‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది.
బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్‌కు మెంటార్‌గా ఉన్నాను. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఫైనల్స్‌కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్‌లో నేనొక మెంబర్‌గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్‌లో ఉండి ఆ ఫౌండేషన్‌కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది.
► కష్టమైనా .. సులువే..
ఎమ్‌ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్‌పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి, క్యాన్సర్ హాస్పిటల్‌కి మెడికల్ రైటర్‌గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్‌తో ఇలాంటి కాంటెస్ట్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను.
► టైమ్ ప్రకారం ప్లానింగ్..
నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్‌ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్‌కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్‌కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్‌కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్‌ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్‌ని, డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను.
► నువ్వు ఫిట్ కావు అన్నారు...
బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్‌కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు.
నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్‌కి తీసుకువచ్చింది.
► యాసిడ్ దాడి బాధితులకు..
కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను.
► అవగాహన కలిగిస్తూ...
చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్‌కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్‌లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment