ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా? | TS High Court Serious COmments On Government Over Corona | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?

Published Fri, Aug 14 2020 1:00 AM | Last Updated on Fri, Aug 14 2020 10:02 AM

TS High Court Serious COmments On Government Over Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలకు సంబం ధించి ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం కన్నా అవే బలమైనవిగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలకు, చికిత్సలకు నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ప్రైవేటు ఆస్పత్రులు పట్టిం చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. ఇంత నిర్లక్ష్యంగా, లాభాపేక్షతో వ్యవహరిస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి రాయితీ, లీజు పద్ధతిలో భూములు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు ఒప్పందం మేరకు పేదలకు ఉచితంగా వైద్యం చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. రాయి తీగా ఇచ్చిన భూమిని, లీజుకు ఇచ్చిన భూమిని ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవడంలేదని అడిగింది. అసలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏం జరుగు తోందని ప్రభుతాన్ని ప్రశ్నించింది.

కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని, ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, కరోనా చికిత్సలు అంది స్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర శానిటరీ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకోవాలని.. ఇలా దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్య దర్శి డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మా సనం ముందు హాజరయ్యారు. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమి స్తోందని, ఎందరో అధికారులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని సోమేశ్‌కుమార్‌ వివరించారు. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

2 వారాల్లో అమలు చేయాలి
గతంలో తామిచ్చిన ఆదేశాలను 95 శాతం వరకు అమలు చేశారని, ప్రభుత్వ పనితీరు బాగుందని, ఇంకా మిగిలిన 5 శాతం ఆదేశాలను కూడా రెండు వారాల్లో అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో తెలంగాణ ఇతర రాష్ట్రా లకు ఆదర్శంగా నిలవాలని, దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. తాము ప్రభుత్వాన్ని కించపర్చడం, తక్కువ చేసి మాట్లాడడం చేయడంలేదని.. అందరం కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాం క్షతో పనిచేద్దామని సూచించింది. తదుపరి విచార ణకు సీఎస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం చిన ధర్మాసనం.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం హాజరుకావాలని పేర్కొంటూ సెప్టెంబర్‌ 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది."

ఆ టెస్టుల కచ్చితత్వం ఎంత ?
‘‘ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల కచ్చితత్వంపై మాకు అనుమానాలున్నాయి. 40 శాతం వరకే వీటిని విశ్వ సించాలనే వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి పరీక్ష చేసినా నెగెటివ్‌ అని వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టుల కచ్చితత్వంపై మా అను మానాలను నివృత్తి చేయండి’’అని ధర్మాసనం ఆదేశించింది. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి యాంటిజెన్‌ టెస్టు చేస్తే 100 శాతం పాజిటివ్‌ అనే వస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఐసీఎంఆర్‌ సైతం యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని చెబుతోందని, ఇతర రాష్ట్రాలు సైతం పాజిటివ్‌ కేసులను గుర్తిం చేందుకు ఈ టెస్టుల మీదనే ఆధారపడ్డాయని పేర్కొన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ సంఖ్య 650కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చేందుకు రూ.12 కోట్లు కూడా విడుదల చేసినట్టు వెల్లడించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 86 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామనే విషయాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాం’’అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు.

ధర్మాసనం ఆదేశాల్లో ఇంకా ఏమున్నాయంటే

  • కరోనా టెస్టులు చేయించుకుంటున్న వారిలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఎన్ననే వివరాలతో పాటు పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలు ఉన్న వారెందరు? లక్షణాలు లేనివారెందరు? వంటి వివరాలను మీడియా బులెటిన్‌లో చెప్పాలి. 
  • పేద ప్రజలు ఐసోలేషన్‌లో ఉండేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్ల సమాచా రాన్ని మీడియా బులెటిన్‌లో ప్రకటించాలి. ఏ కేంద్రంలో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నా యో తెలియజేయాలి.
  •  ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ మీద వస్తున్న ఫిర్యా దులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. పదే పదే జీవోలను ఉల్లంఘిస్తుంటే ఆయనా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని బెడ్స్‌ను పేదలకు కేటాయించేలా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన తరహాలో ప్రభుత్వం ఇక్కడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆదేశాలు ఇవ్వలేకపోతే కారణాలు ఏంటి?
  •  రసూల్‌పురాలోని హాకీ స్టేడియాన్ని, ఇతర స్టేడి యాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చే అం శాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి.


మరింత సమర్థంగా చేస్తారనే...
‘‘ఓ కంసాలి.. తన కుమారుడు ఎంత మంచిగా నగ తయారు చేసినా తండ్రి ఏదో లోపముందనేవాడు. ఒక రోజు భార్య భర్తను అడిగింది. మన బిడ్డ ఎంత మంచిగా నగను తయారుచేసినా ఏదో ఒక లోపం ఉందంటున్నారు. ఎందుకిలా అని ప్రశ్నించింది. ఆ నగ సరిగా లేదని కాదు. ఇంకా మంచిగా తయారు చేస్తాడనే.. లోపాన్ని ఎత్తి చూపానని చెప్పాడు ఆ తండ్రి. అలా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని కాదు.. మరింత సమర్థవంతంగా ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే లోపాలను ఎత్తి చూపుతూ, వాటిని సరిదిద్దుతారనే ఈ ఆదేశాలు జారీచేస్తున్నాం. పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేసి ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిన అవసరం ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement