ఛత్తీస్‌గఢ్‌లో వరద ఇక్కట్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని ఆయన కుమారులు 20 కిలోమీటర్లు జట్టీలపై మోసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పంచాయతీ పరిధి ఆర్లపెంట గ్రామానికి చెందిన రవ్వా భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఆయనను తొలుత భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచగా రానురాను ఖర్చు పెరగడంతో కుమారులు సుక్మా జిల్లా పాలచల్మలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న భీముడు సోమవారం మృతి చెందాడు. అయితే, పాలచల్మ నుంచి స్వగ్రామమైన ఆర్లపెంట 20 కి.మీ. దూరం ఉండగా మార్గమధ్యలో పలుచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భీముడి కుమారులిద్దరు జట్టీ కట్టి తమ తండ్రి మృతదేహాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలోనుంచి జోరువానలో 20 కి.మీ. మేర నడుస్తూ తీసుకెళ్లారు. ఆర్లపెంట చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియలకు వరద అడ్డంకి నిండుగా ప్రవహిస్తున్న ప్రాణహిత
వేమనపల్లి: ఆఖరి మజిలీకి వరద అడ్డొచ్చింది. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామం ఉన్నా నిరుపయోగంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో వగావత్ సాలక్క, ఎల్లెల గంగయ్య వృద్ధాప్యంతో మృతిచెందారు. వేమనపల్లిలో వైకుంఠధామం ఉన్నా నీళ్లు, కరెంటు, బాత్రూం సౌకర్యాలు లేక, శిథిలావస్థకు చేరి నిరుపయోగంగానే మారింది.
ఎవరూ అక్కడ అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లరు. ప్రాణహిత నదికి తీసుకెళ్లి అంతిమ సంస్కారా లు నిర్వహిస్తుంటారు. కాగా, నాలుగు రోజులుగా ప్రాణహిత నది నిండుగా ప్రవ హిస్తోంది. సోమవారం పుష్కరఘాట్, రోడ్డుపూర్తిగా మునిగిపోవడంతో నదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం గంగయ్యను కుటుంబీకులు మత్తడివాగు వైపు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగా.. సోమవారం సాలక్క మృతదేహాన్ని సైతం అటువైపే తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంపుడొర్రె వరకు ప్రాణహిత ముంపు నీరు ఆవరించి ఉండటంతో మృతదేహంతో అంపుడొర్రె దాటి అవతలి వైపు వెళ్లారు. మత్తడి ఒర్రెలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
వరద ‘గుండాల’
గుండాల: అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పని ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుంటూ ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. మండలంలోని గుండాల – కొడవటంచ గ్రామాల మధ్య లోలెవెల్ వంతెన ఉన్నా.. వరదలు పెరగడంతో దానిపై నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కొడవటంచ గ్రామస్తులు అధికారుల కళ్లుగప్పి ఇలా ఏడుమెలికల వాగు దాటుకుంటూ వెళ్లాల్సి వచి్చంది.
తప్పని డోలీ ఇక్కట్లు
జ్వరంతో ఉన్న మహిళను మూడు కిలోమీటర్లు మోసుకుంటూ..
ఆ తర్వాత అంబులెన్స్‌లో భద్రాచలం ఆస్పత్రికి తరలింపు
బూర్గంపాడు: వానాకాలం వచి్చందంటే ఆ గ్రామస్తులకు డోలీల ఇక్కట్లు తప్పడం లేదు. జబ్బు చేసినా, ఏదైనా ఆపద వచి్చనా డోలీ కట్టాల్సిందే. సరైన రహదారి లేక వారు కష్టపడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీకాలనీకి చెందిన సొడే రాజు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే గ్రామస్తులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకొచి్చ, ఆ తర్వాత ఆటోలో భద్రాచలం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
మళ్లీ అదే గ్రామంలోని నర్సమ్మ అనే మహిళ జ్వరం బారిన పడగా సోమవారం ఆమెను కుటుంబసభ్యులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. సమాచారం తెలిసిన బూర్గంపాడు ఎస్సై రాజేశ్ స్పందించి వెంటనే అంబులెన్స్‌ను పంపించగా అందులో నర్సమ్మను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సహకారంతో తమకు కొంతమేర డోలీ బాధ తప్పిందని బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏకు కూతవేటు దూరంలోనే ఉన్న తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
అంబులెన్స్ లేక.. మోటారు బైక్‌పై...
రాజవొమ్మంగి: అభాగ్యురాలైన ఓ గిరిజన మహిళ ఆస్పత్రిలో కన్నుమూస్తే ఆమెను మోటారుసైకిల్‌పై ఇంటికి తరలించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జరిగింది. మిరియాలవారి వీధి గ్రామానికి చెందినకుంజం అన్నపూర్ణ (60) అనారోగ్యంతో సోమవారం జడ్డంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహాన్ని తరలించేవారు కరువయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక జడ్డంగి లారీఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణజాల మల్లికార్జున్ చొరవచూపి మృతదేహాన్ని యువకుల సహాయంతో మోటారు సైకిల్‌పై 5 కిలోమీటర్ల దూరంలోని మిరియాలవారి వీధి గ్రామానికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment