వికటిస్తే విరుగుడు | Corporate hospitals healing | Sakshi
Sakshi News home page

వికటిస్తే విరుగుడు

Published Wed, Jul 22 2015 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

వికటిస్తే విరుగుడు

వికటిస్తే విరుగుడు

చేయూతనివ్వాల్సింది... చేటుతెచ్చారు...
 
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అంటే లక్షల్లో ఖర్చు తప్పనిసరి. అంత ఖర్చు భరించినా... అక్కడా మోసం జరిగితే ఎవరిని అడగాలి?! కేతిరి సాయిరెడ్డి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్‌లో వ్యాధికి తగిన వైద్యం చేయని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యంపై అతను ఎలాంటి పోరాటం చేశారో ఆయన మాటల్లోనే...

 భుజం నొప్పి అని ఆసుపత్రికి వెళితే...
 ‘‘ఓ రోజు అర్ధ్దరాత్రి.. కుడి భుజం నుంచి చేతి వరకు విపరీతమైన నొప్పి. తెల్లవార్లూ నొప్పిని ఓర్చుకుని, ఇక భరించలేక హైదరాబాద్‌లోని ఓ పెద్ద హాస్పిటల్‌కి వెళ్లాను. మంచి అనుభవజ్ఞుడనే పేరున్న న్యూరో ఫిజీషియన్ వచ్చారు. అన్ని చెకప్‌లూ చేశారు. వారు తేల్చి చెప్పినదేంటంటే.. ‘ఇది చాలా అరుదుగా వచ్చే గులియన్‌బ్యారీ సిండ్రోమ్’ అని. శరీరంలో ఒక్కో అవయం చచ్చుపడేలా చేయడం ఆ వ్యాధి లక్షణం అని చెప్పారు. చాలా భయపడ్డాను. ఇతర మందులతో పాటు ఐదు రోజుల పాటు ఐదు ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.7,500లు. చెప్పినట్టే చేయించుకున్నాను. మూడు నెలలు ఫిజియోథెరపీ అవసరం అంటే, అన్ని రోజులూ ఫిజియోకేర్‌లో చేరాను. చెప్పినవన్నీ వాడాను. చెయ్యమన్నవన్నీ చేశాను. అయినా ఫలితం లేదు. మళ్లీ అదే ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స తీసుకున్నాను. ఏడాది పాటు... ఇలాగే గడిచింది.

 ఒక సమస్యకు బదులు మరో సమస్య...
 మా స్నేహితుడు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడు. నన్ను కలవడానికి వచ్చి, రిపోర్టులు చూశాడు. ‘ఇది స్పాండిలోసిస్ సమస్య, ట్రీట్‌మెంట్ తప్పుగా జరిగింది. మెడలో ఉండో నరాలు కంప్రెషన్‌కు లోనయితే ఇలాంటి నొప్పి వస్తుంది’ అన్నాడు. నమ్మబుద్ధి కాలేదు. మా స్నేహితుడే మరో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అతను కూడా అదే నిర్ధారించాడు. ‘ఏడాది క్రితం కార్పొరేట్ హాస్సిటల్‌లో తీసిన ఎక్స్‌రేలో కూడా ఇదే విషయం స్పష్టంగా చూపుతోంది’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాను. తర్వాత, వాళ్లు చెప్పిన ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. మొదట్లో సరైన వైద్యం అందకపోవడం వల్లే చెయ్యికి బలం లేకుండా పోయింది. ఆ ప్రభావం వల్ల అన్నం కూడా సరిగ్గా కలుపుకొని తినలేను. ఏం చేయాలి? ఏడాది పాటు నేను అనుభవించిన నరకం, మానసిక క్షోభ, డబ్బు ఖర్చు...ఎంతో నమ్మకం మీద పెద్ద ఆసుపత్రిలో చేరితే ఇలా జరిగింది.

ఫోరంలో కేసు...
కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన అన్ని రిపోర్టులను, బిల్లులను జత చేసి, వినియోగదారుల ఫోరంలో కేసు వేశాను. స్టేట్ కమిషన్ ఉస్మానియా వైద్యులతో చర్చించింది. మొదటి రిపోర్ట్‌లోనే ఎలాంటి సమస్య ఉందో తేల్చింది. వెంటనే రూ.25,000 లు ఆసుపత్రి నుంచి నష్టపరిహారం అందేలా చూసింది. అయితే నేను  అనుభవించిన క్షోభకు ఇది పెద్ద అమౌంట్ కాదు. అందుకని జాతీయ వినియోగదారుల ఫోరంలో మళ్లీ కేసు వేశాను. అక్కడ 2 లక్షల రూపాయల ఫైన్ ఆసుపత్రికి వేసి, ఆ మొత్తం నాకు వచ్చేలా చేసింది. ఇందుకు 5-6 ఏళ్ల పాటు సమయం పట్టింది. కానీ, జరిగిన నష్టానికి కొంతైన పరిహారం అందింది. భయపడకుండా న్యాయం కోసం పోరాడితే మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.’’
 - కేతిరి సాయిరెడ్డి, కరీంనగర్
 
 మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే...
 వెంటనే వినియోగదారుల ఫోరమ్‌కి ఫిర్యాదు చేయండి. వినియోగదారుల హక్కుల రక్షణకు, పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వినియోగదారుల రక్షణ మండళ్లను ఏర్పాటు చేశారు.
 
 ఎలా ఫిర్యాదు చేయాలంటే...
వస్తు, సేవలు పొందిన రోజు నుండి రెండు సంవత్సరాలలోగా ఫిర్యాదును దాఖలు  చేయవచ్చు.ఫిర్యాదు పత్రంలో ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి, నిందితుల వివరాలు సమగ్రంగా పేర్కొనాలి. బాధితుడు తనకు జరిగిన నష్టంపై వివరించాలి. నష్టాన్ని ధ్రువపరిచే పత్రాలను, బిల్లులను ఐదు సెట్లు తయారు చేసి, ఫిర్యాదు దరఖాస్తుతో జతచేయాలి. ఏ మేరకు నష్టపరిహారాన్ని కోరుతున్నామో స్పష్టంగా రాయాలి. జిల్లాఫోరంలో అయితే లక్ష రూపాయల లోపు నష్టపరిహారానికి రూ.100లు, ఐదు లక్షల లోపు అయితే రూ.200, పది లక్షల లోపు అయితే రూ.400, అదే 20 లక్షల లోపు అయితే 500 చొప్పున రుసుం చెల్లించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement