ధరలు నిర్ణయించి జీవో ఇవ్వండి: హైకోర్టు | HC Orders Government To Issue A GO Regarding COVID Treatment Charges | Sakshi
Sakshi News home page

ధరలు నిర్ణయించి జీవో ఇవ్వండి: హైకోర్టు

Published Tue, May 18 2021 3:37 AM | Last Updated on Tue, May 18 2021 3:43 AM

HC Orders Government To Issue A GO Regarding COVID Treatment Charges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా చేస్తున్న సీటీ స్కాన్, ఇతర పరీక్షలకు, పీపీఈ కిట్స్‌కు గరిష్ట ధరను నిర్ణయించకుండా... వీటిని మినహాయిస్తూ గత ఏడాది జీవో ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌లో సీటీ స్కాన్‌తోపాటు ఇతర రక్తపరీక్షలు వ్యాధి నిర్ధారణకు కీలకంగా మారిన నేపథ్యంలో, 48 గంటల్లో ఈ పరీక్షలకు, పీపీఈ కిట్స్‌కు, వైద్య చికిత్సలకు ధరలను నిర్ణయించి తాజాగా జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ జీవోను వెబ్‌సైట్‌లో అప్‌ లోడ్‌ చేయాలని, రోగులు, వారి సహాయకులకు తెలిసేలా అన్ని ఆసుపత్రుల నోటీసు బోర్డుల్లో ఉం చాలని స్పష్టం చేసింది.

తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో చర్చించి ఈ ధరలను నిర్ణయించాలని సూచించింది. ప్రై వేటు ఆసుపత్రుల చికిత్సలు, ఫీజుల దోపిడీపై ఫిర్యాదు చేసేందుకు వెంటనే వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని, ఈ విషయాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు ప్రసార మాధ్య మాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఫిర్యాదుల విచారణకు కరోనా మొదటి దశ సందర్భంగా ఏర్పాటు చేసినట్టే ఇప్పుడు కూడా ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌పై వాస్తవ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు విచారణకు హాజరయ్యారు. కాగా ఈనెల 14న పాతబస్తీలో జన సమూహం లేకుండా చూడడంతోపాటు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారంటూ ఈ ముగ్గుర్నీ ధర్మాసనం అభినందించింది. ఇదే తరహాలో ఇక ముందు కూడా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించింది.  

భౌతికదూరం పాటించేలా చూడండి 
ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య మార్కెట్లకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని, భౌతికదూరం పాటించడం లేదని సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ కోర్టుకు నివేదించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. దీంతో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, తగిన సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేయాలని డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.  

అనాథలను ఎలా ఆదుకుంటారు? 
కరోనాతో తల్లిదండ్రులు మృత్యువాతపడి వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారని, అటువంటి చిన్నారులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుటుంబం మొత్తం కరోనా తో చికిత్స పొందుతుంటే.. వారికి ఉచితంగా భోజ నం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలని ఆదేశించింది. కరోనా చికిత్స తర్వాత పలువురు రోగులు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్న నేపథ్యంలో రోగులకు అందిస్తున్న చికిత్సలు, మం దులు ఎలా సమకూరుస్తున్నారు ? తదితర వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది. అలాగే గతంలో తామిచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ఆదేశించింది.  

గర్భిణులకు వైద్యం అందేలా చూడండి 
గర్భిణులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్‌సహా ఇతర చికిత్సల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ గర్భిణి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోలేదన్న కారణంగా పలు ఆసుపత్రులకు తిరిగినా అడ్మిషన్‌ఇవ్వకపోవడంతో మృత్యువాతపడిన విషయాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ప్రస్తావించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తాము అప్పట్లోనే ఆదేశించినా, గర్భిణులు ఇప్పటికీ చికిత్స అందక మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష రిపోర్టు అడగకుండా గర్భిణులకు అడ్మిషన్‌ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఇటీవల గర్భిణి మృతికి బా«ధ్యులెవరన్న దానిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.  

స్టెరాయిడ్స్‌ తొలగించండి 
కరోనా చికిత్సలో భాగంగా స్వల్ప లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న మందుల కిట్‌లో స్టెరాయిడ్స్‌ కూడా ఉంటున్నాయని, రోగిని పరీక్షించకుండా స్టెరాయిడ్స్‌ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టెరాయిడ్స్‌ వాడడం ద్వారా దుష్పలితాలు ఉంటాయని, బ్లాక్‌ ఫంగస్‌ లాంటి వ్యాధులబారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మందుల కిట్లలో స్టెరాయిడ్స్‌ లేకుండా చూడాలని ఆదేశించింది.  

లక్ష టెస్టుల ఆదేశాలు అమలు కావడం లేదు 
రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని, పరీక్షల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని, ఇటీవల 65 వేలకు మించి పరీక్షలు చేయడం లేదంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. 

హైకోర్టు మరికొన్ని ఆదేశాలు

  • కరోనా మూడో దశ ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడో దశ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయండి.  
  • ఇతర రాష్ట్రాలు నిర్వహిస్తున్న తరహాలో డ్రైవ్‌ ఇన్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టండి. 
  • 45 ఏళ్లు దాటిన వారితోపాటు 18–45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోండి.  
  • ప్రాణాలకు తెగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే ఎలా ? వెంటనే వారికి జీతాలు చెల్లించండి. 
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వాసితులను జూన్‌30 వరకు ఖాళీ చేయించొద్దు. ఈ మేరకు గత నెల ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.  
  • హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి వలస కార్మికులతో పాటు అవసరమైన వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయండి.  
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహాలో జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చే ఫిర్యా దులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.  
  • గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణకు సంబంధించి మొబైల్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయండి. 

ఆక్సిజన్‌ కోటా పెంచాం 
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద మొత్తంలో రోగులు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోటాను పెంచా మని కేంద్రం హైకోర్టుకు నివేదించింది. ఆక్సిజన్‌ను 450 మెట్రిక్‌ టన్నుల నుంచి 650 మెట్రిక్‌ టన్నులకు, ఇంజక్షన్లు రోజుకు 5,500 నుంచి 10 వేలకు పెంచామని అదనపు సొలి సిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి నివేదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement