Mrs. India Contest
-
న్యూస్ రీడర్ నుంచి హీరోయిన్గా రాణిస్తున్న విశాఖ బ్యూటీ (ఫోటోలు)
-
Nikhila Vengala: బ్యూటీ కాంటెస్ట్‌లో ‘నువ్వు ఫిట్ కావు’ అన్నారు..
‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్‌కు మెంటార్‌గా ఉన్నాను. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఫైనల్స్‌కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్‌లో నేనొక మెంబర్‌గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్‌లో ఉండి ఆ ఫౌండేషన్‌కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది. ► కష్టమైనా .. సులువే.. ఎమ్‌ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్‌పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి, క్యాన్సర్ హాస్పిటల్‌కి మెడికల్ రైటర్‌గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్‌తో ఇలాంటి కాంటెస్ట్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. ► టైమ్ ప్రకారం ప్లానింగ్.. నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్‌ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్‌కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్‌కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్‌కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్‌ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్‌ని, డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను. ► నువ్వు ఫిట్ కావు అన్నారు... బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్‌కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్‌కి తీసుకువచ్చింది. ► యాసిడ్ దాడి బాధితులకు.. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను. ► అవగాహన కలిగిస్తూ... చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్‌కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్‌లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ. – నిర్మలారెడ్డి -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
సాధికారతే సౌందర్యం
మహిళలు... మౌనం వీడాలి... గొంతు విప్పాలి. చెప్పాలనుకున్నది... చెప్పగలగాలి. వాళ్లకు... ఓ ఆలంబన కావాలి. వినడానికి ఒకరున్నారనే భరోసానివ్వాలి. సాధికార సాధనలో ఒకరిది తొలి అడుగైతే మరొకరిది వందో అడుగు... అంతే. గమ్యం వేల అడుగుల దూరాన ఉంది. ఆ లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది మమత‘సేవ’ ‘సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. తనకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలి’... ఇదీ ఆమె ఫిలాసఫీ. మరి ఆ తిరిగి ఇవ్వడంలో ‘మీ ప్రాధాన్యం మహిళలకే... ఎందుకలా?’ అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘తరతరాల వివక్షకు తలొగ్గి మగ్గిపోయింది మహిళ. సమానత్వ పోరాటంలో అనుక్షణం అలసి పోతోంది. ఇంటి నాలుగ్గోడలు ఆమెను అర్థం చేసుకుంటాయి. కానీ ఆమె మనసులో ఆవేదనను బయటకు తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి కూడా. మహిళ గొంతు విప్పడానికి సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉంది నేటికీ. ఆమె ఎదగడానికి నిచ్చెన వేసే వాళ్లు ఉండరు. సాధికారత సాధనలో భాగంగా చెమటోడ్చి ఒక్కో సోపానాన్ని తనకు తానే నిర్మించుకుంటోంది. నా మాటలను నమ్మలేకపోతే నేను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చూడండి. ఆడపిల్ల పరిస్థితి అర్థమవుతుంది. ఒక్క పూట అయినా అన్నం దొరుకుతుందని బడికి వచ్చే అభాగ్యులు కనిపిస్తారు. చేనేత కుటుంబాల్లో ఆడవాళ్లను చూడండి, రంగులద్ది అద్ది అరచేతులు రంగుమారిపోయి ఉంటాయి. ఇక వేలాది రూపాయలు పెట్టి ఆ చీరలను ధరించగలిగిన సంపన్న వర్గాల మహిళలను కదిలించి చూడండి, జానెడు పొట్ట ఆకలి తీర్చడానికి పట్టెడన్నం ఎప్పుడు తినాలో తెలియని ఎదురు చూపులే ఉంటాయి. ఇంట్లో మగవాళ్లందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆడవాళ్లు భోజనం చేయాలనే నియమాన్ని పాటిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా?’’ అన్నారామె ఆవేదనగా. మహిళలంతా విజేతలే మమతా త్రివేది పూర్వీకులు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎం.ఎ సైకాలజీ చేసిన మమత... తన మామగారు ఆర్.పి. త్రివేది స్థాపించిన పబ్లికేషన్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. భర్త, కొడుకు చార్టెడ్ అకౌంటెంట్లు. కూతురు యూఎస్‌లో స్థిరపడింది. ఎంప్టీనెస్ అనేటంతటి పెద్ద పదం కాదు కానీ, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏర్పడే ఒకలాంటి శూన్యత చాలామందికి ఎదురవుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఒకే మూసలో సాగుతున్న డైలీ రొటీన్ కొంతమందిలో బోర్‌కు దారి తీస్తుంది.ఆ స్థితిలోనే జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకోగలగాలి. అదే చేశారు మమత. ‘‘మా అమ్మాయి ప్రోత్సాహంతో నలభై ఏడేళ్ల వయసులో మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మేకప్, హై హీల్స్ ధరించడం కొత్తగా అనిపించింది. ‘బ్యూటీ’ అనే పదానికి అసలైన అర్థం అప్పుడే తెలిసింది. మేని ఛాయ, ఎత్తు, లావు... ఇవేవీ కాదు. పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోగలిగిన నేర్పు, మార్పును స్వీకరించగలిగిన వైనం వంటి అనేక అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సాధికారతను మించిన సౌందర్యం మరొకటి ఉండదు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో నాకు ‘మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ (2017)’ కిరీటం దక్కింది. కానీ ఆ పోటీలకు ముప్పైకిపైగా దేశాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పాలి. ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. నిజానికి నేను అసలైన ప్రపంచాన్ని చూసింది అప్పటి నుంచే. ప్రతి మహిళకూ జీవితంలో పోరాటం ఉంటుంది. జీవితంతో పోరాడి నిలబడడమే గొప్ప విజయం. అప్పటి వరకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు, పబ్లికేషన్ వ్యాపారం, పిల్లలు... ఇదే లోకంగా జీవించాను. ఈ పోటీల్లో టాస్కుల్లో భాగంగా నా గురించి రాసి ఎఫ్బీలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. నా సోషల్ మీడియా జర్నీ అలా మొదలైంది. మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ వరల్డ్ విజేత మమతా త్రివేది అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ! బ్యూటీ విత్ హార్ట్... కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్నాను. ‘సేవ (ఎస్ఈడబ్లు్యఏ, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్)’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం పని చేస్తున్నాను. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ దగ్గర బాలానగర్ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్, బర్కత్‌పురాలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించండి. అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లలను చదివిస్తున్నారని సంబర పడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తూ ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారు. పైగా వాళ్లను టెన్త్ తర్వాత చదివించరు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపవుట్లు మొదలవుతుంటాయి. పెళ్లి చేసేయడం అన్నింటికీ పరిష్కారం అన్నట్లు ఉంటాయి పేరెంట్స్ ఆలోచనలు. ఆ ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటారంటే... క్షణాల్లో చక్కగా బొమ్మలు వేసే వాళ్లున్నారు. వాళ్లకు చాక్లెట్ తయారీ, పెయింటింగ్, ప్రింటింగ్ వంటి మాకు తెలిసిన స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఎనభై శాతం మార్కులతో పాసైన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ అడాప్షన్ చేస్తున్నాం. వీవర్స్ కుటుంబం నుంచి కూడా విద్యాదత్తత చేసుకున్నాం. తొలి అడ్డంకి గడప లోపలే ఎవరైనా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలంటే కుటుంబం ప్రోత్సాహం తప్పనిసరి. చాలామంది ఆడవాళ్లకు ఇంట్లో సాటి ఆడవాళ్ల నుంచే మద్దతు కరవవుతోంది. తొలి అడ్డంకి ఇంట్లోనే ఎదురవుతోంది. ఈ విషయంలో మహిళలు ఇంట్లో వాళ్లతో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేసుకోవడమే కరెక్ట్. ఆ తొలి మెట్టులో విజయం సాధించగలిగితే ఇక ఆమె ప్రస్థానంలో ఎదురీతలు పెద్దగా ఉండవు. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు మమతా త్రివేది. ఆమె చేస్తున్న సేవలో తొలి ప్రయోజకులుగా మహిళలు కనిపిస్తున్నప్పటికీ ఆ ఫలితం కుటుంబానికి ఉపయోగపడుతుందంటారామె. అందుకే సమాజానికి తాను తిరిగి ఇస్తున్న ప్రయోజనాలకు వారధులుగా మహిళలనే ఎంచుకున్నానన్నారు. తరాల కలనేత పోచంపల్లికి వెళ్లి చేనేతకారుల కుటుంబాలను చూస్తే కన్నీరు వస్తుంది. భార్యాభర్త నెలంతా కష్టపడితే వాళ్లకు వచ్చేది పదిహేను వేల రూపాయలే. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్లో ఏ ధరకు అమ్ముడవుతాయో కూడా వాళ్లకు సరైన అంచనా లేదు. వాళ్లకు తగినంత పని కల్పించడానికి, మంచి రాబడినివ్వడానికి గాను... నేను నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్‌లలో తప్పనిసరిగా ట్రెడిషనల్ వేర్ ఉండేటట్లు చూస్తున్నాను. ఇటీవల ర్యాంప్ వాక్ కూడా అక్కడే ఏర్పాటు చేశాను. ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా మరో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. నాకు స్వతహాగా కూడా చేనేత చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకున్న ఈ చీరను చూడండి. అరవై ఏళ్ల నాటిది. మా అత్తగారి చీర. ఇప్పటికీ అదే మెరుపు. అందుకే ఈ కళను బతికించుకోవాలి. – మమతా త్రివేది, ఫౌండర్, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ రీజనల్ డైరెక్టర్, మిసెస్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఫ్రెండ్లీ సిటీ
అమెరికామ్యారీలాండ్లో నవంబర్ 19న జరిగే మిసెస్ ఇండియా కాంటెస్ట్‌కు అర్హత దక్కించుకున్న ఇండోర్ సుందరి... కోమల్ కల్రా పగరాణి శనివారం సిటీకి వచ్చింది. అపోలో ఆసుపత్రిలో, అబిడ్స్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘యుక్త వయసు నుంచి మోడలింగ్‌పై ఉన్న ఆసక్తి తనను గ్లామర్ రంగంలోకి రప్పించింద’ని ఈ సందర్భంగా చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల 21ఏళ్లకే పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఆసక్తిని గమనించిన భర్త తనకెంతో మద్దతుగా నిలుస్తున్నారని, అందువల్లే తాను మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ తదితర టైటిల్స్ సాధించి, ఇప్పుడు మిసెస్ ఇండియాకు సిద్ధమవగలుగుతున్నానంది. అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరపున పాల్గొనడమే ఓ గొప్పతనమంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకొచ్చే పేరు ప్రతిష్టలను సమాజసేవకు ఉపయోగించాలనేదే తన ఆశయమంది. బాలీవుడ్ ఆఫర్స్ వస్తే.. ఆచితూచి ఎంచుకుంటానంది. హైదరాబాద్‌కు గతంలోనూ వచ్చానంటున్న కోమల్... సిటీలో సన్నిహిత మిత్రులు ఉన్నారని వెల్లడించింది.