ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు
సాక్షి, గుండాల: రెండు రోజుల క్రితం వరకు అప్పుడప్పుడు పలకరించిన వర్షాలు శుక్రవారం నుంచి ఉధృతరూపం దాల్చాయి. శుక్ర, శనివారాల్లో కుండపోతగా వర్షం కురియడంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గుండాల మండలంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికల వాగు, దున్నపోతుల వాగు, నడివాగు, జల్లేరు తదితర వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
సాయనపల్లి, ఘనాపురం, చిన్న వెంకటాపురం, దామరతోగు, ఎలగలగడ్డ, తక్కెళ్లగూడెం, కొమ్ముగూడెం, చెట్టుపల్లి పంచాయతీలోని 8 గ్రామాలు, గుండాల పంచాయతీలో నర్సాపురం, రోళ్లగడ్డ, తండా, దేవళ్లగూడెం, కన్నాయిగూడెం, నర్సాపురం తండా, నాగారం, నడిమిగూడెం, వలసల్ల, సజ్జలబోడు, దొంగతోగు, ఆళ్లపల్లి మండలంలో ³ద్దూరు, నడిమిగూడెం, బోడాయికుంట, అడవిరామారం, ఇప్పనపల్లి, జిన్నెలగూడెం, కర్నిగూడెం, సందిబంధం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
విత్తనాలు, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లేందుకు వాగులు దాటలేక ఆయా గ్రామాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి.
బూర్గంపాడులో...
బూర్గంపాడు: రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు బూర్గంపాడు మండలంలో జనజీవనం స్తంభించింది. మండల పరిధిలోని పెదవాగు, దోమలవాగు, పులితేరు, ఎదుర్లవాగు, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి పత్తిచేలు కోతకు గురయ్యాయి. సారపాకలోని సుందరయ్యనగర్, చండ్ర పుల్లారెడ్డినగర్‌లలో వర్షపునీరు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 45.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అశ్వాపురం మండలంలో 15.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
పెదవాగుకు పోటెత్తిన నీరు
అశ్వారావుపేట: వారం రోజులుగా చిరుజల్లులు పడుతూ శనివారం తెల్లవారుజాము నుంచి ఉధృతమైన వర్షంతో చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులోని పెదవాగు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 6 మీటర్లు కాగా శనివారం సాయంత్రానికే 2.5 మీటర్ల మేర వదరనీరు వచ్చి చేరింది.
వర్షం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచి నీటిని గోదావరిలోకి వదలాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. రోజంతా వర్షంతో పట్టణంలో సెలవు వాతావరణం కనిపించింది. శనివారం మొత్తంగా 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వారు పేర్కొన్నారు. ఈ వర్షం పత్తి పంటకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే అన్ని రకాల పంటలకు మేలని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment