చచ్చినా వదలట్లేదు | CoronaVirus: Corporate Hospitals Full Business In Telangana | Sakshi
Sakshi News home page

కరోనాతో కార్పొరేట్‌ దందా

Published Mon, Jul 6 2020 1:55 AM | Last Updated on Mon, Jul 6 2020 2:36 AM

CoronaVirus: Corporate Hospitals Full Business In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌  ఆసుపత్రిలో  నిమ్మ బస్వ నాగరాజు (42) కరోనాతో గత నెల 25న చేరి ఈ నెల 4న మృతి చెందారు. మొత్తం రూ. 7.20 లక్షల బిల్లు అయిందని, అందులో కేవలం రూ.4 లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లించేందుకు ఒప్పుకుందని, మిగిలిన రూ.3.20 లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మృతదేహం ఆస్పత్రి అధీనంలోనే ఉందని పేర్కొన్నారు.

ఎండీ సులేమాన్‌ తహసీన్‌ (30) కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో జూన్‌ 12న చేరి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన కుటుంబసభ్యులు రూ.11 లక్షల బిల్లును ఆస్పత్రికి కట్టగా,మొత్తంరూ.16.17 లక్షల బిల్లు అయిం దని, మిగిలిన 5.17 లక్షల బిల్లుల బకాయిలు కడితేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో చేసేది ఏం లేక వాళ్లు అడిగిన మొత్తం ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి విప త్కర సమయంలో కార్పొరేట్‌ ఆసుపత్రులు ధనదాహంతో పేట్రేగుతున్నాయి. రోగి సంబంధీకుల భయాన్ని సొమ్ము చేసుకుంటూ లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. రోగి చనిపోయినా బకాయిలు కట్టనిదే మృతదేహాలను ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. కరోనా వస్తే ఆరోగ్య పరంగా కోలుకోవ డం ఒక ఎత్తు అయితే... లక్షల్లో బిల్లులను వేసి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనా వస్తే ఖతమేననే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘిస్తు న్నాయి. అయినవారు మరణించడంతో తీవ్ర దుఃఖంలో మునిగి ఉండే కుటుంబ సభ్యుల నుంచి రూ.లక్షల ఫీజుల బకాయిలను ముక్కు పిండి వసూలు చేసిన తర్వాతే మృత దేహాలను అంత్యక్రియలకు అప్పగిస్తున్నాయి. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి)

బిల్లులను తగ్గించాలని కాళ్లు చేతులు పట్టుకున్నా ఆస్పత్రుల యాజమాన్యాలు కనికరించ డం లేదు. దీంతో అప్పో సప్పో చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం తీసుకెళ్లడానికే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఫీజుల బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ విషయంలో నిర్దయగా వ్యవహరిస్తున్నాయని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజుల బకాయిలు చెల్లించే స్తోమత తమకు లేదని, అయినవారి మృతదేహాలను ఆస్పత్రుల నుంచి విడిపించాలని రోజూ చాలా మంది ట్వీటర్, ఫేస్‌బుక్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావుకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

వీరికి అండగా చాలా మంది నెటిజన్లు ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీ‘జులుం’కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో గళం ఎత్తుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో కొన్ని ఆస్పత్రులు కొద్దిగా వెనక్కి తగ్గి కొంత వరకు ఫీజుల బకాయిలను తగ్గించడంతో పాటు మృతదేహాలను అంత్యక్రియలకు అప్పగిస్తున్నాయి. చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడి రోగులు మొత్తం ఫీజుల బకాయిలు చెల్లించడంలో విఫలమైతే వారిని నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమంగా నిర్భందిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000)

జేబులకు స్కాన్‌..
కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు తీవ్రమైన దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదు. కరోనా చికిత్స కోసం వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితిని ముందుగానే ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు స్కాన్‌ చేస్తున్నాయి. చికిత్స ప్యాకేజీ వివరాలను రోగి బంధువులకు తెలియజేస్తున్నాయి. బిల్లులు ఎంతైనా చెల్లించగలరని నిర్థారణకు వచ్చిన తర్వాతే రోగులను ఆస్పత్రి గడప తొక్కేందుకు అనుమతిస్తున్నాయి. అంత చెల్లించలేమని... బిల్లులు తగ్గించాలని ఎవరైనా బతిమిలాడితే ఆస్పత్రిలో బెడ్లు లేవని మాటమార్చి తిప్పి పంపిస్తున్నాయి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అడ్వాన్స్‌ చెల్లిస్తేనే ఆడ్మిట్‌ చేసుకుంటున్నాయి. పూర్తిగా కోలుకోవడానికి 15 నుంచి 20 రోజుల దాకా ఆసుపత్రిలో ఉండాల్సి రావడంతో కార్పొరేట్‌ ఆసుపత్రులు భారీ బిల్లులను చేతిలో పెడుతున్నాయి.

రోజుకు రూ. లక్ష..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సపై నమ్మకం లేక చాలా మంది కరోనా రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటులో చేర్పిస్తే ప్రాణాలైనా దక్కుతాయని కుటుంబసభ్యులు సైతం మొగ్గు చూపుతున్నారు. రోగుల ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురి చేసి వివిధ రకాల చికిత్సలకు ఫీజులు, మందుల ఖర్చులు పేరుతో రోజుకు కనీసం రూ.లక్షకు పైనే ఫీజులను ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు విధిస్తున్నాయి. దీంతో వారం రోజుల చికిత్సకు రూ.5 నుంచి రూ.10 లక్షలు, రెండు వారాల చికిత్సకు రూ.12 నుంచి రూ.20 లక్షల వరకు ఫీజులను ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి బిల్లు మొత్తం ఉంటోంది. 

జీవో గీవో..జాన్తా నై !
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జీవో నం.248 జారీ చేసింది. ల్యాబ్‌ పరీక్షలు, ఆస్పత్రుల్లో కేటగిరీల వారీగా వివిధ రకాల చికిత్సలకు ఫీజుల ప్యాకేజీలను ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. ఆయా కేటగిరీల వారీగా ఏ మేరకు ఫీజులు చెల్లించాలి, అందులో కల్పించాల్సిన సౌకర్యాలేమిటనే దానిపై స్పష్టత ఇచ్చింది. కానీ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటికి తిలోదకాలు ఇస్తున్నాయి. 

కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్‌ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శించాలని సర్కారు నిబంధన విధించింది. ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. రోగి, అతని బంధువులకు సేవల వివరాలను వెల్లడించాలి. కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వాళ్లు, అతి తక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దు. వీరిని హోం ఐసోలేషన్‌కు పరిమతం చేయాలని కేంద్ర మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇవేవీ పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. 

ప్రైవేటు బీమాతో ఏం లాభమన్న ధోరణి...
ప్రభుత్వ బీమా పథకాలను కరోనా చికిత్సకు జోడించలేదు. ఇక ప్రైవేటు బీమా సంస్థల పాలసీలను కూడా పట్టించుకోవడంలేదు. ఇన్సూరెన్స్‌ పథకాలను ఆస్పత్రులు అనుసరిస్తే బిల్లులను క్రమ పద్దతిలో రూపొందించాల్సి ఉంటుంది. ప్రతి చికిత్సకు సంబంధించిన పూర్తి సేవలు నిర్దేశించిన ధరల ప్రకారమే ఇవ్వాలి. అలాంటప్పుడే బీమా సంస్థలు ఆయా బిల్లులను ఆమోదించి నిధులు విడుదల చేస్తాయి. సాధారణ రోజుల్లో ఆస్పత్రులు ఈ తరహా కేసులను స్వీకరించేవి. కానీ కరోనా చికిత్సలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా... వైద్యులు, వైద్య సిబ్బంది కూడా రిస్క్‌తో కూడిన పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యాలు నిర్వహణ కింద భారీగా బిల్లులను రోగులపై రుద్దుతున్నాయి.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
అంబర్‌పేట్‌కు చెందిన మీర్‌ఫారూక్‌ అలీ ఖాన్‌ (67) కరోనా చికిత్స కోసం సికింద్రబాద్‌లోని మరో ఆస్పత్రిలో జూన్‌ 20న చేరి 27న మరణించారు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.లక్ష బిల్లు చెల్లించగా, చికిత్స కోసం మొత్తం రూ.4.25 లక్షల బిల్లు అయిందని, మిగిలిన రూ.3.25లక్షల బిల్లు బకాయిలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం మొండికేసింది. 

► తలాబ్‌కట్టకు చెందిన మహమ్మద్‌ అబ్బాస్‌ అలీ కరోనాతో జూన్‌ 19న బేగంపేటలోని ఆస్పత్రిలో చేరగా, జూలై 4న చికిత్స పొందుతూ మరణించారు. అప్పటికే అతడి కుటుంబ సభ్యులు రూ.5.30 లక్షల బిల్లులను ఆస్పత్రికి చెల్లించగా, మిగిలిన రూ.5.25 లక్షల బిల్లు బకాయిలు చెల్లించి మృతదేహం తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. 

► మనోజ్‌ కోఠారి (47) కరోనాతో జూన్‌ 20న సోమాజిగూడలోని ఓ పైవ్రేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా 28న డిశ్చార్జి రాశారు. అయితే బిల్లు సెటిల్‌ చేయలేదని ఆస్పత్రిలోని ఓ గదిలో అక్రమంగా నిర్బంధించి పెట్టారు. ఈ ఘటనపై ట్వీటర్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం స్పందించడంతో చివరకు ఆయనని ఇంటికి పంపారు.

సర్కారు ఖరారు చేసిన ప్రకారం కరోనా ప్యాకేజీ రోజువారీగా ...
1) జనరల్‌ వార్డ్‌ + ఐసోలేషన్‌కు– రూ. 4 వేలు
2) ఐసీయూ(వెంటిలేటర్‌ లేకుండా)+ ఐసోలేషన్‌కు– రూ.    7500
3) ఐసీయూ(వెంటìలేటర్‌తో సహా)+ ఐసోలేషన్‌కు– రూ. 9 వేలు ఛార్జి చేయాలి.

ప్యాకేజీలో భాగంగా రోగికి సీబీపీ, యూరిన్‌ రొటీన్, హెచ్‌ఐవీ స్పాట్, యాంటీ హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటిన్, యూఎస్‌జీ, 2డి ఇకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్‌ చార్జెస్, మీల్స్‌తో పాటు ప్రొసిజర్స్‌ సేవలు కల్పంచాలి. ఇక ప్యాకేజీ కిందకు రానివాటిని 2019 డిసెంబర్‌ 31 నాటి రేట్ల ప్రకారం వసూలు చేసుకోవచ్చు. పీపీఈ, ఇంటర్వెన్షల్‌ ప్రొసిజర్‌ (సెంట్రల్‌ లైన్‌ ఇన్సర్షన్, కీమోపోర్ట్‌ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్‌ ప్రొసిజర్, బయాప్సిస్, యాసిటిక్‌/ప్లైరల్‌ టాప్పింగ్‌) చార్జ్‌ చేయాలి. కోవిడ్‌–19 టెస్టింగ్‌ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం), హైఎండ్‌ డ్రగ్స్‌ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్‌ న్యూట్రీషన్, టోసిల్‌జంబ్‌..)కు ఎంఆర్‌పీ ధరలు, హై ఎండ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ (సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్‌ పరీక్షలు) వసూలు చేసుకోవచ్చు.

ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలతో రెండు వారాల పాటు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందితే రూ.56 వేల నుంచి రూ.1.26లక్షల బిల్లు మాత్రమే కానుంది. అయితే, పీపీఈ కిట్ల ఖర్చులు, ఇతర రోగాలకు చికిత్సల పేరుతో అదనంగా ఫీజులను వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో దీనిని అవకాశంగా మార్చుకొని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు రెచ్చిపోతుండడంతో ఉన్నతాధికారులు సైతం నివ్వెరబోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement