Streams overflow
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
తండ్రి మృతదేహాన్ని 20 కి.మీ. మోసుకెళ్లి..
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని ఆయన కుమారులు 20 కిలోమీటర్లు జట్టీలపై మోసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పంచాయతీ పరిధి ఆర్లపెంట గ్రామానికి చెందిన రవ్వా భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను తొలుత భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచగా రానురాను ఖర్చు పెరగడంతో కుమారులు సుక్మా జిల్లా పాలచల్మలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న భీముడు సోమవారం మృతి చెందాడు. అయితే, పాలచల్మ నుంచి స్వగ్రామమైన ఆర్లపెంట 20 కి.మీ. దూరం ఉండగా మార్గమధ్యలో పలుచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భీముడి కుమారులిద్దరు జట్టీ కట్టి తమ తండ్రి మృతదేహాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలోనుంచి జోరువానలో 20 కి.మీ. మేర నడుస్తూ తీసుకెళ్లారు. ఆర్లపెంట చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలకు వరద అడ్డంకి నిండుగా ప్రవహిస్తున్న ప్రాణహిత వేమనపల్లి: ఆఖరి మజిలీకి వరద అడ్డొచ్చింది. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామం ఉన్నా నిరుపయోగంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో వగావత్ సాలక్క, ఎల్లెల గంగయ్య వృద్ధాప్యంతో మృతిచెందారు. వేమనపల్లిలో వైకుంఠధామం ఉన్నా నీళ్లు, కరెంటు, బాత్రూం సౌకర్యాలు లేక, శిథిలావస్థకు చేరి నిరుపయోగంగానే మారింది.ఎవరూ అక్కడ అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లరు. ప్రాణహిత నదికి తీసుకెళ్లి అంతిమ సంస్కారా లు నిర్వహిస్తుంటారు. కాగా, నాలుగు రోజులుగా ప్రాణహిత నది నిండుగా ప్రవ హిస్తోంది. సోమవారం పుష్కరఘాట్, రోడ్డుపూర్తిగా మునిగిపోవడంతో నదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం గంగయ్యను కుటుంబీకులు మత్తడివాగు వైపు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగా.. సోమవారం సాలక్క మృతదేహాన్ని సైతం అటువైపే తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంపుడొర్రె వరకు ప్రాణహిత ముంపు నీరు ఆవరించి ఉండటంతో మృతదేహంతో అంపుడొర్రె దాటి అవతలి వైపు వెళ్లారు. మత్తడి ఒర్రెలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.వరద ‘గుండాల’ గుండాల: అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పని ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుంటూ ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. మండలంలోని గుండాల – కొడవటంచ గ్రామాల మధ్య లోలెవెల్ వంతెన ఉన్నా.. వరదలు పెరగడంతో దానిపై నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కొడవటంచ గ్రామస్తులు అధికారుల కళ్లుగప్పి ఇలా ఏడుమెలికల వాగు దాటుకుంటూ వెళ్లాల్సి వచి్చంది. తప్పని డోలీ ఇక్కట్లు జ్వరంతో ఉన్న మహిళను మూడు కిలోమీటర్లు మోసుకుంటూ.. ఆ తర్వాత అంబులెన్స్‌లో భద్రాచలం ఆస్పత్రికి తరలింపు బూర్గంపాడు: వానాకాలం వచి్చందంటే ఆ గ్రామస్తులకు డోలీల ఇక్కట్లు తప్పడం లేదు. జబ్బు చేసినా, ఏదైనా ఆపద వచి్చనా డోలీ కట్టాల్సిందే. సరైన రహదారి లేక వారు కష్టపడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీకాలనీకి చెందిన సొడే రాజు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే గ్రామస్తులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకొచి్చ, ఆ తర్వాత ఆటోలో భద్రాచలం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.మళ్లీ అదే గ్రామంలోని నర్సమ్మ అనే మహిళ జ్వరం బారిన పడగా సోమవారం ఆమెను కుటుంబసభ్యులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. సమాచారం తెలిసిన బూర్గంపాడు ఎస్సై రాజేశ్ స్పందించి వెంటనే అంబులెన్స్‌ను పంపించగా అందులో నర్సమ్మను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సహకారంతో తమకు కొంతమేర డోలీ బాధ తప్పిందని బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏకు కూతవేటు దూరంలోనే ఉన్న తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అంబులెన్స్ లేక.. మోటారు బైక్‌పై...రాజవొమ్మంగి: అభాగ్యురాలైన ఓ గిరిజన మహిళ ఆస్పత్రిలో కన్నుమూస్తే ఆమెను మోటారుసైకిల్‌పై ఇంటికి తరలించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జరిగింది. మిరియాలవారి వీధి గ్రామానికి చెందినకుంజం అన్నపూర్ణ (60) అనారోగ్యంతో సోమవారం జడ్డంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది.పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహాన్ని తరలించేవారు కరువయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక జడ్డంగి లారీఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణజాల మల్లికార్జున్ చొరవచూపి మృతదేహాన్ని యువకుల సహాయంతో మోటారు సైకిల్‌పై 5 కిలోమీటర్ల దూరంలోని మిరియాలవారి వీధి గ్రామానికి చేర్చారు. -
'మేం వాగులో చిక్కుకున్నాం.. కాపాడండి'
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అలగ వాగులో చిక్కుకున్న ఇద్దరిని పోలీసులు స్థానికుల సహాయంతో శుక్రవారం రాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వివరాలు.. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన భాస్కర్, తేజేశ్వర్‌రెడ్డిలు కారులో మాచర్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామం వద్ద అలగ వాగు దాటుతూ వరద నీరు ఉధృతం కావడంతో వాగులో చిక్కుకుపోయారు. దీంతో డయల్ 100కు కాల్ చేసి 'మేము అలగ వాగులో చిక్కుకున్నాం.. దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ పోలీసులకు తెలిపారు. ఇదే సమయంలో కొందరు స్థానికులు గమనించి వాగులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పాణ్యం సీఐ జీవన్ గంగనాథ్ బాబు, నందివర్గం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, గోస్పాడు ఎస్ఐ నిరంజన్‌రెడ్డి , ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో ఉన్న ఇద్దరిని వాగులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
పొంగుతున్న వాగులు
సాక్షి, గుండాల: రెండు రోజుల క్రితం వరకు అప్పుడప్పుడు పలకరించిన వర్షాలు శుక్రవారం నుంచి ఉధృతరూపం దాల్చాయి. శుక్ర, శనివారాల్లో కుండపోతగా వర్షం కురియడంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గుండాల మండలంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికల వాగు, దున్నపోతుల వాగు, నడివాగు, జల్లేరు తదితర వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాయనపల్లి, ఘనాపురం, చిన్న వెంకటాపురం, దామరతోగు, ఎలగలగడ్డ, తక్కెళ్లగూడెం, కొమ్ముగూడెం, చెట్టుపల్లి పంచాయతీలోని 8 గ్రామాలు, గుండాల పంచాయతీలో నర్సాపురం, రోళ్లగడ్డ, తండా, దేవళ్లగూడెం, కన్నాయిగూడెం, నర్సాపురం తండా, నాగారం, నడిమిగూడెం, వలసల్ల, సజ్జలబోడు, దొంగతోగు, ఆళ్లపల్లి మండలంలో ³ద్దూరు, నడిమిగూడెం, బోడాయికుంట, అడవిరామారం, ఇప్పనపల్లి, జిన్నెలగూడెం, కర్నిగూడెం, సందిబంధం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లేందుకు వాగులు దాటలేక ఆయా గ్రామాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. బూర్గంపాడులో... బూర్గంపాడు: రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు బూర్గంపాడు మండలంలో జనజీవనం స్తంభించింది. మండల పరిధిలోని పెదవాగు, దోమలవాగు, పులితేరు, ఎదుర్లవాగు, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి పత్తిచేలు కోతకు గురయ్యాయి. సారపాకలోని సుందరయ్యనగర్, చండ్ర పుల్లారెడ్డినగర్లలో వర్షపునీరు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 45.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అశ్వాపురం మండలంలో 15.5 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదవాగుకు పోటెత్తిన నీరు అశ్వారావుపేట: వారం రోజులుగా చిరుజల్లులు పడుతూ శనివారం తెల్లవారుజాము నుంచి ఉధృతమైన వర్షంతో చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులోని పెదవాగు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 6 మీటర్లు కాగా శనివారం సాయంత్రానికే 2.5 మీటర్ల మేర వదరనీరు వచ్చి చేరింది. వర్షం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచి నీటిని గోదావరిలోకి వదలాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. రోజంతా వర్షంతో పట్టణంలో సెలవు వాతావరణం కనిపించింది. శనివారం మొత్తంగా 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వారు పేర్కొన్నారు. ఈ వర్షం పత్తి పంటకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే అన్ని రకాల పంటలకు మేలని అంటున్నారు. -
పొంగి పొర్లుతున్న తీగలవర్రే వాగు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బెజ్జూరు మండలం సలుగుపల్లి వద్ద తీగలవర్రే వాగు మరింత ఉదృతంగా ప్రవహిస్తుంది. దాంతో వాగు పరిసర ప్రాంతాలలోని 12 గ్రామాలకు చెందిన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 12 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.