పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది.
‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్‌ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్‌మెంట్స్‌తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్‌లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్‌లలో పాల్గొని అధ్యయనాల పేపర్‌లు సమర్పించారు.
కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు.
అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి.
నాన్న నేర్పిన విలువలు
‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్‌లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్‌లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను.
నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్‌లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది.
ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్‌లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్‌లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను.
బాల్య స్నేహితురాలి చొరవ
బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్‌లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్‌లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి.
నేనే ఉదాహరణ
అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి.
పర్వతం పెద్ద చాలెంజ్
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్‌లో వచ్చింది. అక్కడ గ్లేసియర్‌లు, ట్రెకింగ్ జోన్‌లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది.
నా పేషెంట్‌ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్‌లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment