిగింది. మన బిడ్డ ఎంత మంచిగా నగను తయారుచేసినా ఏదో ఒక లోపం ఉందంటున్నారు. ఎందుకిలా అని ప్రశ్నించింది. ఆ నగ సరిగా లేదని కాదు. ఇంకా మంచిగా తయారు చేస్తాడనే.. లోపాన్ని ఎత్తి చూపానని చెప్పాడు ఆ తండ్రి. అలా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని కాదు.. మరింత సమర్థవంతంగా ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే లోపాలను ఎత్తి చూపుతూ, వాటిని సరిదిద్దుతారనే ఈ ఆదేశాలు జారీచేస్తున్నాం. పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేసి ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిన అవసరం ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది.