వాగు ఒడ్డునే ప్రసవించిన ఆదివాసీ మహిళ.. పుట్టిన గంటకే బిడ్డ
కన్నుమూత.. మరో రెండు ఘటనల్లో యువకుడు, వృద్ధురాలు..
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..
రెండు ప్రాణాలు మోస్తూ..
ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది.
అంబులెన్స్ వచ్చే దారిలేక..
మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు.
సకాలంలో వైద్యం అందక..
వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment