నల్లకుంట (హైదరాబాద్): ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. కోర్టు నుంచి ఆర్డర్ కాపీ అందలేదని, అందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు. ఎయిర్‌పోర్టులో అందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచాల్సిందిగా సీఎం చెప్పినట్లు తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఈఎల్) సహకారంతో విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి (డీడీహెచ్)లో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐసీయూ భవనం, ఆపరేషన్ థియేటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎంఈఈఎల్ డైరెక్టర్లు పి.సుధారెడ్డి, పి.రమారెడ్డి, డీడీహెచ్ ఆర్సీ చైర్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు. మహిళల విద్య కోసం స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఎంతో కృషి చేశారని, ఆమె ఆశయాలను అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు.
నెల లేదా 2 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు
ఫ్రంట్‌లైన్ వారియర్లకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు, చిన్నపిల్లలకు టీకా వేసే విషయమై కేంద్రం స్పందించడం లేదని మంత్రి చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని, ఆ సందర్భంగా మరోసారి కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో లేకుండా ఇక నుంచి నెల లేదా రెండు నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment